అదనపు అప్పుల కోసంకేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌

ABN , First Publish Date - 2022-09-26T08:14:45+05:30 IST

అదనపు రుణాల కోసం టీఆర్‌ఎస్‌ నాయకత్వం కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

అదనపు అప్పుల కోసంకేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌

  • కేంద్రాన్ని బెదిరిస్తున్న సీఎం
  • అప్పులు తప్ప.. మరో పని చేయని ప్రభుత్వం
  • భారీ సెటిల్‌మెంట్లు చేస్తున్న కల్వకుంట్ల కుటుంబం
  • ఆ డబ్బుతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు
  • ధరణి పేరుతో భూములను ఆక్రమిస్తున్నారు
  • దేశాన్ని ఉద్ధరిస్తాననే ఊహల్లో కేసీఆర్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అదనపు రుణాల కోసం టీఆర్‌ఎస్‌ నాయకత్వం కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘మాకు రుణం ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తం.. విపక్షాలను ఏకం చేస్తం’’ అంటూ సీఎం కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని తెలిపారు. అప్పు చేయనిదే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి, భూములు అమ్మనిదే రోజు గడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని విమర్శించారు. అప్పులు చేయడం, భూములు అమ్మడం తప్ప టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో పని చేయడంలేదని ధ్వజమెత్తారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం భారీ సెటిల్‌మెంట్లు చేస్తోందని, నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూముల వ్యవహారాలను సెటిల్‌ చేసి ఆ డబ్బులను ఇతర  రాష్ట్రాల్లో రాజకీయం కోసం వెచ్చిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, చైనా వంటి దేశాల కంటే దారుణంగా మనదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కేసీఆర్‌ అనడాన్ని కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఓసారి మీ కల్వకుంట్ల కుటుంబం ఆ దేశాలకు వెళ్లి రెండేళ్లు బతికి రండి. అక్కడి ఆర్థిక పరిస్థితేంటో తెలిసివస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోతే గత ఆగస్టులో (మొదటి త్రైమాసికంలో) జీఎస్టీ ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల రెవెన్యూ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 


ధరణి పేరుతో భూముల అక్రమణ..

ధరణి పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు, విదేశాల్లో ఉన్నవారి భూములను మోసం చేసి ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, అసైన్డ్‌, ఐడీపీఎల్‌, హెచ్‌ఎంటీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూములు, చెరువులు, కుంటలను కూడా వదలడం లేదన్నారు. దేశాన్ని తానే ఉద్ధరిస్తానని కేసీఆర్‌ ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో అబద్దాలాడే కుటుంబాల్లో కల్వకుంట్ల కుటుంబం నెంబర్‌వన్‌ అని విమర్శించారు. కేసీఆర్‌ చెప్పినట్లుగా పతంగుల మాంజాను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఖర్మ మన దేశానికి పట్టలేదన్నారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌, ధూల్‌పేట, మోంజా మార్కెట్‌లోనే పెద్ద ఎత్తున మాంజా తయారు చేస్తారని చెప్పారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ప్రకటిస్తుందన్నారు. 

Updated Date - 2022-09-26T08:14:45+05:30 IST