దూరాల్ని మరింత పెంచే ‘కశ్మీర్‌ ఫైల్స్‌’

Published: Thu, 24 Mar 2022 00:29:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దూరాల్ని మరింత పెంచే కశ్మీర్‌ ఫైల్స్‌

యూపీఎన్నికల్లో ఏయే అంశాలను ప్రామాణికంగా చేసుకొని ప్రచారం చేశారో 2024 సార్వత్రక ఎన్నికల్లో కూడా అవే అంశాలతో ముందుకెళ్లాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. తాజా పరిణామాలు, సంకేతాలు దీనికి నిదర్శనం. యూపీలో 80:20 మధ్య పోటీగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం చేశారు. అంటే 80శాతంగా ఉన్న మెజారిటీ వర్గానికి, 20 శాతంగా ఉన్న మైనారిటీలకు మధ్య ఈ ఎన్నికలు జరుగనున్నాయని సంకేతాలు ఇచ్చారు. పెరిగిన గ్యాస్‌, ఇంధన ధరలు, నిరుద్యోగం, కార్పొరేట్లకు దేశ ఆర్థిక వ్యవస్థను కట్టబెట్టడం, దళితులపై అత్యాచారాలు, కరోనా కట్టడిలో వైఫల్యం, గంగానదిలో శవాలు, వ్యవసాయ చట్టాలు, కేంద్రమంత్రి కుమారుడు రైతులను వాహనంతో తొక్కిన సంఘటన... ఇవేవీ యూపీ ప్రజలకు గుర్తుకు రాలేదు. ఫలితంగా ఆ ఎన్నికల్లో యోగి ప్రభుత్వం అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. విపక్షాలకు ఓటు వేస్తే కేరళ, కశ్మీర్‌, బెంగాల్‌లాగా రాష్ట్రం మారుతుందని యోగి ప్రచారం చేశారు. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రధాన ప్రచారాంశాలుగా ఉంటాయో తేలిపోయింది. కశ్మీరీ పండిట్ల గాయాలను సజీవంగా ఉంచేలా తాజాగా కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా, అవాస్తవికతలను జోడించి, విద్వేషానికి ఊతమిచ్చేలా తీసిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రానికి ప్రధానమంత్రితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. అంతేగాక రాయితీలను క్యూలు కట్టి ప్రకటించారు. వాస్తవాలు మరోలా ఉన్నప్పటికీ ఇవేవీ పట్టించుకునే పరిస్థితుల్లో సమాజం లేదు.


వివేక్‌ అగ్నిహోత్రి లెక్కల ప్రకారం 1990లో జరిగిన మిలిటెన్సీ చర్యల వల్ల నాలుగు వేల మంది కశ్మీరీ పండిట్లు చనిపోయారు. కశ్మీరీ పండిట్ల సంఘర్షణ సమితి మాత్రం 650మంది చనిపోయినట్టు చెబుతోంది. ఇక 1991లో ఆరెస్సెస్ రాసిన ‘జెనిసైడ్‌ ఆఫ్‌ హిందూస్‌ ఇన్ కశ్మీర్‌’ పుస్తకం ఈ సంఖ్యను 600గా చెబుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల్లో 219మంది అని ఉంది. సమాచార హక్కు చట్టం కింద హర్యానాకు చెందిన పీపీ కపూర్‌ వివరణ కోరగా, శ్రీనగర్‌ పోలీసులు 89 మంది మాత్రమే అని జవాబిచ్చారు. ఆ తర్వాత చనిపోయిన పౌరుల సంఖ్య 1635. అయితే వీరిలో ముస్లింలతో పాటు సిక్కులు అధికంగా ఉన్నారు. మిలిటెంట్లు తమకు సహకరించలేదనే కారణంతో 15వేల మందికి పైగా ముస్లింలను చంపేశారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ సంఘటలన్నీ కేంద్రంలో బీజేపీ మద్దతుతో నడుస్తున్న వీపీ సింగ్‌ ప్రభుత్వం ఉండగా జరిగినవే. 1990లో కశ్మీరీ పండిట్లపై ఊచకోత జరిగిన సమయంలో కేంద్రంలో వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వానికి బీజేపీ సమర్థన ఉంది. ఇక జమ్మూకశ్మీర్‌ గవర్నరుగా బీజేపీ నాయకుడు జగ్‌మోహన్ ఉన్నారు. అయితే ఊచకోత సమయంలో ఆ రాష్ట్రంలో ఫారూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వం అధికారంలో ఉందని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉందనే ప్రచారాన్ని ఈ సినిమా చేసింది. మృతుల సంఖ్య ఎంత అనేది అప్రస్తుతం. ప్రతీ ప్రాణం విలువైనదే. అయితే ఆ ప్రాణాలను ఎన్నికల ప్రచారాలుగా మలుచుకోవడం బాధాకరం. గుజరాత్‌లో రెండు వేల మంది ముస్లింల ఉచకోత తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ ప్రచారంలోకి వచ్చారు. 85 శాతంగా ఉన్న మెజారిటీ వర్గానికి 15శాతంగా ఉన్న మైనారిటీలు ప్రమాదంగా మారారనే ప్రచారాన్ని సంఘ్‌పరివార్‌ శక్తులు బలంగా చేస్తున్నాయి. ఆ కారణంగానే దేశంలో ఎన్నికల ఫలితాలు ఈ విధంగా వెలువడుతున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టనంతవరకు ఫలితాలు ఇదే విధంగా వస్తాయి.


తాజాగా విడుదలైన ఈ చిత్రం దేశంలో మైనార్టీలపై మత విద్వేషాన్ని పెంచేలా చేసింది. పండిట్లపై, కశ్మీరీ ప్రజలపై జరిగిన గాయాలను చెరపకపోగా, మరింత పచ్చిగా మార్చింది. ఇక కశ్మీరు లోయలోకి వెళ్లిపోవాలని, తమ ఇళ్లలో మళ్లీ తాము నివాసం ఉండాలని కలలు కంటున్న పండిట్ల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది ఈ సినిమా. దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో పరిస్థితిని గమనిస్తే– మతవిద్వేషాలు పెరగటం కనిపిస్తోంది. సినిమా ప్రదర్శన మధ్యలోనూ, ప్రదర్శన తర్వాతా– మతపరమైన మైనారిటీలను ఊచకోత కోయాలని వినిపిస్తున్న పిలుపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కశ్మీరు పండిట్లపై ఆ ప్రాంతంలోని ముస్లింల సహకారంతోనే ఊచకోత జరిగిందని సినిమా ప్రచారం చేసింది. ప్రముఖ చరిత్రకారుడు అశోక్‌కుమార్‌ పాండే తెలిపిన వివరాల ప్రకారం కశ్మీరు పండిట్లకు రక్షణ కల్పించడానికి ముస్లింలు ప్రయత్నాలు చేశారని, 98శాతంగా ఉన్న ముస్లింలు 2 శాతంగా ఉన్న కశ్మీరీ పండిట్లను ఊచకోతకు ప్రేరేపిస్తే పరిస్థితి ఇలా ఉండేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లకు ఆశ్రయం కల్పించే ముస్లింల పట్ల కఠినంగా చర్యలు ఉంటాయని అప్పటి ఉగ్రవాదుల హెచ్చరికలకు కొందరు ముస్లింలు మూల్యం కూడా చెల్లించారు. అంతే కాకుండా భారత్ వైపు ఉండాలనే ముస్లింలను కూడా ఉగ్రవాదులు ఊచకోత కోశారు.


కశ్మీర్‌లో దిగజారిన ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలేవీ 1990లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. పైపెచ్చు పరిస్థితి మరింత దిగజారే వాతావరణాన్ని కల్పించారని విమర్శలు ఉన్నాయి. కశ్మీరు పండిట్లంతా ప్రాంతాన్ని వదిలివెళ్లేలా అప్పటి కేంద్రప్రభుత్వం విధానాలు ఉపకరించాయని తెలుస్తోంది. ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి కేంద్రం అండగా లేదని విమర్శలున్నాయి. ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను పరిశీలిస్తే– కశ్మీరులో 1990 మే 21న మౌల్వీ మీర్వాయిస్‌ ఫారూఖ్‌పై ఆయన ఇంట్లోనే హిజ్బూల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మీర్వాయిస్‌ చనిపోయారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళుతుండగా, వేలాదిమందితో శవయాత్ర జరిగింది. మౌల్వీ మృతదేహంపై ఉంచడానికి ఒక పుష్పగుచ్ఛాన్ని నివాళిగా పంపాలని అప్పట్లో గవర్నరు సలహాదారుగా ఉన్న ఆర్‌పీ ఠక్కర్‌ ఇచ్చిన సలహాను గవర్నర్‌ జగ్‌మోహన్ తిరస్కరించారు. నిషేధాజ్ఙలు ఉల్లంఘించి శవయాత్ర చేస్తున్నారని– యాత్రపై కాల్పులు జరగ్గా, అధికారిక లెక్కల ప్రకారం 27మంది, పత్రికా కథనాల ప్రకారం 100మందికి పైగా ముస్లింలు చనిపోయారని బీబీసీ కథనం వెల్లడించింది. మౌల్వీ హత్యను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని కూడా గవర్నర్‌ జగ్‌మోహన్ అమలు చేయకపోవటంతో, మౌల్వీ శవయాత్రపై కాల్పుల సంఘటన ఉగ్రవాద సంఘటనలకు బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాలు కూడా కేంద్రంలోని బీజేపీ మద్దతుతో ఉన్న ప్రభుత్వాల విధానాలే కారణం. 


కేంద్రమంత్రిగా ఉన్న ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కూతురిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి, భారతదేశం చెరలో ఉన్న ఉగ్రవాదులను విడిపించాలని డిమాండు చేయగా, కూతురి కోసం ఉగ్రవాదులను కూడా విడిచిపెట్టడాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూఖ్‌ అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఫారూఖ్‌ అబ్దుల్లాను పాకిస్థాన్ అనుకూలుడిగా, అధికారంలో లేకున్నా ఆయన హయాంలో ఊచకోత జరిగిందనే సంకేతాలను ఈ సినిమా ఇచ్చింది. నిజానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా కశ్మీరీ పండిట్లను ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదనే విమర్శలే ఉన్నాయి. కశ్మీరీ పండిట్ల కోసం యూపీఏ హయాంలో రూ.1600కోట్ల ప్యాకేజీ అమలు జరిగింది. ఇళ్లు కట్టించడమే కాకుండా 6 వేల మంది యువతకు ఆ ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇచ్చింది. ఇక ప్రతీ కుటుంబానికి రూ.7.5లక్షల సహాయం యూపీఏ హయాంలోనే అందింది. టౌన్‍షిప్‌లు కట్టి కశ్మీరీ పండింట్లకు 4218 ఇళ్లను ఇవ్వటం కూడా ఆ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా పంజాబ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో ప్రతీ విద్యాసంస్థలోను ఒక్క శాతం రిజర్వేషన్లు కూడా అప్పట్లోనే అమలయ్యాయి. ఇప్పుడు ఈ ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా అవాస్తవాలను ప్రచారం చేసి, ముస్లింలు–కశ్మీరీ పండిట్ల మధ్య అంతరాన్ని మరింత పెంచేలా చేసిందని ఒకపక్క కశ్మీరీ పండిట్లు మండిపడుతుంటే, మరోపక్క బీజేపీ మాత్రం సంబరాలు చేసుకుంటోంది. గాయాలను ఓట్లుగా మార్చుకునే రాజకీయాలు ఈ సినిమాతో పురుడుపోసుకున్నాయి. ఈ విషప్రచారాన్ని ఖండించే బాధ్యత ప్రజాస్వామ్యవాదులపైనే ఉంది.

డాక్టర్‌ సయ్యద్‌ మొహినుద్దీన్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.