కాయ్‌ రాజా కాయ్‌

ABN , First Publish Date - 2020-12-01T05:15:46+05:30 IST

అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీతో ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సొమ్మును కాజేసేందుకు పుట్టుకొస్తున్న యాప్‌లలో గేమ్‌లదే పైచేయి.

కాయ్‌ రాజా కాయ్‌

జోరుగా ఆన్‌లైన్‌ రమ్మీ

అవగాహన లేక నష్టపోతున్న యువత

మిర్యాలగూడ టౌన్‌, చండూరు, హుజూర్‌నగర్‌, సూర్యాపేట క్రైం: అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీతో ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సొమ్మును కాజేసేందుకు పుట్టుకొస్తున్న యాప్‌లలో గేమ్‌లదే పైచేయి. ప్రధానంగా ఆన్‌లైన్‌ రమ్మీ ఉమ్మడి జిల్లాలో జోరుగా నడుస్తుండగా, దీనికి బానిసైన యువత ఆర్థికంగా నష్టపోతోంది.

చండూరు మండలంలో ఇటీవల ఓ యువకుడు 15రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌ రమ్మీతో రూ.3లక్షలు సంపాదించాడు. దీంతో చాలా మంది యువకులు ఆన్‌లైన్‌ రమ్మీ ఆడటం ప్రారంభించారు. ఒక్కో రోజు రూ.30వేల వరకు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఒకే వ్యక్తి రెండు ఫోన్లతో వేర్వేరు ఐడీలతో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు. ఈ రెండు ఐడీలు ఒకే టేబుల్‌లో పక్కపక్కన వచ్చినప్పుడు లాభపడుతున్నారు. ఈ తరహాలో చాలా సందర్భాల్లో డబ్బును నష్టపోతున్నారు. అంతేగాక ఇద్దరు ముగ్గురు ఒక చోట ఉండి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు. హుజూర్‌నగర్‌లో సీతారాంనగర్‌, మల్లన్ననగర్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీ, ఇందిరా సెంటర్‌, ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌ ప్రాంతాల్లో యువకులు ఆన్‌లైన్‌ జూదం జోరుగా ఆడుతున్నారు. ఇటీవల ఒకరు ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడగా భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. పలువురు వ్యాపారవేత్తలు, ఒక రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సైతం ఆన్‌లైన్‌ జూదం ఆడుతున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌ రమ్మీతోపాటు షేర్‌మార్కెట్లలో డబ్బులు పెట్టి చాలామంది నష్టపోతున్నారు. సూర్యాపేటలో మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి అప్పులు చేసి షేర్‌మార్కెట్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ఎవరికీ కనిపించకుండాపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా సూర్యాపేటలో ఓ మొబైల్‌ దుకాణం నిర్వహించే యువకుడు షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి చివరికి ఐపీపెట్టి ఉడాయించాడు. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ ఆర్థికంగా నష్టపోవడమేగాక కుటుంబసభ్యులకు సమయం కేటాయించకుండా వారిని పట్టించుకోవడం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.


భారీ వ్యాపారం

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ వ్యాపారంగా మారాయి. దేశ వ్యాప్తంగా 24 శాతం మంది ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్న ట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ జోలికి పోవద్దని సైబర్‌ పోలీసులు ప్రచారం చేస్తున్నా, కాలక్షేపం కోసం పేకాడే వారు ఆ తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌ రమ్మీలో అవతలి పార్ట్‌నర్‌ చాలా సందర్భాల్లో మర మనిషే(రోబో) ఉండొచ్చని ఐటీరంగ నిపుణులు చెబుతున్నారు. ఆట ఆరంభించిన మొదట్లో మనల్ని గెలిపించి ఆసక్తి కల్చించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తారని, ఆ తరువాత జేబు ఖాళీ అవుతుంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా యువత ఈ తరహా యాప్‌లకు బానిసవుతున్నారు. పేకాట రాయుళ్లు లక్షలాది రూపాయలు ఆన్‌లైన్‌ రమ్మీలో పోగొట్టుకుని అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి.


కరోనా సమయంలో..

కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన వారు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ఆసక్తి చూపారు. క్రమంగా వాటికి బానిసై చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. ఆన్‌లైన్‌ రమ్మీ, ఐపీఎల్‌ బెట్టింగ్‌, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలయ్యారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు ప్రమోషన్‌ కోసం సినీ, క్రీడాకారులతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ తరహా ప్రచారంతో యాప్‌లు జనంలోకి వెళ్లి యువతను ఆకర్షిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ రమ్మీపై ఆంక్షలు విధించాయి. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆటగాళ్లు ఐపీ అడ్రస్‌ మార్చుకుని మరీ జూదమాడుతున్నారు.


సింగిల్‌ టు టోర్నమెంట్‌ వరకు

ఆన్‌లైన్‌ రమ్మీపై ఆసక్తి పెంచేందుకు యాప్‌ నిర్వాహకులు వన్‌ టు వన్‌ నుంచి ఆరుగురు ఆడేలా టోర్నమెంట్లు, మెగా ఈవెంట్‌ అంటూ యాప్‌ను రూపొందిస్తున్నారు. సింగల్‌గా ఆడినప్పుడు బెస్ట్‌ఆఫ్‌ త్రీ నిర్వహించి తక్కువ స్కోరున్న వారిని విన్నర్‌గా డిక్లేర్‌ చేస్తున్నారు. టేబుల్‌, క్యాష్‌ గేమ్స్‌ చాలా రకాలు ఉన్నాయి. ఒక పాయింట్‌కు రూ.4 నుంచి రూ.1000 వరకు బెట్టింగ్‌ పెట్టాల్సి ఉంటుంది. పాయింట్‌ రమ్మీలో 80కౌంట్‌కు రూ.320 నుంచి రూ.80వేల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. టేబుల్‌లో వచ్చిన డబ్బులో నిర్వాహకులు 15శాతం తీసుకుని 85శాతం ఆటగాడికి ఇస్తారు. టోర్నమెంట్‌లో అయితే వందల మంది ప్లేయర్స్‌ పాల్గొనవచ్చు. బెట్టింగ్‌ తక్కువగా ఉండి లాభం ఎక్కువగా ఉంటుంది. 150 మంది ఆడితే 25టేబుల్స్‌ నిర్వహిస్తారు. సభ్యత్వం కోసం రూ.1000 తీసుకుంటారు. అంటే టోర్నమెంట్‌ విలువ లక్షన్నర అన్నమాట. అందులో నిర్వాహకులు రూ.22,500 తీసుకొని మిగతాది గెలిచినవారికి ఇస్తామని వల వేస్తారు. ఇలా టోర్నమెంట్‌లో గెలిచిన వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటే డబ్బు పోగొట్టుకునే వారి సంఖ్య రెట్టింపుగా ఉంటుంది.


ఆన్‌లైన్‌ ఆటలతో ఇబ్బందులు : ఆర్‌.భాస్కరన్‌, సూర్యాపేట  జిల్లా ఎస్పీ

ఆన్‌లైన్‌ ఆటలతో ఇబ్బందులు తప్పవు. ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలి. కొంతమంది ఆన్‌లైన్‌ ఆటలకు బానిసలుగా మారుతున్నారు. అలాంటి వారిలో మార్పు రావాలి. తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. ఆన్‌లైన్‌లో బెట్టింగులకు పాల్పడి నష్టపోతున్నవారు ఈ మధ్య కాలంలో అధికమవుతున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచుతున్నాం.


ఆన్‌లైన్‌ రమ్మీ ఆడటం చట్టవిరుద్ధం:వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ  డీఎస్పీ

ఆన్‌లైన్‌ రమ్మీ ఆడటం చట్టవిరుద్ధం. నిబంధనలు అతిక్రమించి జూదమాడే వారిపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్‌ కారణంగా విద్యనభ్యసించే విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్‌ ఫోన్లను వినియోగించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఫింగర్‌ టిప్స్‌తో చేజారే డబ్బును తిరిగి పొందడం కష్టం. బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడేవారి సమాచారం పోలీసులకు అందించాలి.


Updated Date - 2020-12-01T05:15:46+05:30 IST