గవర్నర్‌ బంగ్లాలో గణతంత్ర వేడుకలకు కేసీఆర్‌ డుమ్మా!

ABN , First Publish Date - 2022-01-27T08:07:06+05:30 IST

గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య విభేదాలు ముదురుతున్నట్లే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

గవర్నర్‌ బంగ్లాలో గణతంత్ర వేడుకలకు కేసీఆర్‌ డుమ్మా!

  • గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య దూరం పెరిగిందా?
  • మంత్రులు కూడా హాజరుకాని వైనం.. 
  • తమిళిసై ప్రసంగాన్ని ఆమోదించని క్యాబినెట్‌?
  • తెలంగాణ రాష్ట్ర ప్రగతి లెక్కలను ప్రస్తావించని గవర్నర్‌
  • కేంద్ర ప్రగతి, ప్రధాని మోదీని ప్రశంసించడంపైనే దృష్టి
  • రాష్ట్రానికి కేంద్రం 8 మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని వెల్లడి


రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరిగిందా? గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారా? ఇద్దరి మధ్యా విభేదాలు ముదురుతున్నాయా? రోజురోజుకూ గ్యాప్‌ పెరుగుతోందా? అంటే.. తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. 


హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య విభేదాలు ముదురుతున్నట్లే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకుసీఎం కేసీఆర్‌ గైర్హాజరవడంతో ఈ వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయింది. గవర్నర్‌ తమిళిసై ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని మోదీని పొగుడుతుండడం కూడా కేసీఆర్‌తో గ్యాప్‌ పెరిగిందనడానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. పైగా గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్‌ చదివిన స్పీచ్‌ కాపీని క్యాబినెట్‌ ఆమోదించలేదని, గవర్నరే స్వయంగా తయారు చేసుకుని చదివారని చర్చించుకుంటున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం 73వ గణతంత్ర వేడుకలు జరిగాయి. దీనికి సీఎం కేసీఆర్‌ హాజరవలేదు. ఆయన తరఫున కనీసం మంత్రులు కూడా హాజరు కాలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవాన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి, జిల్లాల్లో మంత్రులు, గణతంత్ర దినోత్సవాన గవర్నర్‌, జిల్లాల్లో కలెక్టర్లు జాతీయ పతాకాలను ఎగురవేస్తారు. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసినా.. సీఎం, మంత్రులు హాజరవడం పరిపాటి. కానీ, ఈసారి సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రగతి భవన్‌లోనే ఉన్నప్పటికీ కూతవేటు దూరంలోని రాజ్‌భవన్‌కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించారు.


డెల్టా విజృంభిస్తున్నా హాజరయ్యారుగా..? 

ఒమైక్రాన్‌ వేరియంట్‌ విస్తరణ కారణంగా కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో ఆహ్వానితులతో నిర్వహించాలని ముందుగానే నిర్ణయించారు. సీఎస్‌, డీజీపీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హాజరు కాలేదు. కనీసం ఆయన తరఫున ఒకరిద్దరు మంత్రులను పంపినా గౌరవంగా ఉండేదన్న చర్చ జరిగింది. సీఎం, మంత్రులు వెళ్లకుండా గణతంత్ర దినోత్సవాన్ని అవమానించారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. గవర్నర్‌తో విభేదాలుంటే కనీసం ఆ పదవికైనా విలువ ఇవ్వాల్సిఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవానికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం కూడా డెల్టా వేరియంట్‌ విజృంభించిందని, అప్పుడు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారని.. సీఎం కేసీఆర్‌ కూడా హాజరయ్యారని గుర్తుచేస్తున్నారు. అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అప్పుడు హాజరైన సీఎం.. ఇప్పుడు ఎందుకు హాజరు కాలేదో? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీతో ఇటీవల పెరిగిన విభేదాల కారణంగానే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కేసీఆర్‌ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 


కావాలనే డుమ్మా కొట్టారా..?

ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికీ గైర్హాజరయ్యారు. అంటే కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్‌తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.. పరేడ్‌ గ్రౌండ్‌ లేదా పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించే గణాంకాలను గవర్నర్‌ చదువుతుంటారు. కానీ, ఈసారి అలా జరగలేదు. పైగా గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రధాని మోదీని రెండు సార్లు పొగిడారు. మోదీ దూరదృష్టి కారణంగా దేశం వివిధ రంగాల్లో దూసుకెళుతోందని ప్రశంసించారు. ప్రధాని నిరంతర శ్రమ వల్ల ప్రపంచంలోనే భారత్‌ను ఒక ముఖ్యమైన శక్తిగా పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని మంత్రులు విమర్శిస్తుండగా.. గవర్నర్‌ మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 8 మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని గుర్తు చేశారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. గతంలోనూ ఆయుష్మాన్‌ భారత్‌పై వ్యాఖ్యలు చేశారు. తన ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరిందన్నారు. ఇటీవల గవర్నర్‌ రాజ్‌భవన్‌లో రెండు ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేశారు. ఇది కూడా కేసీఆర్‌ సర్కారుకు నచ్చలేదని తెలుస్తోంది. మొత్తం మీద సీఎంవో, రాజ్‌భవన్‌ మధ్య అగాథం పెరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-01-27T08:07:06+05:30 IST