ఆదాయం కోసమే కేసీఆర్ స‌ర్కార్ కరెంట్ ఛార్జీలను పెంచింది: విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-17T01:11:36+05:30 IST

ఆదాయం కోసమే కేసీఆర్ స‌ర్కార్ కరెంట్ ఛార్జీలను పెంచింది: విజయశాంతి

ఆదాయం కోసమే కేసీఆర్ స‌ర్కార్ కరెంట్ ఛార్జీలను పెంచింది: విజయశాంతి

హైదరాబాద్: కరెంట్ ఛార్జీల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ స‌ర్కార్ ఆదాయం పెంచుకునేందుకు డిస్కంల పేరుతో చార్జీలు పెంచేశారని ఆమె మండిపడ్డారు. ఒక్క‌సారిగా 10 రెట్లకు పైగానే కరెంట్ ఛార్జీలు పెంచి, సామాన్యుడి త‌ల మీద పెను భారాన్నిపడేశాడని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..


''కేసీఆర్ స‌ర్కార్ సామాన్యుడిపై మరో భారాన్ని మోపింది. ఇప్ప‌టికే పేద ప్ర‌జ‌లు నిత్యవసర సరుకుల ధరలు పెరిగి అల్లాడుతుంటే... తాజాగా క‌రెంటు బిల్లుల మోత వ‌చ్చి చేరింది. డెవలప్‌‌మెంట్ చార్జీల పేరుతో విద్యుత్ సంస్థలు వేసిన అదనపు బాదుడుతో కరెంటు బిల్లులు ఒక్క‌సారిగా పెరిగాయి. కేసీఆర్ స‌ర్కార్ ఆదాయం పెంచుకునేందుకు డిస్కంల పేరుతో చార్జీలు పెంచేశారు. పేద‌ల ప్ర‌భుత్వం అని చెప్పుకునే కేసీఆర్... ఒక్క‌సారిగా పది రెట్లకు పైగానే కరెంటు చార్జీలు పెంచి, సామాన్యుడి త‌ల మీద పెను భారాన్నిపడేశాడు. ముందుగా ఎలాంటి సూచ‌న‌లు ఇవ్వ‌కుండా కరెంటు కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ... మామూలు చార్జీలకు పది రెట్లకు పైగా చార్జీల‌ను విద్యుత్ సంస్థ పెంచేసింది. డెవలప్‌మెంట్‌ చార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అధిక విద్యుత్‌ బిల్లులు వేసి ప్రజలపై భారం మోపుతూ... కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్‌లకు మీటర్లు బిగిస్తుందని కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తుండు. డెవలప్‌మెంట్‌ చార్జీల పేరిట వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ... తాను మాత్రం డెవలప్ అవుతున్న కేసీఆర్.... తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తుండు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ... ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నడు. విద్యుత్‌ సంస్కరణల బిల్లులో రైతుల మోటార్‌లకు మీటర్లు బిగించాలని, సబ్సిడీలు ఇవ్వకూడదని ఎక్క‌డా లేదు. అయినా కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ... రాజ‌కీయ ప‌బ్భం గ‌డుపుకుంటుండు. రెండేండ్ల క్రితం SPDCL పరిధిలో ఒక కిలోవాట్‌‌‌‌కు రూ.1,200 చొప్పున డెవలప్‌‌‌‌మెంట్ చార్జీలు నిర్ణయించి, అందులో 50% రాయితీ కూడా ఇచ్చారు. రూ.600 చెల్లించిన వాళ్లను క్రమబద్ధీకరించారు. అయితే, ఇప్పుడు SPDCL పరిధిలో రాయితీ లేకుండా 100% ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.  రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న లోటును పూడ్చుకునేందుకే ఇలా భారీ చార్జీలు వేసి ప్రజల్ని వేధిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. సామాన్య ప్ర‌జ‌ల‌పై పెను భారం మోపుతున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజానీక‌ం సరైన సమయంలో షాక్ ఇవ్వడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-02-17T01:11:36+05:30 IST