దమ్ముంటే.. కేసీఆర్‌, కేటీఆర్‌ పాదయాత్ర చేయాలి

ABN , First Publish Date - 2022-05-03T07:32:04+05:30 IST

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దమ్ముంటే పాదయాత్ర చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ విసిరారు. రోజూ కమీషన్ల కోసం ఆలోచించేవారు ప్రజా సమస్యల గురించి ఏం ఆలోచిస్తారని....

దమ్ముంటే.. కేసీఆర్‌, కేటీఆర్‌ పాదయాత్ర చేయాలి

టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయ్‌

పోలీసోళ్లను కేసీఆర్‌ కుక్కల్లా వాడుకుంటున్నారు : షర్మిల

దమ్మపేట, మే 2: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దమ్ముంటే పాదయాత్ర చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ విసిరారు. రోజూ కమీషన్ల కోసం ఆలోచించేవారు ప్రజా సమస్యల గురించి ఏం ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారం 73వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో సాగింది. ఈ సందర్భంగా దమ్మపేటలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్‌.. రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. ధరణితో రైతుల భూములు లాక్కుని వారిని బిచ్చగాళ్లను చేశారని మండిపడ్డారు. పాలనలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. క్యాబినెట్‌లో 16 మంది మంత్రులుంటే వారిలో పది మంది అవినీతిపరులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి రక్షణ కల్పించుకునేందుకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తారని విమర్శించారు. పోలీసోళ్లను కేసీఆర్‌ కుక్కల్లా వాడుకుంటున్నారని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయాడని, ఆ పార్టీలో చేరి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటానని  భరోసా ఇచ్చారు.

Read more