భవ్య భారతమే కేసీఆర్ మనోరథం

Published: Tue, 21 Jun 2022 00:59:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భవ్య భారతమే కేసీఆర్ మనోరథం

ఉజ్వల భారత నిర్మాణం ధ్యేయంగా ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రసంగిస్తూ ఆయన ఆ విషయమై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరించి తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికే రోల్ మోడల్ అని, దాని ఆధారంగా ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన జరగాలని కేసీఆర్ సూచించారు. ప్రసంగంలో చివరగా అయినప్పటికీ, ప్రధానాంశంగా, తెలంగాణ పట్ల, ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను విశదీకరిస్తూ, ఆద్యతన భవిష్యత్తులో జాతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా ద్వారానే ఉజ్వల భారత దేశ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే భారత రాష్ట్ర సమితి స్థాపన గురించిన వార్తలు వచ్చాయి. 


తన ప్రసంగంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధిని ప్రస్తావించిన కేసీఆర్, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను తెలంగాణ రాష్ట్రం సమకూర్చుకున్నదని కేసీఆర్ అన్నారు. 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు తలెత్తుతున్నా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టడం వల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయిందని, అలాగే ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని తన విమర్శకు మద్దతుగా ఆయన ప్రస్తావించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని మరో ఉదాహరణ ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన వాటికి నిధులు ఇవ్వడంలో చేస్తున్న జాప్యాన్ని, విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేయడాన్ని, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేని విషయాన్ని, ఐటిఐఆర్ ఏర్పాటు చేయకుండా అన్యాయం చేయడాన్ని, కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపిస్తూ, కేంద్రం చూపుతున్న వివక్షకు ఇవి కొన్ని తార్కాణాలు మాత్రమే అన్నారు. 


ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఫల్యం గురించిన ప్రస్తావన తెస్తూ, తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరశన దీక్షలో తాను స్వయంగా పాల్గొన్నానని, అయినా కేంద్రం నుంచి స్పందన లేదని, పైపెచ్చు తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని కేసీఆర్ అన్నారు. ఏదేమైనా రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విధ్యుక్తధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. 


75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయని, సమాఖ్య స్ఫూర్తి కుంచించుకుపోతున్నదని, భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాసి, అధికారాలను నిస్సిగ్గుగా హరించాయని ఆయన అన్నారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి పేరుకే మిగిలిందని అంటూ, గతంలో కేంద్రప్రభు త్వాలు ఏర్పాటుచేసిన పలు కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు చేసిన సూచనలు బుట్ట దాఖలయ్యాయి అని పేర్కొన్నారు. ఇవన్నీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయని స్పష్టం చేశారు. 


ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘బలమైన కేంద్రం...బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకోవడంతో రాష్ట్రాల హక్కుల హరణం పరాకాష్ఠకు చేరుకున్నదని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నదని, కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి, రాష్ట్రాల లక్షలాది కోట్ల రూపాయలను నిస్సిగ్గుగా హరిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్రాలు విధిగా ఎఫ్ఆర్‌బిఎం చట్టం పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నదని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయిందని అన్నారు. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని మానుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను, రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను, తన కంఠంలో ప్రాణమున్నంతకాలం అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 


ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయిందని, చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకుపోతున్నదని, సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరో విజ్ఞులైన దేశ పౌరులు గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని, ప్రజల జీవితాల్లో మౌలికమైన గుణాత్మక పరివర్తన తేవాలని కేసీఆర్ అన్నారు. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నదని, మత పిచ్చి తప్ప వేరే చర్చలేదని, ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయని, మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమని, విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పేట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుందని, వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయమని, దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదని కేసీఆర్ హెచ్చరించారు. భారతదేశంలో ప్రజలకు కావల్సింది విద్యుత్, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలని, దేశం ప్రగతిపథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలని, అందుకు తగు వేదికలు రావాలని, కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలని కేసీఆర్ అన్నారు. 


తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం తన విధి అని, అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత అని కేసీఆర్ నొక్కి చెప్పారు. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదని, రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళం కాదని, మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళం కాదన్నారు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలని స్పష్టం చేశారు. ఉజ్వల భారతదేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలని పిలుపునిస్తూ, దేశంలో గుణాత్మక పరివర్తన జరగాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.


ఈ నేపథ్యంలో ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు మీడియాలో సంచలనం కలిగించాయి. కేసీఆర్ మదిలో రూపుదిద్దుకుంటున్న జాతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా, తద్వారా ఉజ్వల భారత నిర్మాణం భారత రాష్ట్ర సమితి ద్వారా సాధ్యమవుతుందని ఆశించవచ్చు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, లేదా దాని సారథ్యంలోని కూటమికి కానీ, బీజేపీ లేదా దాని సారథ్యంలోని కూటమికి కాని, భారత రాష్ట్ర సమితి సరైన ప్రత్యామ్నాయం అవుతుందనీ ఆశించవచ్చు.

వనం జ్వాలా నరసింహారావు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.