రంగంలోకి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-08-14T07:30:31+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

రంగంలోకి కేసీఆర్‌

మునుగోడును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి!


‘హుజూరాబాద్‌’లా కానివ్వొద్దని నిర్ణయం

ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టితో కార్యాచరణ

అసంతృప్త నేతలకు స్వయంగా బుజ్జగింపు

కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని.. వ్యతిరేకించే వారికి ప్రగతిభవన్‌కు పిలుపు

కంచర్ల కృష్ణారెడ్డితో సీఎం గంటన్నర భేటీ

అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచన

20న బహిరంగ సభ విజయవంతానికి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు

సభ తర్వాత గ్రామాల వారీగా అప్పగింతఛ


హైదరాబాద్‌/నల్లగొండ 13 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినందున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంత దూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల్లో పాల్గొనాలని సీఎం నిర్ణయించారు. తొలి సభను ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో నిర్వహిస్తుండగా, మరో సభను పోలింగ్‌కు ముందు నిర్వహించనున్నారు. తొలి బహిరంగ సభకు ముందే అసంతృప్తులను బుజ్జగించాలనే ఉద్దేశంతో ఆశావహులను, అసంతృప్తిగా ఉన్న నేతలను ప్రగతిభవన్‌కు రావాలని పిలిచారు. ఈ మేరకు ఆశావహుల్లో ఒకరైన నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి శనివారం వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు.


ఆయనతో సీఎం సుమారు గంటన్నరసేపు మాట్లాడారు. నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీశారు. తనకున్న సర్వే నివేదికల ప్రకారమే అభ్యర్థిని ఎంపిక చేశానన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం అంతా కలిసి పని చేయాలని సూచించారు. దాంతోపాటు ఈ నెల 20న మునుగోడులో నిర్వహించనున్న ప్రజా దీవెన బహిరంగసభ పైనా చర్చించారు. ఈ సభ విజయవంతం కోసం పనిచేయాలని నిర్దేశించారు. ‘‘టికెట్‌ ఆశిస్తున్న ఇతరులను పిలవకుండా మిమ్మల్నే పిలిచి మాట్లాడుతున్నానంటే అందులోని ఆంతర్యం గ్రహించాలి’’ అని కృష్ణారెడ్డితో సీఎం అన్నన్నట్లు తెలిసింది. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని కృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం. 


జన సమీకరణకు మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు..

మునుగోడు బహిరంగసభను విజయవంతం చేసేందుకు మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలంతా ఈ సభ కోసం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మకాం వేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరితో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సమావేశమయ్యారు. మునుగోడు మండల బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి అప్పగించారు. ఇక నారాయణపురం మండలానికి ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, గొంగిడి సునీత, చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి నల్లమోతు భాస్కర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, చౌటుప్పల్‌ రూరల్‌కు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, మర్రిగూడ మండలానికి పైళ్ల శేఖర్‌రెడ్డి, నాంపల్లి మండలానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, చండూరు మునిసిపాలిటీకి చిరుమర్తి లింగయ్య, చండూరు రూరల్‌కు నోముల భగత్‌, యాదాద్రి జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు శనివారమే తమ పని ప్రారంభించారు. కాగా, సభ ముగిసిన తర్వాత గ్రామాల వారీగా రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అంతేకాకుండా.. ఏ గ్రామంలోనైనా పార్టీకి 52 శాతం కన్నా తక్కువ పోలింగ్‌ నమోదైతే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మునుగోడు బహిరంగ సభను ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని 40 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు, సభ ఏర్పాట్ల బాధ్యతను గాదరి బాలమల్లుకు అప్పగించారు. మరోవైపు మండలాల ఇన్‌చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ‘‘తొలుత ఈ నెల 20న సీఎం సభను విజయవంతం చేద్దాం. పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుందాం. చిన్న చిన్న సమస్యలుంటే ఎన్నికల తర్వాత కూర్చొని పరిష్కరించుకుందాం’’ అంటూ స్థానిక క్యాడర్‌కు చెబుతున్నారు. 


కూసుకుంట్ల అభ్యర్థి అయితే అసంతృప్తుల ప్రత్యేక సభ!

మునుగోడు ఉప ఎన్నికకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రకటిస్తే తమ దారి తాము చూసుకోవాలనే యోచనలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందులో భాగంగా తాము కూడా 30 వేల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం తాము స్వతంత్రులుగా బరిలోకి దిగడమా, లేక బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఒకరికి మద్దతివ్వడమా అనే అంశంపైనా చర్చించి అదేరోజు ప్రకటించాలని నిర్ణయించారు. సీఎం సభ విజయవంతానికిగాను చౌటుప్పల్‌ మండలంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా అసంతృప్త నేతలకు వారు ఫోన్‌ చేయగా, 11మంది సర్పంచ్‌లు, ఎంపీపీ గైర్హాజరయ్యారు.

Updated Date - 2022-08-14T07:30:31+05:30 IST