జిల్లాలో మరణాలపై ప్రభుత్వం ఆరా!

ABN , First Publish Date - 2021-04-23T05:55:10+05:30 IST

గత 12 రోజులుగా జిల్లాలో జరుగుతున్న మరణాలకు సంబంధించి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నుంచి సమాచారం తెప్పించుకొంది.

జిల్లాలో మరణాలపై ప్రభుత్వం ఆరా!

కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చినా చనిపోతున్నారు

జిల్లాలో 18 మంది నెగెటివ్‌తో మృతి

48 మృతదేహాలకు ఎలాంటి వివరాలు లేవు

గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): గత 12 రోజులుగా జిల్లాలో జరుగుతున్న మరణాలకు సంబంధించి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నుంచి సమాచారం తెప్పించుకొంది. ఈ నెల 10వ తేదీ నుంచి మొత్తం 122 మరణాలు సంభవించగా అందులో కొవిడ్‌ కన్‌ఫర్‌మేటివ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవి 33 మాత్రమే. 48 మృతదేహాలకు సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. 18 మందికి నెగెటివ్‌ రిపోర్టులు వచ్చినా వారు చనిపోయారు. 11 మంది ఆధార్‌ నెంబర్లు లేవు. ఇద్దరివి శాంపిల్‌ అయితే తీశారు కాని కొవిడ్‌ పాజిటివ్‌/ నెగెటివ్‌ నిర్ధారణ జరగలేదు. దీంతో శ్మశానవాటికల్లో దహనం చేస్తోన్న మృతదేహాల్లో కొవిడ్‌-19గా నిర్ధారణ జరిగినవి కొన్నే ఉంటున్నాయి. మిగతా మరణాలకు దారి తీసిన కారణాలపై స్పష్టత లేకుండా పోయింది. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి కొవిడ్‌-19 సోకినట్లు అని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్‌ రిపోర్టు లేకుండా జరిగే మరణాలు కరోనా చావుల కిందకు రావని పేర్కొంటున్నాయి. గుంటూరు నగరంలో అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించే ఛారిటబుల్‌ ట్రస్టులు మూడు, నాలుగు ఉన్నాయి. ఆయా ట్రస్టులు మరణానికి దారి తీసిన కారణాల గురించి వివరాలు సేకరించవు. సాయం కోరగానే వెంటనే పార్థివ దేహాలకు అంత్యక్రియలు జరిపిస్తాయి. గత కొద్ది రోజుల నుంచి గుంటూరు నగరంలోని శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి అనారోగ్యంతో ఇక్కడి ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన వారు చనిపోతే వారి దేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లకుండా ఛారిటబుల్‌ ట్రస్టుల ద్వారా ఇక్కడే అంత్యక్రియలు జరిపిస్తున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు దహన సంస్కారాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా గత 10 రోజుల్లో కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చి 18 మంది చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి కారణం వారికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని వైద్య వర్గాలు సందేహిస్తున్నాయి. 


Updated Date - 2021-04-23T05:55:10+05:30 IST