రచయితల్ని కొనేస్తున్న కేసీఆర్‌

Sep 20 2021 @ 02:33AM

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌దీ అదే బాట

సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో కవులు, రచయితలని ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ నిర్వీర్యంగా మారుస్తున్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్‌ ఆయనకు సన్మానం చేసింది. ఈ సభలో ప్రసంగించిన నిఖిలేశ్వర్‌.. రెండు రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితి నెలకొన్నదని.. సగంమంది కవులు, రచయితలు దారి తప్పిపోతున్నారని, పదవులకు, అధికారానికి అమ్ముడుపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ రచయితలను కొనేస్తున్నారని, గోరటి వెంకన్న వంటి ఒక ప్రజాగాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. సుద్దాల అశోక్‌ తేజ వంటి గాయకుడు, సాహితీవేత్త.. అటు తరిమెల నాగిరెడ్డిని కీర్తిస్తూ ఎంత గొప్పగా రాయగలరో, ఇటు కేసిఆర్‌ను కీర్తిస్తూ అంతే గొప్పగా రాయగలరని అన్నారు.


రచయితకు ఆత్మవంచన కూడదన్నారు. కేసిఆర్‌ చాలా తెలివైన వారని.. సంస్కృతిని, భాషను, ప్రాంతీయతను ఉపయోగించుకుని సానుభూతిని రగిలించి పలువురిని తన వైపునకు తిప్పుకొన్నారని ఆరోపించారు. ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి కూడా కేసిఆర్‌ బాటలోనే నడుస్తున్నారని ఆయన అన్నారు.   ఇవాళ పాలకులు మాత్రం ఎవరినైనా కొనేయగలరని, ఏమైనా చేయగలరని నిఖిలేశ్వర్‌ చెప్పారు. పురస్కారాలకు, అవార్డులకూ తాను చేయి చాచలేదని, అవి వాటంతట అవే వచ్చాయని, సాహిత్య అకాడమీ అవార్డు కూడా అలా వచ్చిందేనని.. ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది కనుక అంగీకరించానని నిఖిలేశ్వర్‌ చెప్పారు. భూమిపై దారిద్య్రం ఉన్నంతకాలం మార్క్సిజం శాస్త్రీయంగా పరిష్కారం చూపుతుందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు నిఖిలేశ్వర్‌ను పరిచయం చేస్తూ.. ఇప్పటికీ దిగంబర కవిత్వం అధునాతనమేనని, నాటు దిగంబర కవులు లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా విలువ ఉన్నదని వివరించారు. ఆకాశవాణి వ్యాఖ్యాత కందుకూరి సూర్యనారాయణ, ఆంరఽధాఅసోసియేషన్‌ కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వీసీ శ్రీకృష్ణ దేవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.