కేసీఆర్‌పై జనాలకు బోర్‌ కొట్టేసిందా?

Published: Sun, 05 Jun 2022 00:26:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేసీఆర్‌పై జనాలకు బోర్‌ కొట్టేసిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణపై బోరు కొట్టినట్లుంది. ముఖ్యమంత్రి పదవి తన కాలి గోటికి సమానమని అప్పుడప్పుడూ వ్యాఖ్యానించే ఆయన, తన స్థాయికి ఆ పదవి సరిపోదని, జాతీయస్థాయి నాయకుడిగా అవతరించాలని కలలు కనడం మొదలుపెట్టారు. తెలంగాణలో ఇకపై తాను చేయడానికి ఏమీ లేదని, అందుచేత తెలంగాణ ఆదర్శంగా దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పుకొంటున్నారు. తనను తాను జాతీయ నాయకుడిగా ప్రకటించుకోవడం కోసం రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని భాషల పత్రికలలో, జాతీయ న్యూస్‌ఛానెళ్లలో ప్రకటనలు గుప్పించారు. మున్ముందు అంతర్జాతీయ నాయకుడిగా ఎదగాలనిపిస్తే వివిధ దేశాల పత్రికలు, ఛానెళ్లలో కూడా వేల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తారేమో తెలియదు. ‘మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్టుగా రాష్ట్రంలో వివిధ శాఖలలో పెండింగ్‌ బిల్లులు పెరిగిపోతున్నప్పటికీ వ్యక్తిగత ప్రచారం కోసం తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఇలా ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది. సొంత డబ్బుతో ప్రచారం చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు గానీ ప్రజల సొమ్ముతో సొంత ప్రచారం చేసుకోవడం సమర్థనీయం కాదు.


సాధారణ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల వ్యవధి ఉన్నందున అప్పటిలోగా జాతీయస్థాయి నాయకుడిగా ఎదగడం కోసం దాదాపు రెండు వేల  కోట్ల రూపాయలను ప్రకటనల కోసం ఖర్చు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారట. ప్రజల సొమ్ముతో ప్రకటనలు జారీ చేసినంత మాత్రాన ఎవరైనా జాతీయ నాయకుడైపోతారా? అంటే ఆయనకే తెలియాలి. రాజకీయాల్లోనైనా, మరే విషయంలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. స్వరాష్ట్రం తెలంగాణలో కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై బోర్‌ కొడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒంటెత్తు పోకడలకు మారుపేరైన కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో అన్యులకు భాగస్వామ్యం ఉండదు. ఫాంహౌస్‌లో సేదతీరుతూ ఏమి ఆలోచిస్తారో అవే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలవుతుంటాయి. మంత్రులు, శాసనసభ్యులు, ఇతరులు చప్పట్లు కొట్టడానికే పరిమితం. రాచరిక వ్యవస్థను తలపిస్తున్న కేసీఆర్‌ పాలనను తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. గత ఎన్నికల్లోనూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడ్డారు. అయితే చంద్రబాబునాయుడు పుణ్యమా అని ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడంతో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడం ద్వారా కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రాగలిగారు. అయితే ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌–బీజేపీ అనూహ్యంగా కొన్ని సీట్లు సంపాదించాయి. ఆ పార్టీలు ప్రణాళికాబద్ధంగా పోటీ చేసి ఉంటే టీఆర్‌ఎస్‌కు నాలుగైదు సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి. తదుపరి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకు ఏకపక్షంగా ఉండటంతో కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. స్థానిక ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయని గుర్తించకుండా అదంతా తమ బలమేనని భావించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 60 వేలకుపైగా మెజారిటీ లభించింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఈ మెజారిటీ పది వేలకు పడిపోయింది. శాసనసభకు మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. క్షేత్రస్థాయిలో ఏదో గడబిడ ఉందని గుర్తించిన టీఆర్‌ఎస్‌ నాయకులు సొంతంగా సర్వేలు చేయించుకోగా ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. కేసీఆర్‌కు ఎన్నికల వ్యూహకర్తగా నియమితుడైన ప్రశాంత్‌ కిశోర్‌ టీం నిర్వహించిన సర్వేలో కూడా ఫలితాలు ఆశాజనకంగా లేవని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వరంగల్‌ జిల్లాలో అత్యధిక మెజారిటీ లభించిన ఒక నియోజకవర్గంలో సర్వే చేయగా టీఆర్‌ఎస్‌కు 30 వేల మైనస్‌ వచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకుల్లో గుబులు మొదలైంది. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఏర్పడటానికి కారణం ఏమిటనే విషయంపై టీఆర్‌ఎస్‌ ప్రముఖులు కొందరు ఆరా తీయడం మొదలెట్టారు.


తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ముఖ్యం. అందుకే తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేపట్టిన ఆత్మగౌరవం అనే నినాదంతో అంతలా కనెక్టయ్యారు. స్వరాష్ట్రంలో కూడా ప్రజలు ఆత్మగౌరవం కోసం మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది నిజం. కేసీఆర్‌ ప్రభుత్వంలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పోయింది. ఆయన ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో, ఎప్పుడు ప్రగతిభవన్‌లో ఉంటారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రిని కలుసుకొని సమస్యలు చెప్పుకొనే అవకాశం ప్రజలకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ ఉండదు. ముఖ్యమంత్రి ఇచ్చేవాడు, ప్రజలు పుచ్చుకొనేవారుగా మారిపోయారు. దీనికితోడు కేసీఆర్‌పై ఇటీవలి కాలంలో అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ తెచ్చుకున్నది ఒక కుటుంబం కోసమేననీ, తెలంగాణ రావడం వల్ల లాభపడింది ఆయన కుటుంబం మాత్రమేననీ ప్రజా బాహుళ్యం అభిప్రాయపడుతున్నది. ఫలితంగా వివిధ వర్గాల ప్రజలు కేసీఆర్‌పై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నందున రైతాంగం మద్దతు తనకేనని కేసీఆర్‌ అండ్‌ కో నమ్ముతున్నప్పటికీ, రైతులు మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఏవైనా ఒకసారే ఉపయోగపడతాయి. రైతుబంధు పథకం గత ఎన్నికల్లో కేసీఆర్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు రైతుబంధు సహాయం పొందడం తమ హక్కుగా రైతులు భావిస్తున్నారు. ఇతర పథకాల విషయంలో కూడా ప్రజల ఆలోచన ఇలాగే ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏ ఆటోవాలాను కదిలించినా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. వారంతా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారు. అంతేకాదు, రాష్ట్రం వచ్చిన కొత్తలో తమ ఆటోలపై టీఆర్‌ఎస్‌ జెండాలు కట్టుకొని తిరిగారు. ఇతర వర్గాలు, ముఖ్యంగా యువతలో కేసీఆర్‌పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి వరకు ప్రతి ఒక్కరూ నాకేమిటి అని మాత్రమే ఆలోచిస్తున్నారు. పాలనలో జవాబుదారీతనం లేకుండా పోయింది. కేసీఆర్‌ నోటివెంట వెలువడిన ఆదేశాలను అమలుచేయడమే పాలన అన్నట్టుగా అధికార యంత్రాంగం మారిపోయింది. 


ప్రకటనలతో నగుబాటు!

మీడియాను అదుపు చేయడం ద్వారా అంతా బాగుందని భ్రమింపజేయవచ్చు అని కేసీఆర్‌ అండ్‌ కో అనుకుంటున్నారు కానీ సోషల్‌ మీడియాను అదుపు చేయలేరు కదా! కేసీఆర్‌ పాలనపై ప్రజాభిప్రాయానికి సోషల్‌ మీడియా అద్దంపడుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్‌ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తనకు హిందీ, ఇంగ్లిషు భాషలపై పట్టు ఉన్నందున జాతీయస్థాయి నాయకుడిగా ఉత్తరాది వారు కూడా తనను గుర్తిస్తారని కేసీఆర్‌ కలలు కంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో డబ్బులిచ్చి ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన జాతీయ నాయకుడు అయిపోరు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం చేయకుండా వందలు, వేల కోట్లు ఖర్చు చేసి జాతీయస్థాయిలో ప్రకటనలు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదు. కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదు. పంచాయతీలలో చేపట్టిన పనులకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో సర్పంచ్‌లు అక్కడక్కడా భిక్షాటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని తన కోసం కేసీఆర్‌ దుబారా చేయడాన్ని ప్రజలు సహజంగానే వ్యతిరేకిస్తారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పత్రికలలో కేసీఆర్‌ ప్రకటనలు ఇవ్వడం జాతీయస్థాయిలో అపహాస్యం అయింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా ప్రజల సొమ్మును ఈ స్థాయిలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. పత్రికలలో కేసీఆర్‌ బొమ్మలు చూసి కేరళవాళ్లు, ఉత్తరాఖండ్‌వాళ్లు ఆయనను నాయకుడిగా అంగీకరిస్తారా? కేసీఆర్‌ చర్యలను భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. ఎడాపెడా అప్పులు చేసి కమీషన్ల రూపంలో దండుకుంటూ తమపైనే యుద్ధం ప్రకటించడం ఏమిటని బీజేపీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. కేసీఆర్‌ను తమ శత్రువుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అంతర్గత సమావేశాల్లో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు కూడా కేసీఆర్‌పై నిఘా పెట్టాయి. జాతీయ రాజకీయాలలో త్వరలో సంచలనం చోటుచేసుకుంటుందని కేసీఆర్‌ ఈ మధ్య ప్రకటించారు. ఆయన చెబుతున్న సంచలనం ఎలా ఉండబోతున్నదో తెలియదు గానీ కేసీఆర్‌ చుట్టూ కేంద్ర పెద్దలు ఉచ్చు బిగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటి సంస్థలు ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగవచ్చునని చెబుతున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన అనుచిత చెల్లింపులకు సంబంధించి నిర్దుష్టమైన ఆధారాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరాయని తెలిసింది. జగన్‌ అక్రమాస్తుల బండారాన్ని బయటపెట్టినట్టే కేసీఆర్‌ కుంభకోణాన్ని బద్దలుకొట్టే అవకాశం కూడా ‘ఆంధ్రజ్యోతి’కే వస్తుందేమో? వేచి చూద్దాం. అయితే రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్‌ రెండు ఆకులు ఎక్కువే చదివారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ తన ప్రత్యర్థులుగా తలపడుతున్నంత కాలం తన అధికారానికి ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారు.


ఆనాటి ఆ పగ..!

మరోవైపు తెలంగాణలోని ఆంధ్రా మూలాలు ఉన్నవారిని తనవైపు తిప్పుకోవడానికి కేసీఆర్‌ ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ ముఖ్యులను ఎన్టీఆర్‌ ఘాట్‌కు పంపి హడావుడి చేయించారు. ఎన్టీఆర్‌ను సొంతం చేసుకోవడం ద్వారా సెటిలర్ల మనసు గెలుచుకోవాలన్నది ఆయన ఆలోచన కావొచ్చు. అయితే జగన్మోహన్‌ రెడ్డి పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ నాశనం కావడాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ కూడా కారణమని వారు బలంగా నమ్ముతున్నారు. జగన్‌ తనకు పెద్దన్న వంటివాడని కేటీఆర్‌ ఇటీవల ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. రాజకీయ కుయుక్తులు పన్నడంలో కేసీఆర్‌ ఎవరికీ తీసిపోరు. 2001లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్‌ కుట్ర పన్నారని మాజీ మంత్రి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఏ.చంద్రశేఖర్‌ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో వాస్తవం ఉంది. కేసీఆర్‌ గురించి ముందుగానే గ్రహించిన ఎన్టీఆర్‌ అతడిని ఎప్పుడూ దరిచేరనీయలేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి కరణం రామచంద్రరావును మంత్రివర్గంలోకి తీసుకుని కేసీఆర్‌ను దూరం పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే కేసీఆర్‌కు మంత్రి పదవి లభించింది. అయితే ఆయన ధోరణిని పసిగట్టిన చంద్రబాబు, 1999లో గెలిచాక మళ్లీ మంత్రిగా తీసుకోలేదు. అప్పుడే చంద్రబాబుపై తిరుగుబాటుకు కేసీఆర్‌ ప్రయత్నించి విఫలమయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని మనసులో పెట్టుకున్న కేసీఆర్‌, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబును టార్గెట్‌గా పెట్టుకున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే తెలంగాణకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరిని కోవర్టుగా మార్చుకొని ఓటుకు నోటు కేసుకు స్కెచ్‌ వేశారు. సదరు ఎమ్మెల్యే ద్వారా రేవంత్‌ రెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవినీతి నిరోధక శాఖను రంగంలోకి దించారు. ఇవేమీ తెలియని రేవంత్‌ రెడ్డి ఇరుక్కుపోయారు. చంద్రబాబు కూడా కేసీఆర్‌ చేతికి చిక్కారు. కోవర్టుగా మారిన ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో కీలక పదవి అనుభవిస్తున్నారు. మొత్తమ్మీద చంద్రబాబుపై కేసీఆర్‌ ప్రతీకారం తీర్చుకోగలిగారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ సెంటిమెంట్‌ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించడమే కాకుండా హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా పాల్గొన్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌కు ఎదురుదెబ్బలు తగలకపోవచ్చును గానీ ఇకపై కాంగ్రెస్‌–బీజేపీ నుంచి ఆయనకు పెనుసవాళ్లు ఎదురుకానున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఈ రెండు పార్టీలలో చేరకుండా దూరంగా ఉంటున్న కొంతమంది బలమైన నాయకులు అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఈ నాయకులు అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్‌–బీజేపీలలో ఏదో ఒకదానిలో త్వరలో చేరబోతున్నారు. అప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడండి.


జగన్‌ను దత్తపుత్రుడిగా స్వీకరించినట్టేనా?

ఈ విషయం అలా ఉంచితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాన్ని చూడ్డానికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడని విషయం విదితమే. ప్రధాని తెలంగాణకు వస్తే కేసీఆర్‌ ఏదో ఒక వంకతో రాష్ట్రం విడిచి వెళుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు ప్రధాని అపాయింట్‌మెంట్‌ పొందుతూ ‘‘మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటాను–నన్ను మాత్రం కేసుల నుంచి కాపాడండి’’ అని వేడుకుంటూనే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకత్వానికి జగన్‌ సహకారం కావాలి. ఈ పరిస్థితిలో జగన్‌ స్థానంలో ఇతరులు ఉంటే రాష్ర్టానికి కావాల్సినవి సాధించుకుంటారు. జగన్‌కు మాత్రం కేసుల నుంచి రక్షణ కావాలి. అందుకే ప్రధానిని, హోం మంత్రిని కలిసినప్పుడు ‘‘అది కావాలి, ఇది కావాలి’’ అని అడిగినట్టుగా ప్రకటనలు ఇస్తూ లోపల మాత్రం ‘‘నన్ను కొంచెం చూసుకోండి’’ అని కోరుతున్నారట. సీబీఐ, ఈడీ కేసులలో కేంద్ర పెద్దలు ఏ వైఖరి తీసుకుంటారు? జగన్‌కు అండగా ఉంటారా లేదా? అన్నది త్వరలోనే  తేలుతుంది. ఈడీ కేసులలో విచారణకు కోర్టుకు స్వయంగా హాజరయ్యే విషయమై జగన్‌ దాఖలు చేసుకున్న మినహాయింపు పిటిషన్లపై హైకోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు తర్వాత ఈడీ కేసులలో విచారణ ప్రారంభం కావాలి. అయితే విచారణ మొదలుపెట్టడానికి తమకు సమయం కావాలని ఈడీ అధికారులు అప్పుడు ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరే పక్షంలో కేంద్ర పెద్దల అండ జగన్‌కు లభించినట్టే. జాప్యం జరగకుండా విచారణ ప్రారంభమైతే జగన్‌ భవితవ్యం నాలుగైదు నెలల్లో తేలిపోతుంది. కాగా, జగన్‌రెడ్డి మూడేళ్ల పాలన పూర్తిచేసుకుని నాల్గవ ఏట అడుగుపెట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకూ, మంత్రుల బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలను చూస్తున్నాం. పరిస్థితి గ్రహించిన వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పక్కచూపులు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఏ వైఖరి తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌ విషయం ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా ఈ కారణంగానే హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. అయితే కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్‌కు లభిస్తే మాత్రం తెలంగాణలో దాని ప్రభావం బీజేపీ విజయావకాశాలపై ఉంటుంది. తెలంగాణలో దాదాపు 25 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అడుగంటడానికి కారణమైన జగన్‌కు కేంద్ర పెద్దలు చేయూత ఇవ్వడాన్ని తెలంగాణలోని సీమాంధ్రులు జీర్ణించుకోలేరు. ఈ విషయమై తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కూడా సీమాంధ్రులు బీజేపీని ఆదరించలేదు. ఈ కారణంగానే మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ దక్కించుకోగలిగింది. సెటిలర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల కూడా అంత సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు తీసుకునే నిర్ణయాలను బట్టి సెటిలర్ల నిర్ణయం ఉంటుంది.


జగన్‌ ప్రభుత్వం ఇంటికి పోవాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా పట్టుదలగా ఉన్నందున ఆయనతో పొత్తుపెట్టుకున్న బీజేపీ నాయకత్వానికి ప్రస్తుత పరిస్థితి విషమ పరీక్షే. అవినీతి కేసులను ఎదుర్కొంటున్న జగన్‌ మాత్రమే తమకు ముద్దు అని కేంద్ర పెద్దలు నిర్ణయించుకొనే పక్షంలో తెలంగాణలో కూడా బీజేపీ ఆశలపై నీళ్లు పోసినట్టే. రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్న జగన్‌ను అదుపు చేయవలసింది పోయి అడిగిందే తడవుగా అప్పులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పటికే బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఇదిలావుంటే, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చేయడానికి ఏదో యాప్‌ తెచ్చినట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా ప్రచారం చేసుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులు చెల్లించాలంటే పది నుంచి పదిహేను శాతం కమీషన్లు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలే డిమాండ్‌ చేస్తూ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం రోతగా ఉంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి గురించి మాట్లాడే ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉండటం ఎబ్బెట్టుగా ఉండదా? రాజకీయ అవసరాల కోసం మోదీ కూడా ఎంతకైనా దిగజారుతారని ప్రజలు భావించరా? అయినా అవినీతి కేసులలో ఇరుక్కున్న వారిపై విచారణ త్వరితగతిన పూర్తికాకుండా ఏళ్ల తరబడి సాగుతుండటం ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే అవుతుంది. జగన్‌ విషయమే తీసుకుందాం, అవినీతి కేసులలో రేపు ఆయనకు శిక్ష పడితే పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఒక అవినీతిపరుడు, ఆర్థిక నేరస్తుడు అధికారం చలాయించినట్టే కదా? అటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభావితం అయిన వారి గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ పరిస్థితి పోవాలంటే న్యాయ వ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉండకపోతే అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్‌, భారత ప్రధాన న్యాయమూర్తిని కుటుంబసమేతంగా కలవగలిగేవారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో? పెట్టుబడుల పేరిట జగన్‌ కుటుంబసమేతంగా దావోస్‌ వెళ్లి రావడం కూడా ప్రహసనంగా మారింది. ‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు రానూ వచ్చాడు’ అన్నట్టుగా ఆయన పర్యటన సాగింది.


జగన్‌కు ఉన్న నేపథ్యం కారణంగా బహుళజాతి కంపెనీలు ఆయనతో ఒప్పందాలు కుదుర్చుకోవు అని ఎప్పుడో చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతానికి గౌతం అదానీ ఒక్కరే జగన్‌కు ఆప్తుడిగా ఉన్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ అయితే గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టును కూడా ఉపసంహరించుకున్నారు. అయినా విజయ సాయిరెడ్డి వంటి వారు రెచ్చిపోతున్నారు. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే ఆయన విలవిల్లాడిపోతుంటారు. స్వామి భక్తిని చాటుకుంటుంటారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బెంగళూరుకు పోగా, జగన్‌ మాత్రం వచ్చే నెలలో భీమవరం రానున్న ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం ఇప్పటినుంచే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింపజేస్తున్నారు. సొంత పార్టీ ప్రధాని వచ్చినట్టుగా జగన్‌ ప్రభుత్వం హడావుడి పడుతోంది. దీన్నిబట్టి జగన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ దత్తపుత్రుడిగా స్వీకరించారేమో అన్న అనుమానం కలగకుండా ఉంటుందా?

కేసీఆర్‌పై జనాలకు బోర్‌ కొట్టేసిందా?

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.