కశ్మీర్‌ ఘాతుకం

ABN , First Publish Date - 2022-06-03T06:15:14+05:30 IST

కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదుల దాడులనుంచి రక్షించలేకపోగా వారిని లోయనుంచి కదలనివ్వకుండా నిర్బంధిస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు...

కశ్మీర్‌ ఘాతుకం

కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదుల దాడులనుంచి రక్షించలేకపోగా వారిని లోయనుంచి కదలనివ్వకుండా నిర్బంధిస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆరునూరైనా లోయనుంచి హిందువులెవ్వరినీ జమ్మూకు పోనివ్వకూడదని కేంద్రం నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తరలిపోవడమంటూ మొదలైతే అది ఆగదు కనుక, ఉగ్రవాదులకు ఇది మరింత ఉత్సాహాన్నిస్తుంది కనుక దానిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని కేంద్రం భావిస్తుండవచ్చు. కానీ, ఉగ్రవాదులు పండిట్లనూ, హిందువులనూ లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతున్నప్పుడు కలిగే ఆందోళనను, ఆగ్రహావేశాలనూ అదుపుచేయడం ఎంతో కష్టం. తమ ప్రాణాలు కాపాడలేని కేంద్రం కేవలం అహంభావంతో తమను కదలనీయకుండా చేస్తున్నదని బాధితుల ఆరోపణ.


ఉగ్రవాదులు రెచ్చిపోతున్న నేపథ్యంలో, తక్షణకర్తవ్యం ఏమిటో తేల్చుకోవడానికి హోంమంత్రి అమిత్ షా గురువారం కీలకమైన సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. భద్రతాసలహాదారు అజిత్ దోవల్, రా అధినేత సామంత్ గోయల్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరక్టర్ రాజన్ ఇత్యాది పెద్దలంతా దీనిలో పాల్గొన్నారు. ఏం చేయబోతున్నారో తెలియదు కానీ, ఈ కాల్పుల ప్రవాహాన్ని ఆపడానికి ఏదో ఒక మార్గాన్నయితే వెతికే ఉంటారు. ఈ పరిస్థితులకు తోడుగా అమర్‌నాథ్ యాత్ర కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా శుక్రవారం జమ్ముకశ్మీర్ గవర్నర్‌తో భేటీ కాబోతున్నారట. ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస పథకం కింద 2008 నుంచి నియమితులైన కశ్మీరీ పండిట్లు, జమ్మూకు చెంది షెడ్యూల్డు కులాల కేటగిరీ కింద నియమితులై లోయలో పోస్టింగులు పొందిన హిందూ ఉద్యోగులు ఇప్పుడు తమను జమ్మూకు పంపించివేయమని కాళ్ళావేళ్ళాపడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించి, గట్టి కాపలా పెట్టిన గేటేడ్ కాలనీల్లో ఉంటున్న కశ్మీరీ పండిట్లు కూడా ఉగ్రవాదులు ఏ క్షణాన్న విరుచుకుపడతారోనని భయపడుతున్నారు. మే 12న రాహుల్ భట్ అనే రెవిన్యూ అధికారిని ఉగ్రవాదులు ఎంచుకొని మరీ కాల్చివేసినప్పటినుంచి ఉద్యోగులు బెదిరిపోతున్నారు. బుధవారం నాడు రజనీబాల అనే స్కూలు టీచర్ నీ గురువారం ఓ బ్యాంకు ఉద్యోగినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.


ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసినప్పటినుంచి ఇప్పటివరకూ ఓ ఇరవైమందిని ఉగ్రవాదులు చంపివుంటారని అంచనా. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న జనాభా మార్పిడి పథకానికి ఈ దాడులతో విరుగుడుమందు వేయాలని పాక్ ప్రేరేపిత్ ఉగ్రవాదులు భావిస్తున్నారనీ, ఇటీవలి కాలంలో లోయలోకి ఆయుధాల రాక కూడా హెచ్చిందని అధికారులు అంటున్నారు. వాహనాలు పేలిపోవడం, తగులబడిపోవడం వంటి ఘటనలు కూడా పెరిగాయట. మొత్తం మీద లోయలోకి వచ్చే తరలివచ్చేవారిని తరిమికొట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నాలను వమ్ముచేయడం సులభమేమీ కాదు. గతంలో మాదిరిగా కాక, ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం మరింత ప్రత్యేకంగా, కొందరే లక్ష్యంగా మారిన నేపథ్యంలో, స్థానికుల సహాయంతో ఏరివేత కూడా గతంలోలాగా సులభంకాకపోవచ్చు. లోయలో జరిగే ప్రతీ హత్యా అక్కడ సాధారణస్థితి ఏర్పడిందన్న వాదన తప్పని రుజువుచేస్తోంది. హత్య జరిగిన వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామని పాలకులు ప్రకటించడం, భద్రతాదళాలు స్పందించి ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరుగుతూనే ఉంది. కానీ, కేవలం సైనికులు, పోలీసుల సహకారంతో మాత్రమే పరిస్థితులు చక్కబడవు. స్థానికుల్లో తమ పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి పాలకులూ వారి ప్రతినిధులూ ప్రయత్నించడంతో పాటు, అన్ని వర్గాలకు చెందిన ప్రజల మధ్య సుహృద్భావం ఏర్పరచే ప్రయత్నం విశేషంగా జరగాలి. స్థానిక ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం నిర్బంధించడం, నోరు నొక్కడం, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సైతం తమకు అనుకూలంగా మార్చుకోవడం వంటివి సరైన చర్యలు కావు. ఎలాగోలాగ ఎన్నికల్లో నెగ్గుకురాగలిగితే సర్వమూ చక్కబెట్టగలమని అనుకోవడం సరికాదు. కశ్మీర్ లో ప్రజాభిప్రాయానికి భిన్నంగా అధికారంలో వస్తే మరింత ప్రమాదమని గతంలోనే రుజువైంది. చరిత్రను తిరగరాయదల్చుకున్నవారు కూడా ఆ పనిచేయాలంటే దానిని చదవాల్సిందే.

Updated Date - 2022-06-03T06:15:14+05:30 IST