ఆక్రమణలతో పొంచిఉన్న ముప్పు!

ABN , First Publish Date - 2021-11-14T04:30:07+05:30 IST

తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎవరికి దొరికిన కాడికి వారు దోచుకోవటం తప్ప పట్టణ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాలను పట్టించుకునే వారే కరువయ్యారు.

ఆక్రమణలతో పొంచిఉన్న ముప్పు!
మందాడి చెరువు కలుజు వద్ద నిర్మిస్తున్న ఇల్లు

కాలువలు, చెరువు కలుజు ప్రాంతం కబ్జా

వర్షం వస్తే కావలిని చుట్టముట్టుతున్న నీరు

పట్టించుకోని పాలకులు, అధికారులు

కావలి, నవంబరు 13: తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎవరికి దొరికిన కాడికి వారు దోచుకోవటం తప్ప పట్టణ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాలను పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టణంలో కాలువలు, వంకలు, చెరువుల కలుజులు, నీటి గుంటలు సైతం ఎవరికి వారు దర్జాగా ఆక్రమించుకుని పూడ్చి వేస్తుండటంతోపాటు శాశ్వత కట్టడాలు చేపడుతుండడంతో వర్షాలు వస్తే కావలి ముంపునకు గురవుతోంది. కోట్లాది రూపాయల స్థలాలు ఆక్రమించుకుంటున్న ఆక్రమణదారులు అధికారులకు ఎంతో కొంత ముట్ట చెప్పుతుండడంతో అధికారులు కూడా ఈ రోజు ఉండి రేపు పోయేవారికి తమకెందుకులే తమకు వచ్చిన కాడికి ఆదాయం చూసుకుంటే చాలు అని పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణలపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుని తప్పించుకోవడం చూస్తే వారిపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మాల్సి వస్తోంది. ఆక్రమణదారులకు అధికారపార్టీ అండదండలు ఉండటంతో ఆక్రమణలను అడ్డుకునే వారు కరువయ్యారు. నీరు పారుదల కాలువలు ఆక్రమణల కారణంగా శని, ఆది వారాల్లో కురిసిన వర్షాలకు కావలి ముంపునకు గురైంది. ఇంకా పెద్ద వర్షం వస్తే పూర్తిగా నీటమునిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావలి మందాడి చెరువు అలుగు నీరు పోయే కాలువ ట్రంకురోడ్డుకు పడమర వైపు ఉండటంతో ఆ ప్రాంతంలో స్థలాలు అత్యంత విలువ ఉన్నాయి. దీంతో ఆక్రమణ దారులు ఆ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అడిగే వారులేక పోవటంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేక ఆ నీరు రోడ్డెక్కి ట్రంకురోడ్డు ముంపునకు గురైంది. అలాగే పైర్‌ స్టేషన్‌ రోడ్డలో ట్రంకురోడ్డు క్రాసింగ్‌ వద్ద రోడ్డుకు తూర్పున వర్షపు నీరు వెళ్లే కాలువ ఆక్రమణకు గురికావటంతో అక్కడ నీరు రోడ్డెక్కి రాకపోకలకు అంతరాయం కలిగింది. మందాడి చెరువుకు వర్షపు నీరు వచ్చే ప్రాంతం అంతా ఆక్రమణకు గురి కావటంతో చెరువులోకి నీరు వచ్చేందుకు మార్గం లేక ముసునూరు గిజన కాలనీ నీట ముగింది. వైకుంఠపురం అన్నపుగుంట ఆక్రమణలకు గురికావటంతో అక్కడ నీరు వెళ్లేందుకు మార్గం లేక పై నుంచి వచ్చే నీరంతా ఆ ప్రాంతంలో ఇళ్లలోకి చేరింది.  అలాగే పాపిరెడ్డి చెరువు కలజు కాలువ, అక్కడ వర్షపు నీరు వెళ్లే కాలువ కూడా ఆక్రమణకు గురవటంతో తుమ్మల పెంట రోడ్డులో వర్షపునీరు పోయే మార్గం లేక నీరు రోడ్డుపై పారి రోడ్డు దెబ్బతింటుంది. ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపడితే భవిష్యతులో కావలి పాతూరు, అంబేద్కర్‌ నగర్‌ తదితరు ప్రాంతాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి పట్ణణ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఆక్రమణకు గురైన నీటి కాలువలను సర్వే చేయించి వాటి ఆక్రమణలు తొలగించి కావలిని వరద ముప్పు నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-11-14T04:30:07+05:30 IST