కేంద్రంతో కేసీఆర్ ధాన్యం పేచీలు

Published: Fri, 25 Mar 2022 00:29:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేంద్రంతో కేసీఆర్ ధాన్యం పేచీలు

ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం విషయంలో గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తొలుత ‘వరి వేస్తే ఉరే గతి’ అన్నారు. ఇకపై యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని పేచీ పెడుతున్నారు. నిజాలను పక్కనపెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వాధినేతగా ఉంటూ కేంద్ర మంత్రులను నోటికొచ్చినవిధంగా దూషించడమేమిటి? మొన్నటి వరకు వానాకాలం పంట కొనే నాథుడులేక, పండించిన ధాన్యం వానకు తడిసి మొలకలెత్తుతుంటే ఏం చేయాలో పాలుపోక రైతులు గుండెలు బాదుకున్నారు. ఆరుగాలం చేసిన కష్టం కళ్లముందే ఆవిరై పోతుంటే, తెచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలో తెల్వక వరికుప్పలపై పడి ప్రాణాలు వదిలిన దృశ్యాలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి. యాసంగిలో ఇలాంటి ఘటనలకు చోటు లేకుండా రైతులకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, కేంద్రంపై అక్కసుతో అన్నదాతలను ఉరికొయ్యలకు ఎక్కించేలా చేస్తున్నారు. ఇప్పటికే ‘వరి వేస్తే ఉరి’ అని చేసిన వ్యాఖ్యలతో పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా కేసీఆర్ తన బాధ్యత నుంచి తప్పించుకునే ధోరణితో, కేంద్రమే ధాన్యం కొనాలంటూ వితండవాదం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో తెలియక పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం ఎట్లా అనే భావనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


కేసీఆర్‌ తన చేతగానితనాన్ని కేంద్రంపై మోపుతున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే, మర ఆడించి, బియ్యంగా మార్చి వాటిని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇదేమీ కొత్తకాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతోంది. ఇందుకయ్యే ఖర్చు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోంది. రవాణా ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు, గోదాముల్లో నిల్వ ఛార్జీలు సహా ఈ బాధ్యత నెరవేర్చినందుకు రాష్ట్రానికి కమీషన్ల రూపంలోనూ కేంద్రమే డబ్బులు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా లాభమే తప్ప భారం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో కనీస మద్దతు ధరను కేంద్రమే చెల్లిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమిటి? కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ కేసీఆర్‌ కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్నాళ్లూ రైతు పండించిన ప్రతి వడ్ల గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని, కేంద్రం పైసా ఇవ్వడం లేదని అబద్ధాలు వల్లించిన కేసీఆర్‌... వాస్తవాలు ప్రజలకు తెలిసే సరికి... తన బాధ్యత నుంచి తప్పించుకుని, వడ్లను కేంద్రమే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నారు. వాస్తవానికి వడ్లను కొనుగోలు చేయడంలో ఐకేపీ కేంద్రాలు కీలకం. మార్కెట్‌ యార్డులు అవసరం. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కావాలి. ఇవన్నీ రాష్ట్రం పరిధిలోనే ఉన్నాయి. కేంద్రం వద్ద వడ్లను కొనుగోలు చేసేంతటి అధికార యంత్రాంగం ఉండే అవకాశం లేదు. ఇది తెలిసి కూడా కేసీఆర్‌ వడ్లను కేంద్రమే కొనాలని మెలిక పెట్టడం ఎంత వరకు న్యాయమో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇదే విషయంపై టీఆర్‌ఎస్‌ను నిలదీస్తుంటే ఏ చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన కేసీఆర్‌, పంజాబ్‌లో కొంటున్నప్పుడు ఇక్కడెందుకు కొనడం లేదని ఎదురుదాడి చేస్తున్నారు. పంజాబ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ కమిటీలే స్వయంగా రైతుల నుండి వడ్లను కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసి వడ్లను కేంద్రానికి అప్పగిస్తాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ మార్కెట్‌ కమిటీలు తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయి. వాటికి ధాన్యం సేకరించే బాధ్యతను అప్పగిస్తే సేకరించే స్థాయి ఉందా? పంజాబ్‌ తరహాలో ఇక్కడా వడ్లు కొనాలని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. తన చేతగాని తనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సీఎం ఆడుతున్న డ్రామా తప్ప అది ఇంకోటి కాదు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. 2021–22 సంవత్సరానికి గాను ఖరీఫ్‌, రబీ పంటలకు సంబంధించి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత ఏడాది ఒప్పందం జరిగింది. ఈ రెండిటికి నడుమ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా పనిచేయాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. మరి ఒప్పందాన్ని తానే ఉల్లంఘించి ఆ ఒప్పందం నుంచి తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌? కొనుగోలు కేంద్రాల మూసివేత ఆలోచన ఇప్పటిది కానేకాదు. కేసీఆర్‌ మనసులో మొదటి నుండి ఉన్న ఆలోచనే ఇది అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే జరిగేదేమిటి? రైతులు అమాయకులు కదా మిల్లర్లు చెప్పిన రేటుకు ధాన్యం అమ్ముకుంటరు. అప్పుడు మిల్లర్లు వేల కోట్ల రూపాయలు దండుకుంటరు. అందులో నుంచి తాను వాటా దండుకోవచ్చనే దుర్బుద్ధితోనే కేసీఆర్ వారితో కుమ్మక్కయ్యారు. కాబట్టే కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.


వరి ధాన్యం పండించే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎలాంటి గొడవ లేదు. సాఫీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇక్కడే ఎందుకు గొడవ వస్తోంది? రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం 2019–20 సంవత్సరానికిగాను దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రాల్లో నెంబర్‌ వన్‌గా పశ్చిమ బెంగాల్‌ ఉంది. ఆ తరువాత యూపీ నెంబర్‌ 2, పంజాబ్‌ నెంబర్‌ 3, ఏపీ నెంబర్‌ 4, ఒడిశా నెంబర్‌ 5 స్థానాల్లో ఉన్నాయి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మరి మనకంటే ఎక్కువ పండిస్తున్న రాష్ట్రాల్లో వరి కొనుగోళ్లు సాఫీగా సాగిపోతున్నాయి. ఏ గొడవా లేదు. గొడవ ఇక్కడే ఎందుకు వస్తోంది? మన పొరుగు రాష్ట్రం ఏపీ మనకంటే అధికంగా వరి పండిస్తోంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2019–20లో 76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, అదే ఏడాది ఏపీ 86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండించింది. అక్కడ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుంచి నేరుగా కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటోంది. కొన్న ధాన్యంలో, రేషన్‌ సరఫరాకు అవసరమైన ధాన్యాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని కేంద్రానికి అమ్ముతోంది. మరి మన ముఖ్యమంత్రి చేస్తోందేమిటి? అసలు తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం ఎంత? కేసీఆర్ చూపుతోంది ఎంత? కేంద్రంతో రాష్ట్రం జరిపిన గత 3 సమావేశాల మినిట్స్‌ చూస్తే జనానికిట్టే అర్ధమైతది. మూడు సమావేశాల్లో మూడు రకాల లెక్కలు చూపిండ్రు. పంట విస్తీర్ణం, దిగుబడి లెక్కల్లో చాలా తేడా ఉంది. సడన్‌గా సాగు విస్తీర్ణాన్ని డబుల్‌, త్రిబుల్‌ చేసి చూపిండ్రు. అధికారులు కూడా సోయి తప్పి ఉన్నరా? లేక పాలనను పూర్తిగా గాలికొదిలేసి గాలి మాటలు చెబుతున్నరా? ఏది కరెక్టు? అందుకే సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి లెక్కల వాస్తవాలు తేల్చాల్సిందే. ఇది తేలాలంటే తక్షణమే కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించాలి. తెలంగాణ అధికారులతో కలిసి వాస్తవ సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి లెక్కలను ప్రజల ముందుంచాలి. అందుకోసం మేం కేంద్రానికి విజ్ఞప్తి చేసి అధికారుల బృందాన్ని పంపేలా కోరబోతున్నాం.


యాసంగిలో పండించే ఏ వెరైటీ ధాన్యమైనా మిల్లింగ్‌ చేస్తే సగానికిపైగా నూక వస్తుందనే సీఎం మాటలు పచ్చి అబద్ధం. యాసంగిలో సన్న వడ్లు మిల్లింగ్‌ చేస్తేనే నూక ఎక్కువొస్తది. ఇది నామాటే కాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, తెలంగాణ రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు తూడి దేవేందర్‌ రెడ్డి వంటి వారు సైతం చెబుతున్న మాట. పోనీ సన్నవడ్లు పట్టిస్తే క్వింటాల్‌కు అదనంగా 10 కిలోల నూక వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. అయినా నష్టమేముంది? ఈరోజు నూకకు సైతం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. మార్కెట్‌లో గతంతో పోలిస్తే ఇప్పుడు ధర 50 శాతం పెరిగింది. నూకతో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రంతో చేసుకున్న ఒప్పందంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ సంస్థలను నెలకొల్పిన దాఖలాల్లేవు. నూకవల్ల యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలకు మించి భారం పడే అవకాశమే లేదు. రైతు బంధు ద్వారా 13 వేల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం రూ. వెయ్యి కోట్లు భరించలేరా?

కేంద్రంతో కేసీఆర్ ధాన్యం పేచీలు

బండి సంజయ్‌ కుమార్‌

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.