దళిత యువకుడి హత్యకు ఉర్దూనే కారణమన్న హోంమంత్రి .. తర్వాత యూటర్న్

ABN , First Publish Date - 2022-04-07T19:27:38+05:30 IST

చంద్రు అనే వ్యక్తి (దళిత క్రిస్టియన్) తన స్నేహితుడు సైమన్ రాజ్‌తో కలిసి బుధవారం అర్థరాత్రి తినడానికి మైసూర్ రోడ్డులో బయటికి వెళ్లాడు. వెళ్లిన పని ముగించుకుని తిరిగి వస్తుండగా చందు బైక్ మరొక బైక్ ఢీకొట్టుకున్నాయి. ఇంతలో ఇరు వైపుల వాగ్వాదాలు పెరిగాయి. ఇరు వర్గాలు కొట్లాటకు దిగారు..

దళిత యువకుడి హత్యకు ఉర్దూనే కారణమన్న హోంమంత్రి .. తర్వాత యూటర్న్

బెంగళూరు: ఉర్దూ మాట్లానందుకు ఒక దళిత యువకుడిని హతమార్చారంటూ వ్యాఖ్యానించిన కర్ణాటక హోంమంత్రి కొద్ది గంటలకే యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికి అది ఉర్దూ మాట్లాడకపోవడం వల్ల కాదు, రోడ్ యాక్సిడెంట్ అనంతరం జరిగిన పరిణామాల వల్ల జరిగిన సంఘటన అని ఆయనే వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని బెంగళూరు నగర కమిషనర్ ట్విట్టర్ ద్వారా తెలిపిన తర్వాత మంత్రి ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.


కమిషనర్ కమల్ పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘చంద్రు అనే వ్యక్తి (దళిత క్రిస్టియన్) తన స్నేహితుడు సైమన్ రాజ్‌తో కలిసి బుధవారం అర్థరాత్రి తినడానికి మైసూర్ రోడ్డులో బయటికి వెళ్లాడు. వెళ్లిన పని ముగించుకుని తిరిగి వస్తుండగా చందు బైక్ మరొక బైక్ ఢీకొట్టుకున్నాయి. ఇంతలో ఇరు వైపుల వాగ్వాదాలు పెరిగాయి. ఇరు వర్గాలు కొట్లాటకు దిగారు. ఇంతలో షహీద్ అనే వ్యక్తి చందు కుడి తొడపై పొడిచాడు. అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయంతో బాధపడుతున్న చందును ఆసుపత్రికి తరలించారు. రక్తం బాగా పోవడంతో చికిత్సి పొందుతూ మరణించాడు’’ అని పేర్కొన్నారు.


అయితే ఉర్దూ మాట్లాడకపోవడం వల్లే యువకుడిని హత్య చేశారని, పలుమార్లు పొడిచి చంపారని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ విషయమై ఆయనను ప్రశ్నిస్తే.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక హోంమంత్రి వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని, ఆయన ఆ పదవికి ఎంత మాత్రం అర్హుడు కాదని విమర్శించారు. రాష్ట్రంలో మతసామర్యాన్ని దెబ్బతీసి అల్లర్లు సృష్టించేందుకు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

Updated Date - 2022-04-07T19:27:38+05:30 IST