ఉమ్రాన్‌.. బ్యాటర్లకు పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-04-19T09:56:10+05:30 IST

ఉమ్రాన్‌ మాలిక్‌..ఈ ఐపీఎల్‌ సందర్భంగా క్రికెట్‌ పండితుల నోట వినిపిస్తున్న పేరు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ యువ కశ్మీర్‌

ఉమ్రాన్‌.. బ్యాటర్లకు పరేషాన్‌!

ఆకట్టుకుంటున్న కశ్మీర్‌ బౌలర్‌


న్యూఢిల్లీ: ఉమ్రాన్‌ మాలిక్‌..ఈ ఐపీఎల్‌ సందర్భంగా క్రికెట్‌ పండితుల నోట వినిపిస్తున్న పేరు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ యువ కశ్మీర్‌ పేసర్‌ పదునైన స్పీడ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన 22 ఏళ్ల మాలిక్‌ తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటాడు. నిలకడగా 152 కి.మీ. వేగంతో బంతులు వేయగల సామర్థ్యం ఉమ్రాన్‌ సొంతం. దరిమిలా అతడు త్వరలో టీమిండియాలో అడుగుపెట్టడం ఖాయమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఉమ్రాన్‌ టీమిండియాకు నెట్‌ బౌలర్‌గా వ్యవహరించాడు. జూన్‌లో సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు, ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు..కలిపి భారత్‌ ఏడు టీ20లు ఆడనుంది. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచ కప్‌నకు బలమైన పేస్‌ బౌలింగ్‌ దళాన్ని తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు మెగా టోర్నీకి వెళ్లేలోగా  భారత్‌ మొత్తం 20టీ ట్వంటీలు ఆడాల్సి ఉంది.


ఈనేపథ్యంలో ప్రధాన పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌, షమి, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌లపై భారం పడకుండా చూడడం ప్రధానం. అందువల్ల ప్రత్యామ్నాయ పేసర్లను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్రాన్‌ కనుక ఫిట్‌నె్‌సను కాపాడుకోగలిగితే సెలెక్టర్లు అతడి పేరును పరిశీలించడం ఖాయం. మాలిక్‌ బౌలింగ్‌కు ఫిదా అయిన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ లెజెండ్‌ డేల్‌ స్టెయిన్‌ అతడిని ‘మేధావి’గా అభివర్ణించాడు. లెగ్‌సైడ్‌కు ఆవలగా బంతులు వేయకుండా నియంత్రించుకోగలిగితే మాలిక్‌ తిరుగులేని బౌలర్‌గా పేరు తెచ్చుకుంటాడని దిగ్గజ బ్యాటర్‌ గవాస్కర్‌ కూడా చెప్పాడు. 



Updated Date - 2022-04-19T09:56:10+05:30 IST