Kashmiri Pandit : తీవ్ర నిరసనల నడుమ రాహుల్ భట్ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-05-13T19:31:11+05:30 IST

ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ పండిట్

Kashmiri Pandit : తీవ్ర నిరసనల నడుమ రాహుల్ భట్ అంత్యక్రియలు

శ్రీనగర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. జమ్మూలోని ఆయన స్వస్థలం దుర్గా నగర్‌కు ఆయన మృతదేహం చేరుకునేసరికి ఆయన బంధువులు ఓదార్చడం సాధ్యం కాని స్థాయిలో విలపించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరు బడ్గాంలోని షేక్‌పొర మైగ్రంట్ కాలనీలో నివసించేవారు.


రాహుల్ భట్ కశ్మీరులోని బడ్గాం జిల్లా, చదూర  తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నారు. వలసదారుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక ఉపాధి పథకంలో ఆయనకు ఈ ఉద్యోగం లభించింది. ఆయనపై ఇద్దరు ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. ఆయనను బడ్గాంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. దీంతో కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన తెలిపారు. తమకు భద్రత కరువైపోయిందని వాపోతున్నారు. 


బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ  అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూలోని ఆయన నివాసం వద్దకు వందలాది మంది కశ్మీరీ పండిట్లు చేరుకుని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పునరావాసం పేరుతో యువ కశ్మీరీ హిందువులను ప్రభుత్వం బలి చేస్తోందని ఆరోపించారు. కశ్మీరు లోయలో శాశ్వతంగా స్థిరపడాలన్న తమ కలలను ఈ సంఘటన దెబ్బతీసిందని తెలిపారు. 


హిందువులను చంపించే ప్రణాళిక

రాహుల్ భట్ బంధువు సూన్ నాథ్ భట్ మాట్లాడుతూ, పునరావాసం, ఉద్యోగ కల్పన పేరుతో యువ కశ్మీరీ హిందువులను చంపించాలని బీజేపీ ఓ ప్రణాళిక రచించిందని ఆరోపించారు. యువ కశ్మీరీ హిందువులు ప్రతిఘటించే సామర్థ్యం లేనివారని, అటువంటివారిని ఉగ్రవాదులు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


బీజేపీ నేతలపై ఆగ్రహం

కశ్మీరీ హిందువుల ఆగ్రహానికి జమ్మూ-కశ్మీరు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర నేతలు గురయ్యారు. రాహుల్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఈ నేతలు వచ్చినపుడు కశ్మీరీ హిందువులు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 


తల్లిదండ్రుల ఆవేదన

రాహుల్ భట్ తండ్రి బిటా భట్ గురువారం దుర్గానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి హత్యకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, పకడ్బందీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ తల్లి బబ్లి మాట్లాడుతూ, తన కుమారుడిని తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


Read more