వారు జై శ్రీరామ్ అన్నారు.. నేను అల్లాహు అక్బర్ అన్నాను: విద్యార్థిని

ABN , First Publish Date - 2022-02-09T01:36:23+05:30 IST

హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో చెలరేగిన హింసకు సంబంధించిన..

వారు జై శ్రీరామ్ అన్నారు.. నేను అల్లాహు అక్బర్ అన్నాను: విద్యార్థిని

బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని గట్టిగా నినదించడం కనిపించింది. కాషాయ కండువాలు ధరించిన మరో వర్గం విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినదిస్తుండగా, ప్రతిగా ఆమె వారి ఎదుట ధైర్యంగా ‘అల్లా హు అక్బర్’ అని నినాదాలు చేసింది.


ఓ జాతీయ న్యూస్ చానల్‌తో ఆమె మాట్లాడుతూ తన పేరు ముస్కాన్ అని తెలిపింది. ఈ ఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. అసైన్‌మెంట్ సమర్పించేందుకు చేసేందుకు తాను కాలేజీలోకి వెళ్తుండగా బురఖా ధరించానన్న కారణంతో కొందరు తనను అడ్డుకున్నారని పేర్కొంది. బురఖా తీశాకే లోపలికి వెళ్లాలని వారు చెప్పారని ముస్కాన్ వివరించింది. ఈ క్రమంలో వివాదం ముదరడంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగి హింసాత్మకంగా మారింది.



తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గుంపును ధైర్యంగా ఎదురొడ్డినందుకు ముస్కాన్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు మాత్రం హిజాబ్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న గుంపునకు వ్యతిరేకంగా ఆమె మతపరమైన నినాదాన్ని ఉపయోగించారని మరికొందరు ఆరోపిస్తున్నారు.


తాను రాగానే జై శ్రీరామ్, జైశ్రీరామ్ అని నినదించారని పేర్కొన్న ముస్కాన్.. వారిలో చాలామంది కాలేజీకి చెందిన వారు కాదని పేర్కొంది. ప్రిన్సిపల్, లెక్చరర్లు తనకు అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకుంది. తాను వెళ్తుండగా వారు జై శ్రీరాం అని అన్నారని, ప్రతిగా తాను అల్లా హు అక్బర్ అన్నారని, అంతకుమించి ఇంకేమీ లేదని ముస్కాన్ వివరించింది.

Updated Date - 2022-02-09T01:36:23+05:30 IST