కెసిఆర్ సందేశం

Published: Wed, 10 Feb 2021 01:16:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కెసిఆర్ సందేశం

గతఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వ, పార్టీ సహచరులకు ఇచ్చిన సందేశం ప్రత్యేకమైనది. వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పాటు, అతి త్వరలో వారసుడికి పదవి బదలాయింపు జరుగుతుందని వస్తున్న ఊహాగానాలకు తెరదింపారు. ఒక వివాదానికి తాత్కాలికంగా ముగింపు దొరికినా, అనేక కొత్త సన్నివేశాలకు, వ్యాఖ్యానాలకు కూడా ఇప్పుడు ఆస్కారం ఏర్పడింది. రాజకీయం సద్దుమణగబోవడం లేదు. సందడి పెరగబోతున్నది.


ఈ ఫిబ్రవరి నెలలోనే కెసిఆర్ తప్పుకుని, తన కుమారుడు కెటిఆర్‌కు పదవిని అప్పగిస్తారని తేదీలు, కొత్త మంత్రివర్గ సభ్యుల చిట్టాతో సహా ప్రచారం జరిగింది. ఇందువల్ల తెలంగాణ రాష్ట్రసమితిలో అంతర్గతంగా కలకలమే తప్ప, కలవరానికి గానీ, సంక్షోభానికి గానీ అవకాశమున్నట్టు కనిపించలేదు. కాకపోతే, వారసత్వ రాజకీయాల గురించి చర్చ మొదలయింది. ప్రభుత్వానికి కొంత ప్రతికూలత పెరుగుతున్న సమయంలో ఇంకా అనుభవం సంతరించుకుంటున్న దశలోనే బాధ్యతను అప్పగించడం సబబు కాదేమోనన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఇక, మార్పును ఆహ్వానించేవారు ఎట్లాగూ ఉంటారు. పార్టీశ్రేణుల్లో, అభిమానుల్లో, మొత్తంగా తెలంగాణ సమాజంలో అది ఒక సంభాషణాంశంగా మారింది. ఇదంతా ముదిరిపాకాన పడుతుందనుకున్నారేమో కెసిఆర్ రంగంలోకి దిగారు. అల్లరికి దిగిన తరగతిని ఉపాధ్యాయుడు వచ్చి గద్దించినట్టు ఆయన అందరినీ హెచ్చరించారు. 


అయితే, పరిస్థితిని చక్కదిద్దడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నం పూర్తిగా సఫలం అయిందని చెప్పలేము. సాధారణంగా, ఏదైనా సమస్యాత్మక వాతావరణం ఏర్పడినప్పుడు, రంగప్రవేశం చేసి జనరంజకమైన వాగ్ధాటితో ప్రసంగించి మంత్రముగ్ధులను చేయడం కెసిఆర్ దగ్గర ఉన్న పెద్ద విద్య. ఆ ఉపన్యాసధారలో ధర్మావేశం, ఉద్వేగం, సాహిత్యం, చమత్కారం అన్నీ ఉంటాయి. ప్రత్యర్థులను సంబోధించి ఆయన వేసే విసుర్లు తీవ్రంగా ఉన్నప్పటికీ వినోదాత్మకంగా కూడా ఉంటాయి. ఆదివారం నాటి ప్రసంగంలో ఆయన అస్మదీయులనే సంబోధిస్తూ మాట్లాడినందువల్లనో ఏమో, మందలింపులు శ్రుతిమించి, స్వోత్కర్ష అధికమనిపించి, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. పదవిలో పదేళ్లు కొనసాగుతానని చెబుతూనే, పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని అనడం జీర్ణించుకోవడం కష్టమైన అతిశయం. ప్రజలు ఎన్నుకుని అధికారపీఠం మీద నిలబెట్టిన తరువాత, ప్రజాపాలనకు వాహిక ముఖ్యమంత్రి పదవి. దానిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం సమర్థనీయం కాదు. తనకు పదవీ వ్యామోహం లేదని చెప్పడం వేరు, ప్రజల కోసమే పదవి తీసుకుంటున్నానని చెప్పడం వేరు. తనకే అంత ఖాతరు లేని పదవిలో తానుండడం ఎందుకు అని, అంత వైరాగ్యం ఉన్నవారు పదవికి న్యాయం చేయగలరా అని ఈ సందర్భంగా ప్రశ్నలు వినిపించడం సహజం. 


నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశం, అక్కడ మీడియా లేదు, ఆ మాటలు తాము అనలేదు- అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఇన్నేళ్ల తరువాత, ఎవరు ఏ మాటలు మాట్లాడగలరో, ఎవరి వ్యక్తీకరణలు ఎట్లా ఉంటాయో, పత్రికలకు తెలియనిది కాదు. అందుకే మూసిన తలుపుల నుంచి అందరికీ ఒకే ప్రసంగం గుప్పుమన్నది!


ముఖ్యమంత్రి మారతారని జరిగిన చర్చ కెసిఆర్ కనుసన్నలలో జరగకపోయినా, ఆయనకు తెలియకుండా జరిగిందని భావించడం కూడా కష్టమే. పోనీ, ఆయనకు ఆలస్యంగా తెలిసిందనుకున్నా, ఆఖరు నిమిషం దాకా ఆగి ఖండన ఇవ్వడం కూడా సమంజసం కాదు. ఇటువంటి చర్చలు అధికారపీఠంపై ఉన్నవారిని రంజింపజేయడానికే జరుగుతాయి. పాపం, నాయకుడిని మెప్పించడానికి ప్రయత్నించినందుకు కర్రు కాల్చి వాతపెట్టడం వంటి గరుడపురాణం ఎందుకు? ఒకపార్టీలో పైనుంచి కింది దాకా సమాచార ప్రసారం సవ్యంగా జరిగి, అంతా ఒక విధానానికి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే, గుసగుసలకు, వదంతులకు ఆస్కారం ఉండదు. నాయకుడి పలుకే బంగారమై, దర్శనమే గగనమైన చోట, అధికార దుర్గం వెలుపల గుమిగూడి అంతా చెవులు కొరుక్కోవలసిందే. కేంద్రానికీ తనకూ నడుమ సాగే విషయాలే కాదు, సమస్తమూ రహస్యమే. 


కెసిఆర్ తన సందేశం ద్వారా ఆశించిన ఫలితం సాధించకపోవడానికి మరో కారణం, ఆయన మాటల్లో ధ్వనించిన కించిత్ బలహీనత. కొత్త పార్టీ పెట్టడంలోని కష్టనష్టాలను వివరించి, ఆయన ఎవరిని నిరుత్సాహపరచాలనుకున్నారనేది పెద్ద ప్రశ్న. మంగళవారం నాడు రంగ ప్రవేశం చేసిన షర్మిలను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలుగా వాటిని పరిగణించలేము. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి ఉన్నదన్న ఆందోళన మనసులో పెట్టుకుని ఆయన అట్లా మాట్లాడారా? బుద్ధిగా నడుచుకుంటే సిటింగ్ శాసనసభ్యులకే తిరిగి టెక్కెట్లిస్తానని ఎన్నికలు ఇంకా రెండున్నరేళ్లుండగా ఎందుకు చెప్పడం? తన బలగాన్ని ఎవరు తన్నుకుపోతారని ఆయన అనుకుంటున్నారు? 


పరిస్థితిని నిజంగా చక్కదిద్దాలనుకుంటే, కెసిఆర్‌కు దారి దొరకకపోదు. వారసత్వాల మంచి చెడ్డలు పక్కనపెడితే, కొడుకో ఎవరో ఓ యువముఖ్యమంత్రి వస్తే పనులు సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్నవారు లేకపోలేదు. కష్టం సుఖం చెప్పుకోవడానికి కార్యకర్తలకు దారిలేదు, తమ గోడును అధికారం చెవిన వేయడానికి జనానికీ మార్గం లేదు. బడికి వెళ్లడం ఎగవేసే పిల్లవాడి వలె, సెక్రటేరియట్‌కు వెళ్లని ముఖ్యమంత్రిని ప్రజలు ఎంతకాలం భరిస్తారు? ఆలోచనలు, వైఖరుల సంగతి సరే, సంతకం పెట్టడానికి కూడా దొరకని ఏలికతో పాలన ఎట్లా సాగుతుంది? 


పరిస్థితిని మొత్తంగా సమీక్షించుకోవాలని పొరపాటున అనుకుంటే కనుక, ముఖ్యమంత్రి తన భాషను కూడా ఆ సమీక్ష పరిధిలోకి తెచ్చుకోవడం అవసరం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.