ప్రమాదాలకు కేరాఫ్‌ ‘ఆర్వోబీ’

ABN , First Publish Date - 2021-05-11T03:28:31+05:30 IST

కావలి పట్టణ నడిబొడ్డున ఉన్న ఉదయగిరి రోడ్డులోని ఆర్వోబి వంతెన ప్రమాదాలకు కేరా్‌ఫగా మారింది. వంతెనపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలతో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదాలకు కేరాఫ్‌ ‘ఆర్వోబీ’
ఆర్వోబీపై ప్రమాదకరంగా ఉన్న గుంత వద్ద వాహన చోదకుల ఫీట్లు

పట్టించుకోని అధికారులు, పాలకులు

వంతెనపై గుంతలతో తరచూ ప్రమాదాలు 

ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు


కావలి రూరల్‌, మే 10: కావలి పట్టణ నడిబొడ్డున ఉన్న ఉదయగిరి రోడ్డులోని ఆర్వోబి వంతెన ప్రమాదాలకు కేరా్‌ఫగా మారింది. వంతెనపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలతో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే వంతెనకు ఇరువైపుల పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌ పాత్‌ సైతం దెబ్బతినటంతో పాదచారులు అదుపుతప్పి గుంతల్లో పడి క్షతగాత్రులుగా మారుతున్నారు. వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా పేరుగాంచిన కావలి జాతీయ రహదారికి ఆనుకుని రోడ్డు, రైలు మార్గాలు కలిగిఉండటంతో పాటు విద్యా సంస్థలు ఎక్కువగా ఉండటంతో నిత్యం జనసందోహంతో రద్దీగా ఉంటుంది. అదీకాక నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండటంతో కావలి పట్టణానికి ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాలతో పాటు జిలా నలుమూలల నుంచి, ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వివిధ పనులపై కావలికి రాకపోకలు సాగిస్తుంటారు. కనక పట్టణంగా పేరుగాంచిన కావలికి నడిబొడ్డులో ఉన్న వంతెనపై నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే దీని పర్యవేక్షణలో అధికారులు, పాలకులు సీతకన్ను వేయడంతో  వంతెనపై జాయింట్ల వద్ద దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారులు ఆయా గుంతల వద్దకు వచ్చేసరికి వాహనాలను ఒక్కసారిగా పక్కకు తిప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి ఘటనతో ఈ నెల 5వ తేదీన ఆర్వోబి వంతెనపై వస్తున్న మోటారు సైకిల్‌ను లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతజరుగుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులకు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వంతెనపై ఉన్న గుంతలు పూడ్చలేని నాయకులు, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా చేపడతారని పట్టణ వాసులు వాపోతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి ఆర్వోబి వంతెనపై, ఫుట్‌పాత్‌పై ఉన్నగుంతలకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు.




Updated Date - 2021-05-11T03:28:31+05:30 IST