బైబిల్ వివాదంపై క్లారెన్స్ స్కూలుకు కర్ణాటక ప్రభుత్వం నోటీసు

ABN , First Publish Date - 2022-04-27T16:42:52+05:30 IST

బైబిల్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థులంతా బైబిల్ చదవాలని పాఠశాల..

బైబిల్ వివాదంపై క్లారెన్స్ స్కూలుకు కర్ణాటక ప్రభుత్వం నోటీసు

బెంగళూరు: బైబిల్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థులంతా బైబిల్ చదవాలని పాఠశాల యాజమాన్యం నిబంధన విధించడంపై ఈస్ట్ బెంగళూరులోని రిచర్డ్స్ టౌన్‌లో ఉన్న క్లారెన్స్ హైస్కూలుకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులిచ్చింది. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని క్లారెన్స్ స్కూలుకు నోటీసులు ఇచ్చారని, పాఠశాల స్పందన తెలుసుకున్నాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి బీసీ నగేష్ తెలిపారు. పాఠశాల అనుసరిస్తున్నట్టు చెబుతున్న విధానం కర్ణాటక విద్యా చట్టానికి పూర్తి విరుద్ధమని ఆయన చెప్పారు. చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని కరాఖండిగా చెప్పిన తర్వాతే స్కూళ్లను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తుంటామని చెప్పారు. మైనారిటీ విద్యా సంస్థలకు అడ్మినిస్ట్రేషన్ పరమైన సడలింపులు ఇస్తుంటామని, అయితే మతపరమైన పుస్తకాల బోధనకు అనుమతి ఉండదని ఆయన తెలిపారు.


అవన్నీ తప్పుడు ఆరోపణలే: ఆర్చ్‌బిషప్

కాగా, బైబిల్ వివాదంపై కర్ణాటక రీజియన్ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ డాక్టర్ పీటర్ మచడో మాట్లాడుతూ, పాఠశాలపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని, తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గతంలో విద్యార్థులను బైబిల్‌ను తెమ్మనడం, చదివించడం ఒక ప్రాక్టీస్‌గా ఉండేదని, గత ఏడాది నుంచి ఏ ఒక్క విద్యార్థిని బైబిల్ తప్పనిసరిగా తేవాలని కానీ, బలవంతంగా చదవించడం గానీ  లేదని చెప్పారు. క్లారెన్స్ స్కూలు ఇప్పటికే ఈ వివరణ ఇచ్చినట్టు చెప్పారు. మైనారిటీ క్రిస్టియన్ ఇన్‌స్టిట్యూషన్‌గా బైబిల్ కానీ, రెలిజియస్ క్లాస్‌లు కానీ పాఠశాల గంటలు ముగిసిన తర్వాతే క్రిస్టియన్లకు బోధించడం జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-04-27T16:42:52+05:30 IST