రెండు గ్రామాలను నడిపిస్తోంది!

ABN , First Publish Date - 2020-11-30T06:41:45+05:30 IST

ఒకరి సాయం లేకుండా నడవలేవు. నువ్వు సర్పంచ్‌గా ఊరిని నడిపిస్తావా... దివ్యాంగురాలైన కవితా బోండ్వే సర్పంచ్‌ ఎన్నికల్లో నిలబడినప్పుడు అందరూ అన్న మాటలు. తన సత్తాను చూడకుండా, వైకల్యాన్ని మాత్రమే చూస్తూ ఎవరెన్ని మాటలన్నా పట్టనట్టే ఉంది...

రెండు గ్రామాలను నడిపిస్తోంది!

ఒకరి సాయం లేకుండా నడవలేవు. నువ్వు సర్పంచ్‌గా ఊరిని నడిపిస్తావా... దివ్యాంగురాలైన కవితా బోండ్వే సర్పంచ్‌ ఎన్నికల్లో నిలబడినప్పుడు అందరూ అన్న మాటలు. తన సత్తాను చూడకుండా, వైకల్యాన్ని మాత్రమే చూస్తూ ఎవరెన్ని మాటలన్నా పట్టనట్టే ఉంది. అవకాశం అందిపుచ్చుకొని పాలనలో తన ముద్ర వేసి, అభివృద్ధితో అందరి మెప్పు పొందడమే కాదు వరుసగా రెండోసారి రెండు గ్రామాలకు సర్పంచ్‌గా ఎంపికయింది. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలంతో అడుగులేస్తున్న ఆమె ప్రయాణం ఇది...


దహేగన్‌, వాగ్లుడ్‌... మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని ఈ రెండు గ్రామాలకు కవిత సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. దివ్యాంగురాలైన ఆమె సర్పంచ్‌ పదవికి ఎలా ఎంపికవడానికి చాలా కష్టపడింది. కవిత వాళ్ల నాన్న పుండలిక్‌ బొండ్వే ఊరికి మంచి చేయాలనే ఆలోచనతో 15 ఏళ్లుగా సర్పంచ్‌గా ఉన్నారు. అయితే ఆయనకు చదువు రాకపోవడంతో పాలన పరమైన నిర్ణయాలు, విధానాలు తెలుసుకోవడం కష్టమయ్యేది. దాంతో ఆయన 2011లో కవితను గ్రామపంచాయతి సభ్యురాలిగా బాధ్యత తీసుకోవాలని కోరారు. ‘‘నేను చేతి కర్రల సాయంతో నడవడం చూసి మొదట్లో అందరూ నవ్వుకునేవారు. నీకు నీవు సొంతంగా నడవలేవు. ఇక ఊరిని నడిపిస్తావా! అని తక్కువ చేసి మాట్లాడేవారు. వారు ఎన్ని అన్నా నేను పట్టించుకోలేదు. ఈ సమయంలో నా కుటుంబం దన్నుగా నిలిచింది. మా నాన్న, కొందరు గ్రామపెద్దల ద్వారా గ్రామ పాలనకు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా. 25 ఏళ్లకే సర్పంచ్‌ అయ్యానంటే ఎవ్వరూ నమ్మరు’’ అంటుంది కవిత. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి ఆమె ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, కమ్యూనిటీల పురోగతి, గ్రామాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండు గ్రామాలలో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. పాలనలో కొత్తదనం చూపడమే కాదు అవకతవకలకు కళ్లెం వేసింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె రెండు గ్రామాలలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, ఇంటింటికి మరుగుదొడ్లు, పేదవాళ్లకు ఇళ్లు కట్టించడం వంటి పనులు చేయించింది. ఆమెను రోజు వాళ్ల నాన్న లేదంటే సోదరుడు సర్పంచ్‌ ఆఫీసు దగ్గర బండి మీద దిగబెట్టి వెళతారు. ‘నువ్వు సర్పంచ్‌ అవుతావా?’ అని ప్రశ్నించిన వాళ్లే ఆమెను రెండో సారి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారంటే ఆమె సంకల్ప బలం గురించి ఎంత చెప్పినా తక్కువే.

Updated Date - 2020-11-30T06:41:45+05:30 IST