తెలంగాణతో పనిలేదని దేశంమీద పడ్డ కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-07T05:43:31+05:30 IST

తెలంగాణలో తన పని అయిపోయిందని కేసీఆర్‌ దేశం మీద పడ్డారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.

తెలంగాణతో పనిలేదని దేశంమీద పడ్డ కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌ రెడ్డి

ఎన్టీఆర్‌ లాగే కేసీఆర్‌ రాజకీయాల్లో కనుమరుగవడం ఖాయం

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 6 : తెలంగాణలో తన పని అయిపోయిందని కేసీఆర్‌ దేశం మీద పడ్డారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మా ట్లాడారు. విజయదశమి రోజున టీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేసి బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త జాతీయ పార్టీ పెట్టడంతో ఎనిమిదేళ్లుగా తెలంగాణకు పట్టిన శని వీడిందని, ప్రజలకు కేసీఆర్‌ నుంచి ఇక విముక్తి కలుగనుందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియమకాలే ఎజెండాగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఆ హక్కులను కాపాడడం లో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. అనాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతో ఏర్పడ్డ టీడీపీ ఎన్టీఆర్‌ సారథ్యంలో ఆధికారంలోకి వచ్చిందని, జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే భావనలో పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రజలు అడుగడుగునా దోపిడీకి గురయ్యారన్నారు. ఈ ప్రాంత ప్రజల హక్కు లను కాపాడడంలో విఫలమైన కేసీఆర్‌ కొత్తగా బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో దేశ రాజకీయా ల్లోకి వెళుతున్నారని అనాడు ఎన్టీఆర్‌కు పట్టిన గతే నేడు కేసీఆర్‌కు పట్టక తప్పదన్నారు. ఏపీలో సీఎం జగన్‌ మైత్రి కోసం రాయలసీమ ప్రాజెక్టు నీటి దోపిడీకి కేసీఆర్‌ అనుమ తించారన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నెపంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలా లను ఆంధ్రాలో విలీనం చేస్తే కేంద్రంతో దోస్తీగా ఉన్న కేసీఆర్‌ కనీసం పోరాటం చేయ లేదన్నారు. అంతే కాకుండా 365 రోజుల నిరంతరం జల విద్యుత్‌ ఉండే సీలేరు ప్రాజె క్టును ఏపీ రాష్ట్రంలో కలిపివేసి, నీటి పంపకాల్లో మన వాటాను తీసుకోలేని అసమర్థుడు కేసీఆర్‌ అని విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న 1800 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని పరిహారం ఇచ్చి ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమే లేకుండేదని రాష్ట్రానికి ఒక లక్ష కోట్లు మిగులుండేవన్నారు. హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ కాదని తెలంగాణలో అంతర్భా గమని దీక్ష చేశానని చెప్పుకున్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్న ఫ్రీజోన్‌గానే అమలవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ రద్దుతో తెలంగాణ గురించి ఉచ్చరించే నైతిక హక్కు కేసీఆర్‌కే లేదని తేల్చి చెప్పారు. రైతుల విషయంలో కేసీఆర్‌ అవలంభిస్తున్న వైఖరి కర్నాటక మాజీ సీఎం కుమార స్వామికి తెలియదని, రైతుబంధు పేరుతో ఏయే కార్యక్రమాలు రద్దు చేసారో అనే పూర్తి వివరాలతో లేఖను రాసి కేసీఆర్‌ నిజస్వరూపాన్ని బయటపెడుతానన్నారు. రానున్న రోజుల్లో దేశంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డబుల్‌ ఇంజన్‌లా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, ప్లోర్‌ లీడర్‌ కల్లెపెల్లి దుర్గయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండ మధు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గాజుల రాజేందర్‌, అల్లాల రమేష్‌ రావు, లేశెట్టి విజయ్‌, చాంద్‌ పాష, మామిడిపెల్లి మహిపాల్‌, బాస మహేష్‌, ముద్దం రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-10-07T05:43:31+05:30 IST