munugode: హుటాహుటిన ప్రగతిభవన్‌కి రావాలని హరీష్‌రావుకు కేసీఆర్‌ పిలుపు

ABN , First Publish Date - 2022-10-04T23:31:32+05:30 IST

మునుగోడు (munugode)లో ఎలాగైనా గులాబీ జండా ఎగురవేయాలని ఆ పార్టీ బాస్ కేసీఆర్ (kcr) మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

munugode: హుటాహుటిన ప్రగతిభవన్‌కి రావాలని హరీష్‌రావుకు కేసీఆర్‌ పిలుపు

మునుగోడు: మునుగోడు (munugode)లో ఎలాగైనా గులాబీ జండా  ఎగురవేయాలని ఆ పార్టీ బాస్ కేసీఆర్ (kcr) మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. హుజురాబాద్ (Huzurabad)  అనుభవంతో కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. మంత్రి హరీష్‌రావు (Harish Rao)కు మునుగోడు బాధ్యతలు అప్పగించడంపై మరో కోణం వినిపిస్తోంది. మునుగోడులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రచారం నేపథ్యంలోనే హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ ఎత్తుగడలను ఈటల పసిగట్టే అవకాశం ఉన్నందున.. కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందువల్ల వెంటనే ప్రగతిభవన్‌కి రావాలని హరీష్‌రావుకు కేసీఆర్‌ నుంచి పిలుపువచ్చింది. 


దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో అధికార టీఆర్‌ఎస్‌ మునుగోడులో ఆ లోపాలకు తావివ్వొద్దని నిర్ణయించింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటరు కేంద్రంగానే సైలెంట్‌గా ప్రచారం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలు పూర్తిగా ఇవ్వాలని, ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఒక కీలకనేతను బాధ్యుడిని చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నిర్ణయంలోనూ స్వల్ప మార్పులు చేసినట్లు తెలిసింది. 


చేరికలు, పెద్ద నాయకుల అవసరం అనుకున్నప్పుడే మంత్రులస్థాయినేతలు రావాలి. మిగిలిన సమయమంతా మంత్రి జగదీ్‌షరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుల పర్యవేక్షణలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సీపీఎం, సీపీఐ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార బరిలోకి దిగేందుకు ఆయా పార్టీల నేతలతో గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రచారంలో మూడు పార్టీల నేతలు కలిసే వెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని రైతులు బీజేపీ అంటేనే భయపడేలా కార్యాచరణ రూపొందించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటరుకు మీటరు తప్పదంటూ  ప్రచారానికి రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 

Updated Date - 2022-10-04T23:31:32+05:30 IST