మా అధికారాన్ని లాగేసుకున్నారు...

ABN , First Publish Date - 2022-05-19T16:42:47+05:30 IST

జిల్లా పంచాయతీ, తాలుకా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల ఖరారు, వార్డుల పునర్విభజన ఇత్యాది అంశాలలో తమకున్న పరమాధికారాన్ని ప్రభుత్వం

మా అధికారాన్ని లాగేసుకున్నారు...

- హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొర

- జడ్పీ, టీపీ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం అడ్డు తగులుతోందని ఆరోపణ


బెంగళూరు: జిల్లా పంచాయతీ, తాలుకా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల ఖరారు, వార్డుల పునర్విభజన ఇత్యాది అంశాలలో తమకున్న పరమాధికారాన్ని ప్రభుత్వం ఉపసంహరించిందని హైకోర్టు ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం వాపోయింది. రాష్ట్రంలో జడ్పీ, టీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం దాఖలు చేసిన అత్యవసర పిటీషన్‌పై న్యాయమూర్తులు ఎస్‌జీ పండిట్‌, ఎంజీ ఉమాలతో కూడిన డివిజనల్‌ బెంచ్‌ మంగళవారం విచారణ ప్రారంభించింది. ఎన్నికల సంఘం తరుపున తన వాదన వినిపించిన న్యాయవాది కేఎన్‌ ఫణీంద్ర సుప్రీంకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లేఖించారు. రాష్ట్ర ప్రభుత్వం 2021లోని సంబంధిత చట్టానికి సవరణలు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధి నుండి కొన్ని అధికారాలను తప్పించిందన్నారు. ఫలితంగా ఎన్నికల ప్రక్రియకు బ్రేక్‌ పడిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌లో అవధి పూర్తయిన జిల్లా తాలుకా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని వార్డుల పునర్విభజన కూడా జరిపామని ఇక  ఎన్నికల తేదీలు ఖరారు చేద్దామనుకునేలోపే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కేటాయింపు అధికారాలను తమకు లేకుండా చట్టసవరణతో తొలగించారని ఎన్నికల సంఘం తరుపున పిటీషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ రెండు అధికారాలను మరో ప్రత్యేక ప్రభుత్వ కమిషన్‌కు అప్పగించారని న్యాయవాది వివరించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.


ఆరోపణలు - ప్రత్యారోపణలు

రాష్ట్రంలో తాలుకా జిల్లా పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యంలేకే అధికార బీజేపీ ఇలా చేసిందని ప్రతిపక్షాలపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు విరుచుకుపడ్డాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలకు కత్తెర వేయడం వెనుక దురుద్దేశ్యం కనిపిస్తోందని విరుచుకుపడ్డారు. స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడాన్ని ఆయన గుర్తుచేస్తూ ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధమైన సంస్ధలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆక్రోశం వ్యక్తంచేస్తూ బుధవారం ట్వీట్‌ చేశారు. ఎన్నికల నిర్వహణకు మోకాలొడ్డేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని మండిపడ్డారు. హైకోర్టులో ఎన్నికల సంఘానికి విజయం దక్కుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా జేడీఎ్‌సకు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే దొడ్డిదారిలో ఎన్నికలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికలకు భయపడి కాదని మంత్రి గోవింద కార్జోళ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నామన్నారు.

Updated Date - 2022-05-19T16:42:47+05:30 IST