హిజాబ్ వివాదంపై విచారణ బుధవారానికి వాయిదా

ABN , First Publish Date - 2022-02-16T00:46:50+05:30 IST

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై విచారణను కర్ణాటక

హిజాబ్ వివాదంపై విచారణ బుధవారానికి వాయిదా

బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను కొనసాగిస్తుంది. 


కుందపుర కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్త కామత్ మంగళవారం వాదనలు వినిపిస్తూ, భారత దేశ రాజ్యాంగం సకారాత్మక లౌకికవాదాన్ని అనుసరిస్తోందని, ఇది టర్కీ రాజ్యాంగం వంటిది కాదని చెప్పారు. టర్కీ రాజ్యాంగం నెగెటివ్ సెక్యులరిజమని చెప్పారు. ప్రతి ఒక్కరి మతపరమైన హక్కులకు మన దేశ రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు.  


కామత్ సోమవారం వినిపించిన వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వివేకంతో జారీ చేసినది కాదన్నారు. ఇది అధికరణ 25కు విరుద్ధమని, చట్టపరంగా సమర్థనీయం కాదని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఉందన్నారు. అధికరణ 25(1) పరిధిలోనికే ఈ మౌలిక మతపరమైన ఆచారాలు వస్తాయన్నారు. ఈ ఆచారాలు ప్రజా భద్రతకు హాని కలిగిస్తే, వాటిని నియంత్రించవచ్చునని తెలిపారు. హిజాబ్‌ను ఏ చట్టం ప్రకారం నిషేధించారనేదే ప్రశ్న అని చెప్పారు. 


దీనిపై కర్ణాటక హైకోర్టు స్పందిస్తూ, ఖురాన్‌లో చెప్పినవన్నీ అనివార్యమైన, ముఖ్యమైన మతపరమైన ఆచారాలా? అని కామత్‌ను ప్రశ్నించింది. దీనిపై కామత్ స్పందిస్తూ, తాను అలా అనడం లేదన్నారు. 


Updated Date - 2022-02-16T00:46:50+05:30 IST