Advertisement

కర్షక భారత్–కార్పొరేట్ ఇండియా

Jan 16 2021 @ 03:32AM

సామ్యవాద సమాజాన్ని ప్రజలు స్వప్నిస్తున్న, పాలకులూ హామీ ఇస్తున్న కాలమది. 1960వ దశకపు హిందీ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకోండి. శ్రామిక జన పీడకుడు అయిన పారిశ్రామిక వేత్త ఆ సినిమాలలో మనకు విలన్‌గా తరచు కనిపిస్తాడు. అటువంటి సుపరిచిత మూస ప్రజా ‘శత్రువు’ ఒకరిని ఇప్పటి రైతు నిరసనలు పునఃసృష్టించాయి. న్యూఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో వారు ఇంచుమించు యాభై రోజులుగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అదానీ, అంబానీలను లక్ష్యంగా చేసుకున్న పోస్టర్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధిక్షేపిస్తున్న పోస్టర్లతో పాటు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో రైతులు రిలయన్స్ జియో టవర్లను ధ్వంసం చేస్తున్నారు; అదానీ కంపెనీల ఉత్పత్తులను బాయ్ కాట్ చేస్తున్నారు. ఆ ఇరువురు కార్పొరేట్ కుబేరులపై అన్నదాతల ఆగ్రహం అవధులు మీరిపోతోంది. పరిస్థితుల తీవ్రతను గ్రహించిన అదానీ, అంబానీ కంపెనీలు తమకు ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి ప్రవేశించే ఆలోచన లేనేలేదని బహిరంగ ప్రకటనలు చేశాయి. మోదీ ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ప్రారంభమైన రాజకీయ సంఘర్షణ వర్తమాన భారతదేశపు రెండు అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఎందుకు, ఎలా పరిణమించింది? 


కార్పొరేట్ ఇండియా ఇటీవలికాలంలో ఇంతగా ప్రజల ఆగ్రహానికి గురికాలేదు. ఒక ప్రజా ఉద్యమం చివరిసారి వ్యాపార దిగ్గజాలను లక్ష్యంగా చేసుకున్నది 2011 అవినీతి నిర్మూలన ఉద్యమంలో. అరవింద్ కేజ్రీవాల్ మొదలైన రాజకీయ వేత్తలు పాదుకుపోయిన రాజకీయ-వ్యాపార కులీన వర్గాల వారిపై దాడులలో భాగంగా నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కేజ్రీవాల్ తన వైఖరిని మార్చుకున్నారు. కేజ్రీవాల్ తరహా రాజకీయ క్రియాశీలతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టారు. 2014 సార్వత్రక ఎన్నికల ప్రచారంలో ‘అదానీ-అంబానీ’ పై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికలలో తమ పార్టీ పరాజయం పాలయినప్పటికీ ఆయన ఆ ధోరణి నుంచి వెనుకకు తగ్గలేదు. 2015లో మోదీ సర్కార్‌ను ‘సూట్-బూట్‌కి సర్కార్’ అని విమర్శించడం ద్వారా రాహుల్ సంచలనం సృష్టించారు. బీజేపీ కూడా ఆ విమర్శలకు కలవరపడింది. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ప్రజలు విశ్వసించేందుకు గాను మోదీ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. వినూత్న చొరవతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. నోట్లరద్దు సైతం సంపన్నుల వ్యతిరేక, పేదల అనుకూల నిర్ణయమని ముమ్మర ప్రచారం చేసింది. 


కొత్త సాగు చట్టాలపై రైతుల ఆందోళన రాహుల్ కు మరొక మహదవకాశాన్ని కల్పించింది. ‘అదానీ-అంబానీ’పై రాహుల్, ఇతర కాంగ్రెస్ నాయకుల విమర్శలు పలువురిని సందిగ్ధంలో పడవేస్తున్నాయి. ఆ విమర్శలు ఆ పార్టీ నయవంచనకు తార్కాణాలుగా కన్పిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్ సంస్థలకు అన్ని విధాల అండదండలనిచ్చే ఆనవాయితీని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అన్నది వాస్తవం. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే వేళ్ళూనింది. ఇందిరాగాంధీ, -ప్రణబ్ ముఖర్జీల తోడ్పాటుతోనే అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. 1990 దశకం తొలినాళ్ళలో గుజరాత్‌లో కాంగ్రెస్ మద్దతు గల చిమన్‌భాయ్‌ పటేల్ ప్రభుత్వ హయాంలో గౌతమ్ అదానీ కూడా తన వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల లైసెన్స్-పర్మిట్ రాజ్ రాజకీయాల నుంచి అమితంగా లబ్ధి పొందిన వ్యాపార దిగ్గజాలలో అంబానీ- అదానీలు కూడా ఉన్నారు. 


అంతకంతకూ తీవ్రమవుతున్న ప్రస్తుత రాజకీయ వివాదం నుంచి తమను తాము విడిపించుకునేందుకు వర్తమాన భారతదేశపు రెండు అతి పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే తంటాలుపడుతున్నాయి. మీడియా వాతావరణంలో పెనుమార్పులే ఇందుకు ప్రధాన కారణం. యూట్యూబ్ చానెల్స్ నుంచి సామాజిక మాధ్యమాల దాకా ఎన్నో వేదికలు ప్రజలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ప్రచార యంత్రాంగానికి దీటుగా పౌరుల క్రియాశీలత పెరిగిపోయింది. దేనినీ దాచలేని పరిస్థితి. వైరల్ విడియోలు సత్యానికి, ప్రచారానికి మధ్య విభజన రేఖలను చెరిపివేశాయి. శక్తిమంతమైన, పలుకుబడి గల వ్యాపార సంస్థలు సైతం మల్టీ మీడియా ప్రభావశీలతకు తల్గొక తప్పడం లేదు. 


కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతోన్న రైతు పోరాటం– కార్పొరేట్ కుబేరులు, వారి రాజకీయ మద్దతుదారులకు, రైతులకు మధ్య జరుగుతున్న పోరుగా ప్రజల మనస్సులో ముద్ర పడింది. రక్తం గడ్డకట్టే చలిలో ‘అన్నదాత’ దైన్య స్థితి, విలాసవంతమైన విల్లాలలో సంపన్నుల జీవనశైలిని చూస్తున్నవారిలో ఆ అంతరాలపై ఆగ్రహం చెలరేగడం సహజం. తీవ్ర భావోద్వేగాలు విచక్షణను విస్మరిస్తాయి. అదానీలు, అంబానీలు ప్రధాన మంత్రి స్వరాష్ట్రం నుంచి ప్రభవించిన వారు. అత్యున్నత పదవిలోని వ్యక్తికి సన్నిహితులు కావడంతో వారు అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నారన్న భావన మధ్యతరగతి ప్రజలలో ఉంది. అదానీ, అంబానీలతో తన సన్నిహిత సంబంధాలను ప్రధానమంత్రి సైతం ఎప్పుడూ దాచుకోలేదు. 2014 సార్వత్రక ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ పూర్తిగా అదానీ వ్యక్తిగత విమానంలోనే దేశవ్యాప్తంగా పర్యటించారు. చివరకు ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు అదానీ విమానంలోనే ఆయన న్యూఢిల్లీకి వచ్చారు.


గత దశాబ్దపు ఆర్థిక మాంద్యపు క్లిష్ట పరిస్థితుల్లో అత్యధిక భారతీయుల ఆదాయాలు తగ్గిపోగా అతి కొద్ది మంది కార్పొరేట్ కుబేరుల ఆస్తులు అపరిమితంగా పెరిగిపోవడం మరొక విస్మరించలేని వాస్తవం. టెలికాం, పెట్రోలియం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు మొదలైన లాభసాటి రంగాలలో నిర్దిష్ట పారిశ్రామిక వేత్తల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో అపరిమితంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు ఇదొక దృష్టాంతం. ఈ అసమానతలను నియంత్రించే వ్యవస్థ ఏదీ లేకపోవడం చాలా మందిని కలవరపరుస్తోంది. అయినా ఈ కఠోర వాస్తవాలను ప్రజలు సహిస్తున్నారనే చెప్పవచ్చు. కారణమేమిటి? ఆర్థిక సంస్కరణల అనంతరం భారతీయ మధ్యతరగతి వర్గాల మనోవైఖరులలో ఒక స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. అంతకు ముందు వారు సంపద సృష్టించే కుబేరుల నీతినిజాయితీలను సందేహించేవారు. వారిపై నిందలు మోపేవారు. అర్థిక సంస్కరణల అనంతరం మధ్యతరగతి వారిలో ఇటువంటి ధోరణులు కన్పించడం లేదు. భాగ్యవంతులు చెడ్డవారుగా, సమాజ శ్రేయస్సుకు హానికారులుగా భావించడం లేదు. పైగా వ్యవస్థాపనా సామర్థ్యాన్ని, సంపద సృష్టించే దక్షతను ప్రస్తుతిస్తున్నారు. అటువంటి వ్యక్తులను ఆదర్శంగా కూడా తీసుకొంటున్నారు. అయితే కొవిడ్ ఉపద్రవంలో అసంఖ్యాక ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు. కొత్త ఉపాధులు కొరవడ్డాయి. సంప్రదాయ జీవనాధారాలనుంచి విసరివేయబడిన వారు మరింత విపత్కర పరిస్థితులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమ సమస్యల పరిష్కారంలో పాలకులు తగు శ్రద్ధ చూపడం లేదనే భావం వారిలో ఏర్పడింది. అతి కొద్దిమందికి మాత్రమే ప్రభుత్వాలు విశేష లబ్ధిని సమకూరుస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


అదానీలు, అంబానీలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న రైతుల నిరసనలు అవ్యవస్థితంగా ఉన్నాయి. అయితే ఆవిర్భవిస్తోన్న మార్కెట్ గుత్తాధిపత్యాలపై సమాజంలో విస్తృతంగా నెలకొన్న అసంతృప్తిని రైతుల ఆందోళనలు ప్రతిబింబిస్తున్నాయి. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు చేపడతాననే హామీతో 2014లో నరేంద్ర మోదీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ‘నేను లంచం తీసుకోను, మరెవ్వరూ తీసుకోవడాన్ని అనుమతించను’ అని మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ హామీ ఆ ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధాన అంశమై ఓటర్లను విశేషంగా ప్రభావితం చేసింది. యూపీఏ ప్రభుత్వాల కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు మోదీ హామీని విశ్వసించారు. ఆయనకు అధికారాన్ని అప్పగించారు. వ్యక్తిగత అవినీతికి పాల్పడని పాలకుడుగా తనకు ఉన్న పేరు ప్రతిష్ఠలను మోదీ పూర్తిగా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆశ్రిత పక్షపాతం వహిస్తారనే అపప్రథను ఆయన తొలగించుకోవల్సి ఉన్నది. ఇది అవశ్యం. లేని పక్షంలో సింఘు నుంచి వీస్తున్న నిరసన పవనాలు ప్రచండ ప్రభంజనాలుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు.


తాజా కలం: సింఘులో నేను కొంతమంది యువ రైతులను కలుసుకున్నాను. మోదీ ప్రభుత్వంతో ‘అదానీ-అంబానీ’ సంబంధాలను పరిహస్తున్న తాజా వీడియో నొకదాన్ని వారు నాకు చూపించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే వారందరూ జియో మొబైల్ వినియోగదారులే!

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్్ట)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.