ప్రజల దృష్టిని మళ్లించడానికే ఢిల్లీలో కేసీఆర్ ధర్నా: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-13T00:00:56+05:30 IST

ప్రజల దృష్టిని మళ్లించడానికే ఢిల్లీలో కేసీఆర్ ధర్నా: విజయశాంతి

ప్రజల దృష్టిని మళ్లించడానికే ఢిల్లీలో కేసీఆర్ ధర్నా: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని, తన రాజకీయాల కోసం రైతులను కేసీఆర్ వాడుకుంటున్నాడని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక పెద్ద అబద్ధాలకోరని, కమీషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని, సీఎం కేసీఆర్ తన తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని విజయశాంతి ఆరోపించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా.. 


''తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తుండు. తన రాజకీయాల కోసం రైతులను కేసీఆర్ వాడుకుంటున్నడు. ఆయన ఒక పెద్ద అబద్ధాలకోరు. కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ తన తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. పాకిస్థాన్, శ్రీలంక దేశాల అప్పుల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువ. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో కేసీఆర్‌లో వణుకు మొదలైంది. అందుకే ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా... సమస్యలపై తనను నిలదీయకుండా ఆపడానికి ఈ దొంగ ధర్నాలు షురూ జేసిండు. ఈ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవు. ఆయన దగ్గర రాష్ట్రాలు తిరగడానికి... ఎన్నికల కోసమని పార్టీకి వ్యూహకర్తల్ని నియమించుకోవడానికి డబ్బులుంటాయి కానీ, వడ్లు కొనడానికి, రైతులకి ఇవ్వడానికి మాత్రమే డబ్బులు లేవా? మిల్లర్లతో కుమ్మక్కయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేసి రైతులకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నడు. పంజాబ్ నుంచి కూడా రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనడం లేదని... మాట్లాడితే పంజాబ్ పేరెత్తే కేసీఆర్‌కి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కౌంటర్ ఇచ్చింది. అసలు తెలంగాణ నుంచి రా రైస్ సేకరణకు ప్రతిపాదనేది రాలేదని తేల్చి చెప్పింది. రా రైస్ ఎంతిచ్చినా తీసుకుంటామని ఎఫ్‌సీఐ రీజనల్ జీఎం కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ చేసేవన్నీ ఒట్టి నాటకాలు, చెప్పేవన్నీ ప‌చ్చి అబద్దాలని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారితోనే రైతు రాజ్యం సాధ్యం. అందుకే మోడీగారు పంట‌ల‌కు మ‌ద్దతు ధ‌ర పెంచారు. ప్రతిపక్షాలకు ఏనాడూ అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్... మోడీగారు తనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని చెబుతుంటే నవ్వొస్తోంది. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపలేరు. తెలంగాణ‌లో ఖ‌చ్చితంగా బీజేపీ జెండా ఎగ‌ర‌డం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-04-13T00:00:56+05:30 IST