Letter To PM Modi: బొమ్మయ్ ప్రభుత్వం అవినీతిమయం : 13,000 పాఠశాలలు

ABN , First Publish Date - 2022-08-27T18:39:07+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం

Letter To PM Modi: బొమ్మయ్ ప్రభుత్వం అవినీతిమయం : 13,000 పాఠశాలలు

బెంగళూరు : ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థల సంఘాలు ఆరోపించాయి. పాఠశాలలకు రికగ్నిషన్ సర్టిఫికేట్లను జారీ చేయడానికి రాష్ట్ర విద్యా శాఖ విపరీతమైన లంచాలు డిమాండ్ చేస్తోందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి లేఖ రాశాయి. 


ది అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్, ది రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ లేఖను రాశాయి. దాదాపు 13,000 ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలకు ఈ సంఘాలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. అశాస్త్రీయమైన, హేతుబద్ధత లేని, వివక్షాపూరితమైన, ఆచరణ సాధ్యంకానటువంటి నిబంధనలను కేవలం అన్ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తోందని ఈ లేఖలో మోదీకి తెలిపాయి. అవినీతి తార స్థాయిలో ఉందని ఆరోపించాయి. 


రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్‌కు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని చెప్పాయి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మొత్తం వ్యవస్థలోని దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి విద్యా మంత్రిత్వ శాఖ సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. బడ్జెట్ స్కూళ్ళకు ఇద్దరు బీజేపీ విద్యా శాఖ మంత్రులు తీరని నష్టం చేశారని ఆరోపించాయి. ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న, తల్లిదండ్రుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు గుంజుతున్న పాఠశాలల కన్నా బడ్జెట్ స్కూళ్ళను దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నాయి. 


Updated Date - 2022-08-27T18:39:07+05:30 IST