కనుల పండువగా కార్తీక పూజలు

ABN , First Publish Date - 2021-11-30T06:54:53+05:30 IST

మండలంలోని లక్కవరం గ్రామంలో శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం చివరి రోజును పురస్కరించుకొని శివభక్తులుఆవుల కృష్ణస్వామి నేతృత్యంలో మహారుద్రహోమం నిర్వహించారు.

కనుల పండువగా కార్తీక పూజలు

శివాలయాల్లో విశేష పూజలు 

తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు

మార్మోగిన శివనామస్మరణ

తాళ్లూరు నవంబరు 29: మండలంలోని లక్కవరం గ్రామంలో శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం చివరి రోజును పురస్కరించుకొని శివభక్తులుఆవుల కృష్ణస్వామి నేతృత్యంలో మహారుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ హోమాన్ని తిలకించేందుకు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా  భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఎండుకొబ్బరి, కర్పూరం, ఆవునెయ్యి, నవఽధాన్యాలను హోమంలో వేసి పూజలు నిర్వహించారు.

భక్తులతో పోటెత్తిన ఆలయాలు

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు వేకువజామునే కార్తీకస్నానాలు చేసి శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, శివరాంపురం, బొద్దికూరపాడు,తదితరగ్రామాల్లోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులకు అన్నదానం చేశారు.

పామూరు : స్థానిక వల్లిభుజంగేశ్వర దేవస్థానంలో కార్తీకమాస చివరి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. పలువురు మహిళా భక్తులు కార్తీక దీపాలతో శివలింగ ఆకారాన్ని వేశారు. ఈ సందర్భంగా ఆకుపాటి రమణయ్య దంపతులు, ఆకుపాటి వెంకటేష్‌ దంపతులు భక్తలకు ప్రసాద వితరణ చేశారు.  దైవస్థాన చైర్మన్‌ కె బాలగుర్నాధం పాల్గొన్నారు. గోపాలపురం గ్రామం వద్ద జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో కార్తీక వనభోజనాలను నిర్వహించారు. చల్లగొలుసు వెంకటేశ్వర్లు దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ సీహెచ్‌ సుబ్బయ్య, ఉపసర్పంచ్‌ వైవి సాయికిరణ్‌, జి హుస్సేన్‌రెడ్డి, పువ్వాడి రాంబాబు, అంచూరి సత్యంరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దాదిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ పార్వతి సమేత నీలకంఠేశ్వరుడు, పడమటకట్టకిందపల్లిలోని శ్రీ కామాక్షి సమేత దుర్గా మల్లేశ్వరుడు, బొట్లగూడూరులోని పార్వతి సమేత రామలింగేశ్వరుడు, మోపాడులోని గొంది మల్లేశ్వరుడు దేవస్ధానాల్లో కార్తీక సోమవారం పూజలు జరిగాయి.

పీసీపల్లి : కార్తీక సోమవారం పురస్కరించుకుని మండలంలోని పెదయిర్లపాడు మల్లేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. మాలధరించిన అయ్యప్ప భక్తులు వేకువఝామున ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి పూజలు నిర్వహించడంతో పాటు అయ్యప్ప భక్తి పాటలు పాడి భజనలు చేశారు. మహిళలు మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీ.ఎస్‌.పురంలో  ఇండ్లా సత్యం దంపతులు అప్పయ్యలకు భిక్ష ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ పద్మావతి, ఉపసర్పంచ్‌ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు :  కార్తీక మాసం ఆఖరి సోమవారం భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పులిపాడు, పెద ఉల్లగల్లు, పసుపుగల్లు,  మారెళ్ళ, ఈదర, పోలవరం గ్రామాల్లో వేంచేసి ఉన్న శివాలయాలు తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. మండలంలోని పెద ఉల్లగల్లులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు పూజలు నిర్వహించారు. మండలం మొత్తం మీద కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు కిటకిట లాడిపోయాయి.

Updated Date - 2021-11-30T06:54:53+05:30 IST