ఆరు శక్తులు ఒక్కటై...

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకటి చేసి ఒక శరీరంలో ఇమడ్చడమే దీనిలోని విశిష్టత. అంటే ఒకే శరీరంలో ఆరు జీవాలు ఉంటాయన్నమాట!

ఆరు శక్తులు ఒక్కటై...

శివుడిలోని పంచభూతతత్త్వానికి, పార్వతిలోని ప్రకృతితత్త్వం కలిసి ఒకే శరీరంలో ఆరుగురి కూర్పుతో ఉద్భవించినవాడు కార్తికేయుడు. అతడి జననం, తండ్రితో విభేదించి దక్షిణాదికి సాగించిన ప్రయాణం, యోధుడిగా, యోగిగా కార్తికేయుడి ప్రస్థానం అద్భుతం, అపూర్వం.


శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకటి చేసి ఒక శరీరంలో ఇమడ్చడమే దీనిలోని విశిష్టత. అంటే ఒకే శరీరంలో ఆరు జీవాలు ఉంటాయన్నమాట! ఇటువంటి ప్రయోగాలు పూర్వం చాలా జరిగాయి. పూర్వం ఇద్దరు యోగులు ఒకే శరీరం పంచుకున్నారు. వాళ్లు రెండు భిన్నమైన భాషలు మాట్లాడతారు, భిన్నంగా ఉంటారు. కాని ఇక్కడ ఆరు ప్రాణులు ఒకే శరీరంలో ఉండడం ఊహకు అందనిది. ఈ అద్భుతం ఎలా జరిగింది?

పరమేశ్వరుడికి సంతానం లేదు. ఆయన బీజాన్ని గర్భంలో నిలుపుకొనే శక్తి ఉన్నవారు దేవ, మానవుల్లో లేరు. కాబట్టి ఆయన తన రేతస్సును హోమగుండంలో విడిచిపెట్టాడు. దాన్ని ఆరుగురు కృత్తికలు తమ గర్భాశయాలలో ధరించారు. వారు అప్సరసలు, ఈ గ్రహానికి చెందని దివ్యాంగనలు. మూడున్నర నెలలు గడిచాయి. వారి గర్భాలలో పిండాలు అభివృద్ధి చెందాయి. కృత్తికలు సామాన్య స్త్రీలకన్నా ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ తమ గర్భాలలోని పిండాల వేడిని వాళ్ళు భరించలేకపోయారు. ఆ పిండాలను బయటకు తెచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఇది తెలుసుకున్న పార్వతీదేవి ఆ పిండాలను తామరాకుల్లో చుట్టింది. విడివిడిగా ఆరుగురు శిశువులూ బతకడం కష్టమని గ్రహించింది. అయితే ఆ శిశువుల్లో ఆరు గొప్ప లక్షణాలను ఆమె గుర్తించింది. ‘ఈ లక్షణాలన్నీ ఒకే మనిషిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది!’ అనుకుంది. తన తాంత్రిక శక్తులతో ఆరు పిండాలనూ ఒకటి చేసింది. ఒకే శరీరంలో ఆరుగురు శిశువులనూ కూర్చింది. సుబ్రహ్మణ్యస్వామి జన్మించాడు. ఆయనకు ‘షణ్ముఖుడు’ అనే పేరుంది. కార్తికేయుడిగా, స్కంధుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. అతను అసమాన శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. ఎనిమిదేళ్ళ వయసుకే అజేయుడైన యోధుడయ్యాడు. 


తల్లిదండ్రుల్ని వదలి దక్షిణాదికి..

ఎంతో వేగంగా ఎగిరే తన వాహనమైన నెమలి మీద సుబ్రహ్మణ్యస్వామికి ఎంతో నమ్మకం. సుబ్రహ్మణ్యుడికీ, అతని సోదరుడు గణపతికీ మధ్య ఒకసారి వివాదం తలెత్తింది. భూమిని ఎవరు వేగంగా చుట్టి వస్తారని పందెం వేసుకున్నారు. గెలిచినవారికి తల్లితండ్రుల నుంచి ఒక ప్రత్యేకమైన మామిడిపండు బహుమతిగా లభిస్తుంది. ఇద్దరూ బయలుదేరారు. కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా పైకి ఎగిరాడు. ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాడు. అప్పటికే గణపతి అక్కడికి చేరుకోవడం, బహుమతి అయిన మామిడి పండును తినడం కూడా అయిపోయింది. ఇది చూసిన సుబ్రహ్మణ్యుడికి ఆశ్చర్యంతోపాటు కోపం కూడా కలిగింది. ‘‘నేను ప్రపంచాన్ని చుట్టి వచ్చాను. ఈ గణపతి కనీసం ఇక్కడి నుంచి కదలలేదు. ఇదెలా సాధ్యం? అతనికి మామిడి పండు ఎందుకు ఇచ్చారు?’’ అని తల్లిదండ్రులను ప్రశ్నించాడు.  గణపతి చేసిందల్లా శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం.


‘‘నాకు మీరే ప్రపంచం. నాకిది చాలు’’ అన్నాడు. గణపతి జ్ఞానానికి శివుడు సంతోషించి, ‘‘దీనికి నువ్వే అర్హుడివి. ఇదిగో తీసుకో!’’ అని మామిడి పండు ఇచ్చాడు. ఇది విన్న కార్తికేయుడికి అన్యాయం అనిపించింది. ఆగ్రహం వచ్చింది. అతన్ని పార్వతి సముదాయిస్తూ ఆత్మాశ్యరం, వస్త్వాశ్రయం అనే రెండు దృక్పథాలు ఉంటాయనీ, అనుభవం అంతా ఆత్మాశ్రయమేననీ, వస్తువులు కూడా ఆత్మాశ్రయ అనుభవాన్ని కలిగించడానికే ఉన్నాయనీ, ‘నా తల్లితండ్రులే నా ప్రపంచం, కాబట్టి వారికే ప్రదక్షిణ చేస్తాను’ అనే వివేకాన్నీ, అవగాహననూ గణపతి ప్రదర్శించాడనీ వివరించింది. కానీ ఆ వివరణలకు సుబ్రహ్మణ్యుడు సంతృప్తి చెందలేదు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నాడు. తల్లిదండ్రుల్ని వదిలి బయలుదేరాడు. దక్షిణ భారతదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ అతను గొప్ప యోధుడయ్యాడు. దక్షిణాపథంలో అనేక ప్రాంతాలను జయించాడు. కానీ వాటిని పరిపాలించడానికి కాదు... తల్లిదండ్రుల వల్ల తనకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయాన్ని సృష్టించాలనే ఆలోచనతో! ఒక రకంగా అతను విప్లవకారుడు. అన్యాయం ఎక్కడ జరిగిందనిపించినా దాని మీద యుద్ధం ప్రకటించాడు. ఆ క్రోధంలో అతనికి ప్రతి చిన్న విషయం ఘోర అన్యాయంగా కనిపించసాగింది. ఎందరినో చంపాడు. యుద్ధం తరువాత యుద్ధం చేస్తూ పోయాడు. 


యుద్ధాలకు స్వస్తి

అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి ఆధ్యాత్మికతను తీసికొని వచ్చాడు. అగస్త్యునికి ప్రతిఘటన ఎదురైన ప్రతిచోటా కార్తికేయుడు యుద్ధం చేశాడు. అగస్త్యుడు అతనికి యుద్ధవిద్య నేర్పాడు, అతని క్రోధాన్ని జ్ఞానసాధనకు ఉపకరణంగా మలిచాడు. చివరకు యుద్ధాలతో సుబ్రహ్మణ్యస్వామి విసిగిపోయాడు. ఇలా వెయ్యేళ్ళు యుద్ధం చేసినా ఈ ప్రపంచం మారదని అతను తెలుసుకున్నాడు. యుద్ధాలకు స్వస్తి చెప్పాడు. చివరిసారిగా తన ఖడ్గాన్ని ‘ఘటి సుబ్రహ్మణ్య’ అనే చోట కడిగాడు. ఇది నేటి కర్ణాటకలో ఉంది. అక్కడ కొంతకాలం ధ్యానంలో కూర్చున్నాడు.


ప్రస్తుతం కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతంలో ఉన్న ‘(కుక్కి) సుబ్రహ్మణ్య’ అనే ప్రాంతంలోని కుమారపర్వతం పైకి వెళ్లాడు. కర్ణాటకలో సుబ్రహ్మణ్యుణ్ణి ‘కుమార’ అని కూడా పిలుస్తారు. కుమారుడు అంటే కొడుకు. శివుడు ప్రధాన దైవం, అతని కుమారుడు కుమారస్వామి. కాబట్టి అది కుమార పర్వతం. ఆ పర్వత శిఖరం మీద, నిలుచున్న భంగిమలో కార్తికేయుడు మహాసమాధి పొందాడు. యోగ సంప్రదాయంలో యోగులు తమ జీవితంలో పని పూర్తయిన తర్వాత అలా తమ శరీరాన్ని ఇచ్ఛారీతిలో వదిలేసేవారు. ఇది ఆత్మహత్య కాదు. కేవలం శరీరాన్ని వదిలి వెళ్లిపోవడం. చాలామంది యోగులు కూర్చున్న భంగిమలో తమ శరీరాలు విడుస్తారు. శరీరం అందుకు అనుకూలించకపోతే ఒక పక్కకు ఒత్తిగిలి పడుకొని విడుస్తారు. కాని కార్తికేయుడు మహాయోధుడు కావడం వల్ల నిలబడే తన శరీరాన్ని విడిచి పెట్టాడు. ఈ ఘటన జరిగి పదిహేను వేల సంవత్సరాలు దాటింది. కానీ కార్తికేయుడు దేహాన్ని విడిచివెళ్లిన ఆ చోటు ఇంకా శక్తితో, ఉత్తేజంతో సజీవంగా ఉంది.


ఆ స్థలం మహా శక్తిమంతం

సాధారణంగా అందరూ ‘(కుక్కి) సుబ్రహ్మణ్య’ క్షేత్రంలో గుడికి వెళ్లి వచ్చేస్తూ ఉంటారు. గుడిలో పెద్దగా ఏమీ లేదు. కానీ ప్రకృతి సౌందర్య రీత్యా కుమార పర్వత శిఖరం చాలా అందమైంది. ఈ పర్వత శిఖరం మీద చిన్ని చిన్ని రాళ్లు ఆరు ముఖాలతో చెక్కి ఉంటాయి. వీటిని ‘షణ్ముఖ లింగాలు’ అంటారు. అక్కడ వేల సంవత్సరాలుగా కార్తికేయుడి శక్తి ప్రకంపిస్తూనే ఉంది, చివరికి రాళ్లు కూడా మెల్లగా తమను తాము షణ్ముఖ ఆకారాలలోకి మలచుకున్నాయి. శిఖరం పైకి చేరాలంటే పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడవాలి. ఈ స్థలం ఎంతో శక్తిమంతమైనది. అది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. అనుభూతి చెందగలిగిన సున్నితత్వం ఉంటే,  అది మన మూలాలను కదిలిస్తుంది.



కార్తికేయుడు దక్షిణ భారతదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ అతను గొప్ప యోధుడయ్యాడు. దక్షిణాపథంలో అనేక ప్రాంతాలను జయించాడు. కానీ వాటిని పరిపాలించడానికి కాదు... తల్లిదండ్రుల వల్ల తనకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయాన్ని సృష్టించాలనే ఆలోచనతో! ఒక రకంగా అతను విప్లవకారుడు. అన్యాయం ఎక్కడ జరిగిందనిపించినా దాని మీద యుద్ధం ప్రకటించాడు. 


సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST