బెంగళూరు వచ్చిన ఆ ఇద్దరిలో ఒకిరికి ఒమైక్రానేనా?.. దేశంలో ఇదే తొలి కేసు అవుతుందా?

ABN , First Publish Date - 2021-11-30T01:43:41+05:30 IST

ప్రపంచం మొత్తం ఒమైక్రాన్ వేరియంట్ భయంతో వణుకుతున్న వేళ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి చేసిన..

బెంగళూరు వచ్చిన ఆ ఇద్దరిలో ఒకిరికి ఒమైక్రానేనా?.. దేశంలో ఇదే తొలి కేసు అవుతుందా?

బెంగళూరు: ప్రపంచం మొత్తం ఒమైక్రాన్ వేరియంట్ భయంతో వణుకుతున్న వేళ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి చేసిన ప్రకటన మరింత ఆందోళనకు కారణమైంది. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టావేరియంట్‌కు భిన్నంగా ఉందని మంత్రి డాక్టర్ కె.సుధాకర్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు అధికారికంగా ఏమీ చెప్పలేనని, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ, భారత వైద్య విధాన మండలి (ఐసీఎంఆర్)తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. 

 

గత తొమ్మిది నెలలుగా డెల్టా వేరియంట్ మాత్రమే ఉనికిలో ఉందని పేర్కొన్న మంత్రి.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టావేరియంట్‌కు భిన్నంగా ఉండడంతో అది ఒమైక్రాన్ అని అంటున్నారని, కానీ ఆ విషయాన్ని తాను అధికారికంగా చెప్పలేనని అన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఆ నమూనాను ఐసీఎంఆర్‌కు పంపినట్టు చెప్పిన మంత్రి.. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే, తాజా పరీక్షల్లో మాత్రం అతడికి భిన్నమైన వేరియంట్ సోకినట్టు తేలిందన్నారు.

 

‘‘ఆయన వయసు 63 సంవత్సరాలు. ఆ వ్యక్తి పేరును నేను బయటపెట్టకూడదు. అతడి కొవిడ్ రిపోర్టు కొంత భిన్నంగా ఉంది. డెల్టావేరియంట్‌కు భిన్నంగా ఉంది. ఐసీఎంఆర్‌తో చర్చిస్తున్నాం. త్వరలోనే ఏ విషయం వెల్లడిస్తాం’’ అని డాక్టర్ సుధాకర్ వివరించారు. ఈ నెల 11, 20 తేదీల్లో సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-11-30T01:43:41+05:30 IST