ఆరని అసమ్మతి మంటలు

ABN , First Publish Date - 2021-06-15T18:40:50+05:30 IST

రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదంటున్నా అసమ్మతి నేతలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ బెంగళూరుకు వస్తున్నందున ఈలో

ఆరని అసమ్మతి మంటలు

- మరింత రగిల్చిన ప్రత్యర్థులు 

- ఢిల్లీలో అరుణ్‌సింగ్‌ను కలిసిన బెల్లద్‌ 

- సీఎం నివాసానికి ఆప్తుల క్యూ 

- రేపే నగరానికి బీజేపీ ఇన్‌చార్జ్‌ రాక 


బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదంటున్నా అసమ్మతి నేతలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ బెంగళూరుకు వస్తున్నందున ఈలోగానే మరింత పటిష్టం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యర్థులు సిద్ధమవుతున్నారు. ఓ వైపు ఢిల్లీలో మకాం వేసిన సీనియర్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లద్‌ సోమవారం అరుణ్‌సింగ్‌ను కలిశారు. ఇప్పటికే బీఎల్‌ సంతోష్ తో నిరంతరంగా అందుబాటులో ఉన్న బెల్లద్‌ రాష్ట్రంలోని పరిస్థితులను అరుణ్‌సింగ్‌కు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, సునీల్‌కుమార్‌, తిప్పారెడ్డి తదితరులు మంగళవారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే యడియూరప్పకు ఆప్తులుగా ఉండేవారు అధికారిక నివాసానికి పరుగులు తీశారు. అరుణ్‌కుమార్‌ పూజార్‌, గోపాలకృష్ణ, పరన్నమునవళ్లి, నాగేంద్ర, దొడ్డనగౌడ పాటిల్‌ తదితరులు సీఎంను కలిశారు. కాగా అరుణ్‌సింగ్‌ పర్యటన ఖరారైంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు  బెంగళూరుకు చేరుకుని తొలుత కుమారకృప అతిథిగృహానికి వెళతారు. అక్కడి నుంచి 5 గంటలకు బీజేపీ కార్యాలయం జగన్నాథ్‌భవన్‌కు చేరుకుంటారు. కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 28 మంది మంత్రులతో సమావేశం ఉంటుంది. మంత్రుల భేటీకి ముఖ్యమంత్రిని ఆహ్వానించరాదని, అదే జరిగితే మనసులోని భావాలు చెప్పుకునేందుకు వీలుండదని ఇప్పటికే అరుణ్‌సింగ్‌కు మంత్రి సీపీ యోగేశ్వర్‌ కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ ముఖ్యమంత్రిని బయటపెట్టి సమావేశం జరిగితే నాయకత్వ మార్పు అంశం మరింత ముందుకెళ్లినట్టే అవుతుంది. మరోవైపు అరుణ్‌సింగ్‌ తరచూ ముఖ్యమంత్రి యడియూరప్పను, ఆయన కుమారుడు విజయేంద్రను వెనకేసుకొస్తున్నారని, ఏకంగా అరుణ్‌సింగ్‌ మార్పు చేస్తే రాష్ట్రంలో తమ వ్యూహం చెల్లుబాటు అవుతుందనే ప్రయత్నాల్లో అసమ్మతి నేతలు ఉన్నారు. 

Updated Date - 2021-06-15T18:40:50+05:30 IST