కేసీఆర్‌, జగన్‌.. ఏకాంత భేటీ

ABN , First Publish Date - 2021-11-22T08:06:15+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా రోజుల తర్వాత కలిశారు. పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకొన్నారు.

కేసీఆర్‌, జగన్‌.. ఏకాంత భేటీ

  • ఐదు నిమిషాల పాటు రహస్య చర్చలు
  • టీ తాగేందుకు వెళ్లి తెలుగు రాష్ట్రాల సీఎంల ముచ్చట్లు
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుకకు హాజరు
  • కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న ముఖ్యమంత్రులు


శంషాబాద్‌, నవంబరు 21: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా రోజుల తర్వాత కలిశారు. పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకొన్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి టీ తాగేందుకు వెళ్లి ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలు వివాహ వేడుక ఇందుకు వేదికైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ కొత్తగూడలోని వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం పోచారం మనవరాలు స్నిగ్ధారెడ్డి, ఏపీ సీఎం ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. కేసీఆర్‌ వచ్చిన పది నిమిషాలకు జగన్‌ వచ్చారు. దాదాపు అరగంట పాటు పెళ్లి వేడుకలో ఉన్నారు. ఒకరి పక్కన ఒకరు కూర్చుని ముచ్చటించుకున్నారు. వివాహాన్ని తిలకించిన అనంతరం ఇద్దరూ వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం టీ తాగేందుకు ఓ గదిలోకి వెళ్లారు.


జల వివాదం తర్వాత తొలిసారి

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తిన తర్వాత ఇద్దరు సీఎంలు కలవడం ఇదే మొదటిసారి. 4 నెలల క్రితం కృష్ణా జలాల వివాదం తీవ్ర స్థాయిలో సాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఏపీ నీటి దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ మంత్రులు ధ్వజమెత్తారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ ఏపీ మంత్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు పొరుగు రాష్ట్రం పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. తెలంగాణ సర్కారు జల విద్యుదుత్పత్తిని నిరాటంకంగా కొనసాగించడం, ప్రాజెక్టుల వద్ద ఏకంగా పోలీసు పహారా పెట్టడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనిపై ఏపీ సీఎం జగన్‌.. జూలై మొదట్లో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం తీవ్రంగానే స్పందించారు. ప్రఽధాని మోదీతో పాటు జలశక్తి మంత్రిని కలిసి.. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలతో పాటు కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాల వాటాపై చర్చించాలని నిర్ణయించారు. ఓ దశలో తాము ఏపీకి స్నేహ హస్తం చాచినా అటు నుంచి స్పందన లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. నాటి పరిస్థితులు చూస్తే.. రెండు రాష్ట్రాల సీఎంలు మళ్లీ మాట్లాడుకోగలరా? అన్నట్లుగా కనిపించాయి.


సీఎంల వెంట ఆ ఇద్దరు మంత్రులు

జల వివాదం సద్దుమణిగిందనుకుంటున్న దశలో.. ఇటీవలి రాజకీయ పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేడెక్కాయి. తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అటునుంచి గట్టి స్పందన వచ్చింది. నిధుల్లేక జగన్‌ కేంద్రం వద్ద భిక్షమెత్తుకుంటున్నారని ప్రశాంత్‌రెడ్డి అనగా.. ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ‘‘కేసీఆర్‌లా మేం లోపల కాళ్లు పట్టుకోం. ఆయన పదేపదే ఢిల్లీకి ఎందుకెళ్తున్నారు. హైదరాబాద్‌ ఉండి కూడా తెలంగాణ ఎందుకు అప్పులపాలైంది’’ అని ప్రశ్నించారు. అయితే, ఆదివారం పోచారం మనవరాలి వివాహంలో ప్రశాంత్‌రెడ్డి.. సీఎంలు కేసీఆర్‌, జగన్‌ వెంటే ఉండడం గమనార్హం. ఇదే వివాహానికి పేర్ని నాని కూడా రావడం విశేషం. మరోవైపు ఈ పెళ్లికి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్‌ తమిళి సైతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఏపీ మంత్రి కొడాలి నాని, తెలంగాణ మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2021-11-22T08:06:15+05:30 IST