Advertisement

కాసుల కోసం కక్కుర్తి

May 4 2021 @ 22:43PM
శ్మశానానికి తీసుకెళ్లేందుకు మహాప్రస్థానం వాహనంలో ఉంచిన మృతదేహం

కరోనా పరీక్ష నుంచి దహన సంస్కారాల వరకు అంతా దోపిడీనే..

ఒక్కో సెక్షన్‌కు ఒక్కో రేటు ఫిక్స్‌

ఓ వైపు కన్నీరు.. మరో వైపు పైసా వసూళ్లు

ఇదెక్కడి న్యాయం దేవుడా ? అల్లాడుతున్న ప్రజలు

కరోనాతో పలువురికి ఉపాధి

చేష్టలుడిగిన అధికారులు


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : మే 4 : కరోనా... ఈ పేరు  వింటేనే ప్రపంచ మానవాళి వణికిపోతున్నది. కరోనా రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఏ రోజు ఆ మహమ్మారి మన ఇంట్లో అడుగుపెడుతుందో..? అన్న భయంతో ప్రజలు అల్లాడిపోతు న్నారు. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రజల భయాన్ని, అవసరాలను క్యాష్‌గా మార్చుకుని కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు.


పరీక్షకు పెరిగిన డిమాండ్‌


కరోనా పరీక్ష(టెస్ట్‌)కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఓ వైపు ప్రభుత్వ వైధ్యశాలల్లో కరోనా పరీక్ష నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం, భారీగా క్యూలైన్‌ లు ఉండటంతో ప్రజలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్ష ధరను ఇష్టానుసా రంగా పెంచేశాయి. సహజంగా పరీక్షకు రూ.500 వసూలు చేస్తుండగా రిపోర్టులు మూడు రోజులకు వస్తున్నాయి. ఇలా కాకుండా రిపోర్టులు త్వరగా రావాలంటే వ్యక్తిని బట్టి రూ.1000 నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. అప్పటికప్పుడే రిపోర్టులు కావాలంటే రూ.5 వేలు వరకు వ సూలు చేస్తున్నారని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. ఇక ర్యాపిడ్‌ టెస్ట్‌లకు ప్రస్తుతం బాగా గిరాకీ పెరిగింది. ఒక్కో టెస్ట్‌కు ప్రైవేటు ల్యాబ్‌లు రూ.1000 నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు.


బతకాలంటే లక్షలు ఉండాలి...


కరోనా బారిన పడి బతకాలంటే భారీగానే నగదు చేతు ల్లో ఉంచుకోవాలని ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేటు వైధ్యశాలల్లో జరిగే కరోనా చికిత్స స్పష్టం చేస్తున్నది. కరోనా పరీక్షలో పాజిటివ్‌ వస్తే ఆ రిపోర్టును చేత పట్టుకొని పేద, మధ్య, ధనికం అన్న తేడా లేకుండా ప్రాణాలపై ఆశతో ప్రతి ఒక్కరూ నేరుగా ప్రైవేటు కొవిడ్‌ వైధ్యశాలలకు వెళుతున్నారు. అక్కడ భారీగా క్యూలైన్‌లు ఉండటంతో పక్కరోజుకు అపాయింట్‌ దొరుకుతున్నది. ఆ రోజు ఉదయం 7 గంటల కల్లా ప్రజలు వైధ్యశాల వద్దకు చేరుకుంటున్నారు. చెస్ట్‌ రిపోర్టుకు రూ.3వేలు, బీపీ, షుగర్‌, బ్లడ్‌.. ఇలా పలురకాల పరీక్షలకు మరో రూ.5 వేలు, చివరిగా మందులకు రూ.5 వేలు ఒక్కో రోగికి ఖర్చు అవుతుంది. ఇక పరిస్థితులు బాగాలేక బెడ్‌ కావాలంటే రెకమెండేషన్‌లు, బెడ్‌ దొరికిన తర్వాత ఫ్లాజ్మా కొరత అధికంగా ఉండటంతో ఫ్లాజ్మా కొసం తిరిగి తిరిగి కనీసం ఒక్క యూనిట్‌కు రూ.15వేలు చెల్లించాల్సి వస్తున్నది. ఇక ఆక్సిజన్‌ పెట్టాంటే రోజుకు వేలల్లోనే ఖర్చు, ఖర్మకాలి వెంటిలేటర్‌ అంటే మాత్రం లక్షలు చేతుల్లో ఉంచుకోవాల్సిందే. ఇలా కరోనా సోకి వ్యక్తి వైద్యశాలకు వెళితే మాత్రం ఉన్నదంతా అప్పజెప్పి రావాల్సి వస్తున్నది.


లెక్కకు మించి మరణాలు


ప్రతి రోజూ ప్రభుత్వ లెక్కల ప్రకారం పది లోపే కరోనా మృతులు కన్పిస్తున్నా, పదుల సంఖ్యలో ప్రజలు మృత్యుఒడికి చేరుకుంటున్నారు. నెల్లూరులోని బోడిగాడితోట శ్మశానానికే రోజుకు 20 నుంచి 30 వరకు కొవిడ్‌ మృతదేహాలు వస్తున్నా యని అక్కడవారు తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్మశా నాలకు ఎన్ని కొవిడ్‌ మృతదేహాలు వస్తాయో  అందాసుగా లెక్కవేస్తే రోజుకు 70 నుంచి 90 మఽధ్యలో ఉంటాయని స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం మాత్రం రోజుకు ఆరేడుమంది కంటే ఎక్కువ చనిపోవడం లేదని లెక్కలు చూపి సరిపెట్టుకుంటోంది. 


శవాలపై  దోపిడీ


కరోనా రెండో దశలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ మరణాలను పలువురు క్యాష్‌ చేసుకుంటూ శవాలపై నోట్లు ఏరుకుంటున్నారు. నగరంలోని ప్రభుత్వ వైధ్యశాలలో ఎవరైనా కరోనాతో మృతి చెందితే ఆ శవాన్ని మార్చురీకి తరలించాలంటే శవం పట్టేవారికి వెయ్యి చెల్లించాల్సిందే. ఇక శవం చెడిపోకుండా ఫ్రిజర్‌లో పెట్లాలంలే ఓ రేటు, ఆ శవాన్ని బయటకి తీసుకువెళ్లే పక్రియను పూర్తి చేయాలంటే ఓ రేటు, శవం మార్చురీ నుంచి బయటకు తీసుకువచ్చి మహాప్రస్థానంలో పెట్టేందుకు ఓ రేటు, మహాప్రస్థానం వాహనం మార్చురీ నుంచి శ్మశానానికి చేర్చినందుకు ఓ రేటు, ఇలా మృతదేహం మార్చురీ నుంచి శ్మశాన వాటిక వద్దకు వచ్చే వరకు మెత్తం మీద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇక ప్రైవేటు వైధ్యశాలలో కరోనాతో మృతి చెందిన మృతదేహాలను సాధారణ మరణాలుగా మార్చి ప్యాకేజీ రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకూ ధర్జాగా వసూలు చేస్తూ ఓ పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. ఒకవేళ ఎవరైతే ఈ విషయాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవ డంలేదు. కొన్ని వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి.


శ్మశాన వాటికలో మరో ప్యాకేజీ


కరోనాతో మృతి చెందిన వ్యక్తి మరణించినప్పటి నుంచి శ్మశానం వద్దకు చేరుకునే వరకు ఓ రకమైన ప్యాకేజీ. అయితే శ్మశానం వద్దకు చేరుకున్న తర్వాత ఇంకో ప్యాకేజీ. ఆంబులెన్స్‌ నుంచి మృతదేహాన్ని కిందకు దించి గుంతలోనో, పేర్చిన చితిపైనో పెట్టాలంటే రూ.2 నుంచి 3 వేలు చెల్లించాల్సి ఉంది. ఇక సాధారణ మరణాలనికి గుంత తవ్వాలంటే రూ.1500 కరోనా గుంత తవ్వాలంటే రూ.2500, సాధారణ మృతదేహాన్ని కాల్చాలంటే రూ. 3వేల లోపు ఖర్చు అవుతుంటే కరోనా మృతదేహాన్ని కాల్చాలంటే రూ.8 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా కరోనాతో మృతదేహం ఖననం  పేరుతో జిల్లాలో రోజూ లక్షల్లో వ్యాపారం సాగుతుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.