పెట్టుబడుల వెలుగుల్లో కశ్మీర్

Published: Tue, 26 Apr 2022 00:55:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెట్టుబడుల వెలుగుల్లో కశ్మీర్

రెం డున్నర సంవత్సరాల క్రితం 370, 35(ఏ) అధికరణలను రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఉగ్రవాదం మరింత పెచ్చరిల్లుతుందని, ఆ రాష్ట్రాన్ని భారత్‌లో అంతర్భాగం చేసుకోవడం మరింత కష్టమవుతుందని ప్రతిపక్షాలు, కుహనా మేధావి వర్గాలు విమర్శించాయి. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లో మారుతున్న పరిస్థితులను చూసి మొత్తం ప్రపంచమే అవాక్కవుతున్నది. ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి స్వయంగా జమ్మూ కశ్మీర్ సందర్శించి జాతీయ పంచాయతీ దినం సందర్భంగా 30వేల మంది గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో సంభాషించారు. కశ్మీర్‌లో మొదలైన వినూత్న అభివృద్ధి ఆ రాష్ట్రంలో ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎటువంటి గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందో ప్రధాని పర్యటనతో ప్రపంచానికి తెలిసింది. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులే పాలనను నిర్వహిస్తున్నారు. అక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలులో ఉన్నది. సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని మరింత పరిఢవిల్లచేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. పరిస్థితులు మరింత మెరుగుపడితే ఈశాన్యంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సాయుధ పోలీసు అధికారాల చట్టాన్ని ఎత్తివేసినట్లే జమ్ము కశ్మీర్‌లో కూడా ఎత్తివేస్తారన్న సంకేతాలు స్థానిక ప్రజలకు అందాయి. ఎన్నో ఏళ్లుగా భారత ప్రజలు కలలు కంటున్న విధంగా జమ్ము కశ్మీర్‌లో ‘ఏక్ విధాన్, ఏక్ నిషాన్, ఏక్ ప్రధాన్’ మోదీ సారథ్యంలో సాకారమయిందనడంలో సందేహం లేదు.


స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ గత 75 సంవత్సరాల్లో జమ్మూ కశ్మీర్‌కు రూ.15వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ప్రధాని మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగానే జమ్ముకశ్మీర్‌లో రూ.38,052 కోట్ల మేరకు పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇవి కాక ఇప్పటికే ఈ ప్రాంతంలో రూ. 52వేల కోట్ల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. గత 75 సంవత్సరాల్లో ఇంత పెద్దస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు జమ్ము కశ్మీర్‌లో ఎప్పుడూ అమలు కాలేదు. జమ్ము కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల మధ్య అనుసంధానం చేసేందుకు 8.45 కిమీ బానిహాల్–ఖాజీగంజ్ సొరంగాన్ని ప్రారంభించడంతో పాటు రూ.20వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7500 కోట్లతో ఢిల్లీ–అమృత్‌సర్–కట్రా ఎక్స్‌ప్రెస్ వేతో పాటు చీనాబ్ నదిపై రూ. 9800 కోట్ల హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. తాను సందర్శించిన పాలి గ్రామంలో 500 కిలోవాట్ల సౌరశక్తి ప్లాంట్‌ను ప్రారంభించడంతో ఆ గ్రామం దేశంలో లోనే తొలి కార్బన్ రహిత పంచాయతీగా అవతరించింది. దేశంలోని అనేక గ్రామాలతో ఈ గ్రామంలో అన్ని రికార్డులు డిజిటలైజ్ కాగా, ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో మరో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, దాదాపు 8 లక్షలమంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని జమ్ము కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంలోనే ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని, అబివృద్దిని ప్రజా ఉద్యమంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.


జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధే ఆ రాష్ట్రంలో జరుగుతున్న మార్పుకు సంకేతం. ప్రస్తుతం జీఎస్టీ ఆదాయం మూడేళ్లక్రితం నాటికంటే దాదాపు రూ. 5వేల కోట్లు పెరిగింది. రూ. 13,418 కోట్ల జీఎస్టీ, రూ. 1275 కోట్ల ఎక్సైజ్ సుంకాన్ని జమ్ముకశ్మీర్ ఆర్జిస్తోంది. మోదీ హయాంలో ఈ రాష్ట్రంలో కొన్ని వేల కిమీ రహదారులను నిర్మించారు. ఎటువంటి గుంటలు, ఎగుడు దిగుడులు లేని సాఫీ రహదారులు నిర్మించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం 2021–22 వరకు నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులు, పది కొత్త రహదారి, సొరంగ ప్రాజెక్టులతో పాటు 5900 కిమీ పొడవైన రహదారులు నిర్మాణమవుతున్నాయి. చీనాబ్ నదిపై సెప్టెంబర్ వరకు మరో రైల్వే వంతెన నిర్మాణం పూర్తవుతుంది. విద్యుదుత్పాదన, పంపిణీ కూడా జమ్ము కశ్మీర్‌లో ఎంతో మెరుగైంది. వచ్చే ఐదేళ్లలో 5186 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 21 ప్రాజెక్టులు అభివృద్ధి కానున్నాయి. మూడేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లో మూడు వైద్య కళాశాలలు, 20 జిల్లా ఆసుపత్రులే ఉండేవి. ఇప్పుడు రెండు కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులు, పలు వైద్య కళాశాలలు, కాన్సర్ వైద్యశాలలు, నర్సింగ్ స్కూళ్లతో పాటు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో 2వేల సీట్లు అదనంగా ఏర్పడ్డాయి. ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 5లక్షల మేరకు సార్వత్రిక ఉచిత వైద్యం లభిస్తోంది. జలజీవన్ మిషన్ క్రింద జమ్ముకశ్మీర్‌లో నూటికి నూరు శాతం మేరకు గ్రామీణ స్కూళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, వైద్య సంస్థలకు నల్లా కనెక్షన్లు లభించాయి. మూడేళ్లతో పోలిస్తే కనీసం 50 డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు అదనంగా ఏర్పడ్డాయి. 1200 కాలేజీ తరగతులను డిజిటల్ క్లాస్ రూములుగా తీర్చిదిద్దారు, జమ్ము యూనివర్సిటీ, కశ్మీర్ యూనివర్సిటీల జాతీయ ర్యాంకింగ్‌లు పెరిగాయి. విద్యార్థినీ విద్యార్థులతో యూనివర్సిటీలు కళకళలాడుతున్నాయి. చరిత్రాత్మకమైన దాల్‌లేక్ ప్రక్షాళన ఏడాది పది చదరపు కిలోమీటర్ల చొప్పున జరుగుతోంది. జమ్ముకశ్మీర్ విమానాశ్రయంలో రాత్రిపూట విమాన రాకపోకలు జరుగుతాయి. అంతర్జాతీయ విమానాలు కూడా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. నెలకు ఇప్పుడు లక్షలమంది ప్రయాణీకులు జమ్ముకశ్మీర్‌కు విమానాల ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 75 చెరువులను పునరుద్ధరించే అమృత్ సరోవర్ ప్రాజెక్టును మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఇళ్లు కొనుగోలు చేసేవారి స్టాంప్ డ్యూటీలో 50 శాతం తగ్గించారు. దీనివల్ల ఇళ్లు అమ్మకాలు, కొనుగోళ్లు వేగవంతం అవుతాయి.


ప్రధాని మోదీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వ్యాపారవేత్తలు జమ్ముకశ్మీర్‌కు రావడం, రూ. 3వేల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడడం ఒక కీలక పరిణామం. ఇవాళ ప్రపంచంలోని అనేక దేశాలు కశ్మీర్ విషయంలో భారత్‌కు అండదండగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ పెరగడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్థాన్ ఏకాకి కావడం ఇందుకు కారణం. రెండు రోజుల క్రితం భారత్‌లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మోదీని తన ప్రత్యేక స్నేహితుడుగా అభివర్ణించారు. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కు కీలక స్థానం ఉన్నదని ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డర్ లెయెన్ ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నదో స్పష్టం చేస్తోంది.

పెట్టుబడుల వెలుగుల్లో కశ్మీర్

వై. సత్యకుమార్ 

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.