తమిళి‘సై’తో కేసీఆర్‌ సై

ABN , First Publish Date - 2022-03-01T07:32:35+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. అసెంబ్లీలో గవర్నర్‌ అడుగు పెట్టకుండానే...

తమిళి‘సై’తో కేసీఆర్‌ సై

  • గవర్నర్‌కు మరో షాక్‌
  • గవర్నర్‌ తమిళిసై ప్రసంగం లేకుండానే..
  • అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • స్పీకర్‌తో ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం
  • ప్రొరోగ్‌ కాకపోవడంతో కొనసాగింపుగా సభ
  • ఉభయ సభల భేటీ అక్కర్లేదని అభిప్రాయం
  • గవర్నర్‌తో ముదిరిన వివాదమే కారణం!
  • 7 నుంచి ఉభయ సభల భేటీ, అదే రోజు బడ్జెట్‌ 
  • గవర్నర్‌ లేకుండా భేటీపై సంజయ్‌ మండిపాటు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. అసెంబ్లీలో గవర్నర్‌ అడుగు పెట్టకుండానే ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం.. ప్రభుత్వం తరఫున మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మేడారంలో గవర్నర్‌కు ప్రొటోకాల్‌ పాటించలేదన్న వివాదం.. తాజాగా గవర్నర్‌ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం.. ఈ ఘటనలన్నింటినీ చూస్తుంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయన్న చర్చ జరుగుతోంది. గవర్నర్‌ను నిమిత్తమాత్రురాలిగా చేయడానికి సీఎంవో ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ముదిరిన వివాదం కారణంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయుతే, రాజకీయ పార్టీల మధ్య ఉన్న పొరపొచ్చాలు, వివాదాలకు వ్యవస్థలను బలి చేయవద్దని, రాజ్యాంగపరమైన పదవులకు విలువ ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ... ప్రభుత్వం ఇ లాంటి అభిప్రాయాలు, విమర్శలను ఏమాత్రం లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. 


7 నుంచి అసెంబ్లీ సమావేశాలు...

7వ తేదీనుంచి నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల తేదీని ఖరారు చేశారు. సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది తర్వాత జరిగే శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారని సీఎంవో తెలిపింది. సమావేశాల ప్రారంభం రోజున ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌కు ముందస్తుగా అనుమతి తెలిపేందుకు ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో క్యాబినెట్‌ సమావేశమవుతుంది. ఈ నెల 7 నుంచి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయంటూ శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.  


ప్రొరోగ్‌ కాకపోవడంతో స్పీకర్‌తో ప్రారంభం

గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్‌ కాకపోవడంతో గవర్నర్‌ ప్రమేయం లేకుండా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులుతో ఉత్తర్వులను జారీ చేయించింది. సాధారణంగా సమావేశాల ప్రారంభ ఉత్తర్వులను గవర్నర్‌ జారీ చేస్తుంటారు. ఈ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని శాసన సభా కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేస్తారు. కానీ.. గవర్నర్‌ ఉత్తర్వులు లేకుండానే కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడానికి కారణం.. సభ ప్రొరోగ్‌ కాకపోవడమేనని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్ర రెండో శాసన సభా ఎనిమిదవ సమావేశాలు గత సెప్టెంబరు 24న ప్రారంభమై అక్టోబరు 8న ముగిశాయి. అప్పుడు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారే తప్ప గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయలేదు. దీంతో ఆ ఎనిమిదవ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నట్లుగానే భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఉభయ సభలను సమావేశపర్చాల్సిన అవసరం ఉండదు. ఉభయ సభల సంయుక్త సమావేశం లేనందున.. గవర్నర్‌ ప్రసంగానికి ఆస్కారం ఉండదని, అందుకే స్పీకర్‌తో ప్రారంభించేలా సమావేశాలను ప్రభుత్వం నిర్ణయించిందని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. కాగా, గవర్నర్‌ లేకుండా సభలు ప్రారంభమైన దృష్టాంతాలు గతంలోనూ ఉన్నాయని, ఇది కొత్తదేమీ కాదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. 1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత 2014లో తెలంగాణలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు సాగాయి.  


కేసీఆర్‌ నిర్ణయం దారుణం: సంజయ్‌

గవర్నర్‌ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మహిళా గవర్నర్‌ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారా? రాష్ట్ర తొలి పౌ రురాలిని గౌరవించే తీరు ఇదేనా? అని నిలదీశారు. సీఎం నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలిపేలా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ మెదడు సరిగా పనిచేస్తలేదని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. మానసిక ఆస్పత్రిలో పరీక్షించుకోవాలని తాను సూచించినా కేసీఆర్‌ వినలేదన్నారు. 


ముదిరిన వివాదమే కారణమా ?

గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతోంది. గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకుంది. ప్రతిసారి గణతంత్ర వేడుకలను పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహిస్తారు. కానీ.. ఒమైక్రాన్‌ కేసుల కారణంగా ఈ ఏడాది జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలో రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలంటూ ప్రభుత్వం నుంచి షెడ్యూలు వెలువడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రులు ఎవరూ గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఎంఐఎం సభ్యుడు జాఫ్రీని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. దీని గురించి గవర్నర్‌ ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. ఇటీవల మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్‌కు ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించకపోవడమూ చర్చనీయాంశమైంది. ఇలా ఇరు వర్గాలు మధ్య రోజుకో వివాదం చోటు చేసుకుంటుండడంతో సీఎంవో, రాజ్‌భవన్‌ మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 

Updated Date - 2022-03-01T07:32:35+05:30 IST