కాశీ కారిడార్‌ : మనసులూ విశాలం కావాలి

ABN , First Publish Date - 2022-01-05T07:52:19+05:30 IST

ఆశ్రిత కళాకారులు, కవులు, పండితులు రాజు అభిరుచికి అనుగుణంగా ఆయనను అలరింప చేసేందుకు ప్రయత్నిస్తారు. అలానే వర్తమాన భారతదేశంలో వ్యవస్థలన్నీ అధికార పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నాయి....

కాశీ కారిడార్‌ : మనసులూ విశాలం కావాలి

ఆశ్రిత కళాకారులు, కవులు, పండితులు రాజు అభిరుచికి అనుగుణంగా ఆయనను అలరింప చేసేందుకు ప్రయత్నిస్తారు. అలానే వర్తమాన భారతదేశంలో వ్యవస్థలన్నీ అధికార పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో కాశీ విశ్వనాథుడి కారిడార్‌ను ప్రారంభించారు. బిజెపి పాలిత 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 9 మంది ఉపముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 51వేల ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్ల ద్వారా ఆ కార్యక్రమ ప్రత్యక్షప్రసారం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు వారణాసిలో పని గట్టుకుని పలు సదస్సులు నిర్వహించాయి. మేయర్ల సమావేశాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సెమినార్లు కూడా అక్కడే జరిగాయి. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న సంగీత, నాటక అకాడమీ, లలిత్ కళా అకాడమీ కూడా తమ వంతు కర్తవ్యంగా ప్రదర్శనలు, కళాత్మక కార్యక్రమాలు నిర్వహించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా కాశీపై రోజంతా పండిత గోష్ఠి నిర్వహించక తప్పలేదు.


మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ధ్వంసం చేసిన కాశీ విశ్వనాథ మందిరం, ఇంకా అనేక ఆలయాలను మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ (1725–95) పునర్నిర్మించారు. ఆ పుణ్యచరిత పవిత్ర వారసత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరించారని బిజెపి నేతలు, మఠాధిపతులు ప్రశంసించారు. మోదీ సైతం తన ప్రసంగంలో అహల్యాబాయిని ఘనంగా కొనియాడారు. గొల్ల కులానికి చెందిన అహల్యాబాయి ఆదర్శబాటను గానుగ తిప్పే కులానికి చెందిన మోదీ అనుసరించారని ‘స్వరాజ్య’ పత్రిక వ్యాఖ్యానించింది. అహల్యాబాయి హోల్కర్ తర్వాత ఆలయాలను పునరుద్ధరించిన తొలి హిందూ నేత మోదీ అని బిజెపి ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవ్య ప్రశంసించారు. కాశీ విశ్వనాథ మందిర కారిడార్ నిర్మాణానికి మోదీ, బిజెపి నేతలు, వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కల్పించిన ఉధృత ప్రచారం చూసిన వారెవరికైనా రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆ ఘట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న విషయం స్పష్టమయింది. ‘మన ఎన్నికల ప్రచారంలో కాశీ, అయోధ్య ప్రధాన భాగం కావాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నవంబర్‌లోనే వారణాసి నుంచి ఎన్నికల వ్యూహరచన ప్రారంభించిన సందర్భంగా కార్యకర్తలకు స్పష్టం చేశారు. కాశీ కారిడార్‌ను ప్రారంభించిన తర్వాత ఎబిపి న్యూస్, సి–ఓటర్ నిర్వహించిన సర్వేలో 57 శాతం ప్రజలు బిజెపికి అనుకూలంగా మారారని వెల్లడయింది. 


ప్రతి నగరానికీ ఒక చరిత్ర ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీ గురించి ఏదోరకంగా నైనా ఇంత ప్రచారం రావడం సంతోషకరమే. ‘కాశీ నగరం చరిత్ర కంటే పురాతనమైది, సంప్రదాయం కంటే ప్రాచీనమైనది, ఇతిహాసం కంటే పురాతనమైనది, వాటన్నిటి కంటే రెట్టింపు పురాతనమైనది’ అని అమెరికా సాహిత్యవేత్త మార్క్‌ట్వైన్ ఏనాడో అభివర్ణించారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పటి నుంచే ఆ నగరం రాజకీయంగా వార్తల్లోకెక్కింది కాని, కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం, ఆధ్యాత్మిక సాంత్వన కోసం మాత్రమే కాక జ్ఞానాన్వేషణ కోసం కోట్లాది ప్రజలు ఎప్పటి నుంచో దేశ, విదేశాల నుంచి ఈ నగరానికి వస్తూనే ఉన్నారు. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినట్లు గుర్తింపు పొందిన స్కంద పురాణంలోని కాశీఖండంలో కాశీ ఉద్భవం గురించి, ధార్మిక ఆధ్యాత్మిక మహత్వం గురించి విస్తారంగా చర్చించారు.


ధార్మిక, విద్యా, వైదుష్య, సాంస్కృతిక, దార్శనిక నగరమైన కాశీని రాజకీయ కోణం నుంచో, మతపరమైన దృష్టి నుంచో అంచనా వేయడమంటే సముద్రాన్ని గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేసినట్లే అవుతుంది. 2500 సంవత్సరాల క్రితమే సిద్ధార్థ గౌతముడు కాశీకి వచ్చి బౌద్ధ ధర్మ బోధనను అక్కడి నుంచే ప్రారంభించాడు. అదే ధర్మ చక్ర ప్రవర్తనంగా పేరొందింది. జైన తీర్థంకరుడూ ఇక్కడే జన్మించాడు. కాశీలోనే శంకరుడు పండితులతో శాస్త్రచర్చలు ప్రారంభించాడు. మండనమిశ్రుడిని ఢీకొన్నాడు. రామానుజుడు, మధ్వాచార్యులతో పాటు తెలుగువాడైన వల్లభుడు తాత్విక చింతన చేసింది ఇక్కడే. తూర్పు గోదావరి జిల్లా ముంగండ అగ్రహారానికి చెందిన జగన్నాథ పండిత రాయలు వారణాసిలో వివిధ శాస్త్రాలు అధ్యయనం చేసి, షాజహాన్ చక్రవర్తి ఆస్థానంలో ప్రముఖ స్థానం పొందాడు. రామచరిత మానస్‌ను ప్రజల భాషలో రచించి, వారి హృదయాల్లో స్థానం పొందిన తులసీదాస్ ఇక్కడివాడే. ‘రామ్ రహీమ్ ఏక్ హై’ అని చాటి చెప్పిన మార్మిక కవి కబీర్ కూడా కాశీలోనే జన్మించాడు. మూఢాచారాల్ని ప్రశ్నించిన కబీర్ కవితలను ప్రపంచవ్యాప్తంగా ఎందరో సాహితీవేత్తలు తమ తమ భాషల్లోకి అనుసృజించుకున్నారు. కబీర్ గురువైన రామానందుడూ కాశీ వీథుల్లో సంచరించినవాడే. ప్రముఖ అమెరికన్ కవి ఎజ్రా పౌండ్, మన రవీంద్రనాథ్ టాగోర్ కూడా కబీర్ కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు. స్వామి వివేకానందుడినే కాదు, బెంగాలీ మహారచయిత శరత్‌చంద్ర చటర్జీ, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతినీ ఆకట్టుకున్న నగరం ఇది. చమార్ కుటుంబంలో జన్మించి, అందరూ సమానులే అని ఘోషించిన తాత్విక కవి, సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక వేత్త రవిదాస్ కూడా వారణాసి నుంచే ప్రకంపనలు సృష్టించాడు. 


ఆధునిక హిందీ సాహిత్యానికి, పత్రికారచనకూ కూడా కాశీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది. ఒక రకంగా హిందీ భాషకు వెన్నెముక నిచ్చింది కాశీ నగరమే. ప్రజల జీవితాలను తన సాహిత్యంలో చిత్రించిన భారతేందు హరిశ్చంద్ర కాలంలోనే హిందీ పాత్రికేయరంగం అభివృద్ధి చెందింది. ఆధునిక హిందీ సాహిత్య నిర్మాతల్లో ఒకరైన ఛాయవాద కవి జయశంకర్ ప్రసాద్ కాశీవాసి. మహాకావ్యం కామాయనితో పాటు అనేక కవితలు, నాటికలు, కథలు, నవలలను ఆయన కాశీలోనే రచించారు. హిందీ, ఉర్దూ భాషల్లో అభ్యుదయ సాహిత్యానికి ఒరవడి సృష్టించి సామాన్యులను, అభాగ్యులను, రైతులను కథానాయకులుగా మార్చిన మహారచయిత ప్రేమ్‌చంద్ కూడా కాశీవాడే. హిందీ సాహిత్య దిగ్గజాలు హజారీ ప్రసాద్ ద్వివేదీ, రామచంద్ర శుక్లా కాశీపుత్రులే. ‘భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు. ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ, పారశీకులది కూడా, అందర్నీ జ్ఞానవంతులు చేయాలన్నదే మా ఉద్దేశం’ అన్న లక్ష్యంతో మదన్మోహన్ మాలవ్యా స్థాపించిన కాశీ హిందూ విశ్వవిద్యాలయం ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితలు ఎందరినో ప్రపంచానికి అందించింది. ప్రముఖ హిందీసాహిత్య విమర్శకుడు నామ్‌వర్ సింగ్, ఆయన సోదరుడు, రచయిత కాశీనాథ్ సింగ్ కాశీకి చెందినవారే. ఆధునికతకూ, ప్రాచీనతకూ వారధిగా నిలిచిన గోపీనాథ్ కవిరాజ్ తన రచనలతో లక్షలాది సామాన్యులకు స్ఫూర్తిని వెలిగించింది ఇక్కడే. ‘ప్రేమను వ్యాపించలేకపోయావు కదా, ద్వేషాన్ని చల్లార్చి వెళ్లు, మేలుకో, ప్రేమ, ఆప్యాయతల గంగను ప్రవహించి వెళ్లు’ అని సమకాలీన సమాజాన్ని జాగృతం చేసిన నజీర్ బన్సారీ వారణాసి వీధుల్లో గజళ్లు రచిస్తూ తిరిగినవాడే.


ఎన్నని చెప్పవచ్చు? ఎంతమందినని ఉటంకించవచ్చు? కాశీ ఆధ్యాత్మిక నగరం అన్నది ఒక పార్శ్వం మాత్రమే. కాని అది మేధోనగరం, సాహితీనగరం. జ్ఞానాన్వేషణకు నిలయమైన నగరం. శాస్త్ర చర్చలకు కేంద్రమైన నగరం. బౌద్ధాన్ని, సూఫీయిజాన్ని మేళవించిన నగరం. పేదలు, కడుపు కాలిన అన్నార్తులు, అభాగ్యులు, అభాగినుల జీవనగాథల్ని చిత్రించిన నగరం. ముఖ్యంగా ప్రశ్న కు, చింతనకు, చర్చలకూ కేంద్రమైన నగరం. వర్తమాన భారతదేశ పాలకులు విభిన్న ఆలోచనలు, ప్రశ్నలు, చర్చలకు ప్రాధాన్యం ఎంతవరకు కల్పిస్తున్నారు?


అంతే కాదు, ఎంత ఆధ్యాత్మిక, జ్ఞానాన్వేషణకు నిలయమైతేనేం, స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ల వరకూ కాశీ విశ్వనాథుడి ఆలయంలో దళితుల ప్రవేశాన్ని నిషేధించిన నగరం అది! ‘విశ్వనాథుడి మందిరంలో దళితులకు తలుపులు మూసినంత కాలం విశ్వనాథుడు ఆ మందిరంలో నివసించడు. దేవాలయ పవిత్రతపై నమ్మకం పెట్టుకోలేను, నా పాపాలు ప్రక్షాళనం అవుతాయన్న విశ్వాసంతో పూజించలేను’ అని మహాత్మాగాంధీ 1936లో ఆవేదన వ్యక్తం చేసిన నగరమది. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం 17వ అధికరణలో అస్పృశ్యతను నిషేధించిన ఏడేళ్ల తర్వాత కాని కాశీనాథుడి మందిరంలో దళితులకు ప్రవేశం లభించలేదు. అది కూడా ఎన్నో హింసాత్మక నిరసనలు, మతాధికారుల బహిష్కరణల మధ్య జరిగింది.


మరి ఇవాళ నరేంద్రమోదీకి ఆ చరిత్ర తెలిసి చేశారో లేదో చెప్పలేము కాని ఆయన కాశీ విశ్వనాథ మందిర నిర్మాణ కార్మికులపై పూలవర్షం కురిపించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ ప్రాచీననగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, గ్రామాల్లో తమ నెత్తుటితో సంపద సృష్టించే కోట్లాది కార్మికులు, శ్రమజీవుల స్వేదబిందువుల కష్టాలకు సరైన పరిష్కారం లభించినప్పుడే వారు తమ కుటుంబాలతో సంతోషంగా కలిసి భోజనం చేయగలుగుతారు. కరోనా మొదటి ప్రభంజనం సమయంలో నగరాలను వదిలి వందలాది మైళ్ల దూరంలోని స్వగ్రామాలకు కాలినడకన వెళ్ళిన వారిపై ఎవరు పూలవర్షం కురిపిస్తారు? ‘పైకి మనం శరీరాన్ని నీటితో కడుక్కుంటాం కాని హృదయం అన్ని పాపాలతో నిండి ఉన్నప్పుడు అది స్వచ్ఛత ఎలా అవుతుంది? అది స్నానం చేసిన వెంటనే బురదను కప్పుకునే ఏనుగుకూ మనకు తేడా ఏముంది?’ అని రవిదాస్ గురుగ్రంథ సాహెబ్‌లో ఏనాడో అన్నారు. ‘గంగా, గోమతీ నదుల్లో స్నానం చేసి పవిత్రులమని భావిస్తే అది మూర్ఖత్వమే’ అని కబీర్ కూడా ఆనాడే స్పష్టం చేశారు. ‘అన్యాయానికి వంత పలకడం అన్యాయం చేసినట్లే లెక్క’ అని మున్షీ ప్రేమ్‌చంద్ కూడా ఇదే నేల నుంచి ఘోషించాడు. కాశీ విశ్వనాథుడి కారిడార్లు విశాలం చేయడం మంచిదే. కాని రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా మన హృదయాలను విశాలం చేయడమే నేటి కర్తవ్యం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-01-05T07:52:19+05:30 IST