R Ashoka: వర్షాలతో బెంగళూరు అతలాకుతలం.. సమీక్షలో బజ్జుండిపోయిన మంత్రి!

ABN , First Publish Date - 2022-09-06T22:50:36+05:30 IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బెంగళూరు (Bengaluru) అతలాకుతలం అవుతోంది. సోమవారం

R Ashoka: వర్షాలతో బెంగళూరు అతలాకుతలం.. సమీక్షలో బజ్జుండిపోయిన మంత్రి!

బెంగళూరు: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బెంగళూరు (Bengaluru) అతలాకుతలం అవుతోంది. సోమవారం ఉదయం కొన్ని నిమిషాల పాటు కురిసిన వర్షం నగరాన్ని చిగురుటాకులా వణికించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన పలువురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరం ముఖచిత్రం మారిపోయింది. సిలికాన్ వ్యాలీ కాస్తా చిత్తడిచిత్తడిగా మారిపోయింది. 


మరో మూడు నాలుగు రోజులు కర్ణాటక (Karnataka) సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవన్న భారత వాతావరణ విభాగం హెచ్చరికతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) వర్షాలపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి ఆర్.అశోక (R Ashoka) సమీక్ష జరుగుతున్నంత సేపు నిద్రమత్తులో జోగారు. సీఎం అధికారులతో మాట్లాడుతుంటే అదేమీ పట్టనట్టు మంత్రి ఎంచక్కా బజ్జుండిపోయారు. అమాత్యుని నిద్ర ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress )కు అస్త్రమైంది. సమీక్షలో నిద్రపోతున్న మంత్రి ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కర్ణాటక కాంగ్రెస్.. ‘‘మునకలు చాలా రకాలు. రాష్ట్ర ప్రజలు వర్షాల్లో మునిగిపోతున్నారు. మంత్రి నిద్రలో మునుగుతున్నారు’’ అని క్యాప్షన్ తగిలించింది. కాగా, బెంగళూరులో వరదల పరిస్థిని చక్కదిద్దేందుకు రూ.300 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం బొమ్మై తెలిపారు. 



Updated Date - 2022-09-06T22:50:36+05:30 IST