ఏపీలో కార్తీకమాస శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

ABN , First Publish Date - 2021-11-05T14:40:31+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాస శోభ సంతరించుకుంది. కార్తీక మాసం తొలిరోజు కావడంతో రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఏపీలో కార్తీకమాస శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాస శోభ సంతరించుకుంది. నేటి నుంచి  కార్తీక మాసం ప్రారంభంకావడంతో రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీకమాసం తొలిరోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు  పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 


ప్రకాశం: కార్తిక మాసం తొలిరోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. శివాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఒంగోలు, చీరాలలో ఉదయం నుండే శైవ క్షేత్రాలకు భక్తులు బారులు తీరారు. పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయ ప్రాంగణంలో కార్తిక దీపాలను వెలిగించారు. దేవస్దాన కమిటి సభ్యులు శివాలయాలను విద్యుత్ దీపాలంకరణలతో శోభయామానంగా తీర్చిదిద్దారు. 


విజయవాడ: కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అంటూ శివాలయాలలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం, బిల్వార్చనలు, లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన, రుద్ర హోమము, ఉంజల సేవ, కార్తీక మాసం నెలరోజులపాటు పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. నేటి నుండి సాయంత్రం వేళ ఆకాశదీపం ప్రారంభంకానుంది. శివ మాలలతో పెద్ద సంఖ్యలో  శివ భక్తులు కృష్ణా నది వద్ద సాన్నం  ఆచరిస్తున్నారు. 


పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుండి 14 వరకు  సప్తాహ మహోత్సవములు జరుగనున్నాయి. కార్తీక మాసం తొలి రోజు  కావడంతో ఉదయం నుంచే  ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

* కార్తీక మాసం మొదటి రోజు కావడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివనామస్మరణతో శివాలయం మారు మోగుతోంది.  


విశాఖపట్నం:  కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణలతో  శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. 


పశ్చిమ గోదావరి: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని  భీమవరంలో గల పంచారామక్షేత్రం సోమారామంకు భక్తులు పోటెత్తారు. సోమేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. అమావాస్య కావడంతో ముదురు గోధుమ వర్ణంలో సోమేశ్వరస్వామి దర్శనమిస్తున్నారు.  


Updated Date - 2021-11-05T14:40:31+05:30 IST