కేసీఆర్‌, కేటీఆర్‌ స్మగ్లర్లు

ABN , First Publish Date - 2021-12-01T08:24:54+05:30 IST

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులిద్దరూ స్మగ్లర్లని......

కేసీఆర్‌, కేటీఆర్‌ స్మగ్లర్లు

 కర్ణాటక నుంచి నాణ్యతలేని బియ్యం తెచ్చి.. రీసైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారు

 కేసీఆర్‌ ప్రెస్‌మీట్లకు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వాలి

 బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపాటు


న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులిద్దరూ స్మగ్లర్లని, రైస్‌ మిల్లర్లతో కలిసి రైతుల పంటను స్మగ్లింగ్‌ చేస్తూ రూ.వేల కోట్లు సంపాదించుకుంటున్నారన్నారు. కర్ణాటక నుంచి నాణ్యతలేని బియ్యాన్ని తీసుకొచ్చి, రీసైకిల్‌ చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తున్నారని, తెలంగాణలో పండే సన్నబియ్యాన్ని రూ.40కి కిలో చొప్పున ప్రైవేటులో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల రైతులు బలవుతున్నారన్నారు. ప్రభుత్వమే స్మగ్లింగ్‌ చేస్తే రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో అర్వింద్‌ విలేకరులతో మాట్లాడారు. రైస్‌ మిల్లర్లు తరుగు తీస్తుంటే సీఎం మాట్లాడటంలేదని, ఈ అంశంపై ఎవరికి లేఖ రాయాలో వారికి రాస్తానని, మొత్తం దర్యాప్తు జరగాలన్నారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐతో జరిగిన ఒప్పందంపై సంతకం పెట్టి.. ఇప్పు డు ఎంత కొంటారో చెప్పాలని ముఖ్యమంత్రి అడగడం లో పసలేదని విమర్శించారు. ‘‘కేసీఆర్‌ ముఖ్యమంత్రా? లేక ఇంకా సిద్దిపేటలో లారీలు ఆపి పైసలు వసూలు చేసే దుబాయ్‌ శేఖరా? కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌పై సీఎం కేసీఆర్‌ ఉపయోగించిన భాష ముఖ్యమంత్రి భాష కాదు. దుబాయ్‌ శేఖర్‌ భాష.


రోడ్డు పక్కన చిల్లరగాళ్లు కూడా ఇటువంటి భాష మాట్లాడరు’’ అని అర్వింద్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ విలేకరుల సమావేశాలకు సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. భూముల ధరలు వాటంతటవే ఎప్పుడూ పెరుగుతాయని, కేసీఆర్‌ చనిపోయిన తర్వా త కూడా పెరుగుతాయని వ్యాఖ్యానించారు. విద్యుత్తు బిల్లులో మీటర్‌ అనే పదమే లేదని, కానీ.. కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, గిరిజన  వర్సిటీ ఏర్పాటుకు భూమి చూపించడానికే కేసీఆర్‌కు ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని, బీజేపీ కార్యకర్తలు పాఠశాలలను సందర్శించి సెల్ఫీలు దిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-12-01T08:24:54+05:30 IST