KCR-Kumaraswamy Meet: కేసీఆర్‌తో కలిసిపనిచేసేందుకు కుమారస్వామి సుముఖత

ABN , First Publish Date - 2022-09-11T21:33:19+05:30 IST

సీఎం కేసీఆర్‌ (KCR)తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) భేటీ ముగిసింది.

KCR-Kumaraswamy Meet: కేసీఆర్‌తో కలిసిపనిచేసేందుకు కుమారస్వామి సుముఖత

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (KCR)తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) భేటీ ముగిసింది. ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఎన్డీఏ, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై.. కేసీఆర్ అభిప్రాయం వెల్లడించారు. తమతో కలిసి రావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు.. కుమారస్వామి సుముఖత వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 10 గంటలకు కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి ఐటీసీ గ్రాండ్‌ కాకతీయలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌ (Pragati Bhavan)కు వచ్చిన కుమారస్వామి.. రెండు గంటల పాటు కేసీఆర్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలపోస్తున్న కేసీఆర్‌తో కర్ణాటక అగ్రనేత భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈరోజు రాత్రి కుమారస్వామి బెంగళూరు వెళ్లనున్నారు.


‘‘జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా. నిజామాబాద్‌ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం’’ అని ప్రకటించిన కేసీఆర్‌ ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త జాతీయ పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార పార్టీ పత్రిక, చానల్‌ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కేసీఆర్‌.. పార్టీ జిల్లా అధ్యక్షులందరితో తెలంగాణ భవన్లో ఇటీవల మీడియా సమావేశం పెట్టించి మరీ చెప్పించారు. నిజానికి, జాతీయ పార్టీ పెడతానని కొంతకాలంగా కేసీఆర్‌ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొంత కాలంగా భారీ కసరత్తు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జాతీయ స్థాయిలో రైతు సంఘాల నాయకులతో ప్రగతి భవన్లో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించారు.

Updated Date - 2022-09-11T21:33:19+05:30 IST