flood water : కావేరికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-07T13:11:29+05:30 IST

ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కబిని, కృష్ణరాజసాగర్‌(Krishnarajasagar) రిజర్వాయర్ల నుంచి

flood water : కావేరికి కొనసాగుతున్న వరద

- 20 రోజుల్లో 120 టీఎంసీల నీరు సముద్రంపాలు

- వరద బాధితులకు సీఎం ఓదార్పు


చెన్నై, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కబిని, కృష్ణరాజసాగర్‌(Krishnarajasagar) రిజర్వాయర్ల నుంచి విడుదలవుతున్న నీటితో కావేరీ నది(Kaveri river) ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదకు వర్షపునీరు జతచేరడంతో వరద పోటెత్తుతోంది. మూడు రోజుల నుంచి ఈ వరద ఏమాత్రం శాంతించకపోవడంతో అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. హొగెనకల్‌ వద్ద కావేరీ నది ఇరువైపులా ఒడ్డును దాటి ఉరకలెత్తుతోంది. అదేవిధంగా మేట్టూరు జలాశయం(Mettur Reservoir) నుంచి శనివారం ఉదయం 23 వేల ఘనపుటడుగుల నీటిని, 16 గేట్ల ద్వారా 1.57 లక్షల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వల ద్వారా మరో 80 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేట్టూరు రిజర్వాయర్‌ నీటిమట్టం 120.40 అడుగులుగా ఉంది. మేట్టూరు రిజర్వాయర్‌ నుంచి భారీగా నీరు విడుదలవుతుండడంతో కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కావేరి నది(Kaveri river) డెల్టా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రమాద హెచ్చరికలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా కావేరి నదిలో ఏర్పడిన వరద ఉధృతి కారణంగా కొట్టైయూరు, పన్నైయూరు, అడి పాలారు, ఏమనూరు, చెట్టిపడ్పిడి, కొట్టైయూరు, మణ్ణవాడి, సేత్తుక్కుళి తదితర ప్రాంతాల్లోని అనేక మందిని వరద సహాయక శిబిరాలకు తరలించారు. అలాగే, మేట్టూరు జలాశయం నుంచి ఉపరితల నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, కరూర్‌, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టణం, మైలాడుదురై, కడలూరు, అరియలూరు, పెరంబలూరుతో సహా మొత్తం 12 జిల్లాలకు వరద ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 


నీరంతా సముద్రంపాలు

 20 రోజుల్లో రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదనీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. 20 రోజుల్లో దాదాపు 120 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మేట్టూరు జలాశయం నుంచే ఏకంగా వంద టీఎంసీలకుపైగా నీరు సముద్రంలో కలిసిపోయింది. 

వరద బాధితులకు సీఎం ఓదార్పు కావేరీ ఉధృతి కారణంగా నిరాశ్రయులైన బాధితులతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఫోనులో మాట్లాడి, ధైర్యం చెప్పారు. శుక్రవారం రాత్రి స్థానిక ప్యారీస్‏లోని ఎళిలగమ్‌ భవనంలో ఉన్న కంట్రోల్‌ రూంకు వెళ్ళిన సీఎం... అక్కడ నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ సమయంలో సీఎం వెంట అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కమిషనర్‌ ఎస్‌.కె.ప్రభాకర్‌ వరద బాధిత ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌(CM Stalin) ఈరోడ్‌, నామక్కల్‌ తదితర ప్రాంతాల్లోని వరద సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 



Updated Date - 2022-08-07T13:11:29+05:30 IST