కేసీఆర్‌ కొత్త యుద్ధం

ABN , First Publish Date - 2022-02-20T05:55:24+05:30 IST

దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో కేసీఆర్‌ మనసు కీడు శంకించినట్టుంది. ఉన్నట్టుండి బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కిందా మీదా పడి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసినా......

కేసీఆర్‌ కొత్త యుద్ధం

దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో కేసీఆర్‌ మనసు కీడు శంకించినట్టుంది. ఉన్నట్టుండి బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కిందా మీదా పడి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసినా దానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కాలం కలసి వస్తే ప్రధానమంత్రి కావాలని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అఖిలేశ్‌ యాదవ్‌ విజయం సాధిస్తే అతి పెద్ద రాష్ర్టానికి చెందిన తన సంగతేమిటని ఆయన కూడా ప్రశ్నిస్తారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నేతల జాబితాలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పోల్చితే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కేసీఆర్‌ ఎన్ని గెలుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహించడానికి ఇతరులు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు.


సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు వెలుగులోకి రాగానే ‘జగన్‌ అండ్‌ కో’ ఆస్కార్‌ లెవల్లో నటించడం మొదలుపెట్టారు. బాధితులనే వేధిస్తారా? అని సజ్జల రామకృష్ణా రెడ్డి గుండెలు బాదుకున్నారు. సీబీఐ చార్జిషీటుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటిస్తూనే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పాత డైలాగ్‌నే ఆయన మళ్లీ వల్లెవేశారు. చంద్రబాబు నిజంగా అంత శక్తిమంతుడే అయితే రఘురామరాజు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా జగన్‌కు బెయిలు రద్దు చేయాలని సీబీఐ కోరి ఉండేది. అలా జరగలేదంటే వ్యవస్థలను ఎవరు మేనేజ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వివేకా హత్య కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పవచ్చు. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ అధికారులు భావించినా అది జరగలేదు. కడప ఎంపీ సీటుకు ‘అయితే నువ్వు.. లేదా నేను’ మాత్రమే పోటీ చేయాలని వివేకానంద రెడ్డి మీతో అన్నది నిజమేనా? నిజమే అయితే ఆ మేరకు స్టేట్‌మెంట్‌ ఇస్తారా? అని షర్మిలను కోరిన సీబీఐ అధికారులు ఆ తర్వాత మౌనంగా ఎందుకు ఉన్నారో సజ్జల చెప్పాలి. స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి షర్మిల సిద్ధపడినా సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నది ఎవరో ఆయనకే తెలియాలి.


కేసీఆర్‌ ప్రకటనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయన్నది ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాతగానీ స్పష్టం కాదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కేసీఆర్‌ వేగం పెంచుతారు. ఆయనతో కలసి వచ్చే వారి సంఖ్య కూడా పెరగవచ్చు. అక్కడ మళ్లీ బీజేపీ గెలిస్తే ఇప్పుడు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిలో కొందరు సైలెంట్‌ అయిపోతారు. అప్పుడు మమతా బెనర్జీలాంటి వాళ్లు ఒకరిద్దరే మిగులుతారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మమత తిరిగి అధికారంలోకి వచ్చినందున ఎవరితో పోరాడినా ఆమెకు పోయేదేమీ లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నందున ఆమెకు తప్పదు. కేసీఆర్‌ పరిస్థితి అలా కాదు. మరో ఏడాదిన్నర తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్లవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవడంతో తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో అధికారం చేజారకుండా, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే కేసీఆర్‌ ముందున్న అతి పెద్ద చాలెంజ్‌.


జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముచ్చటపడుతున్నారు. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అని కొంతకాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగానే, ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అని కేసీఆర్‌ తాజాగా పిలుపిచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వ పోకడలతో ఇబ్బందిపడిన, పడుతున్న  ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాకరే, స్టాలిన్‌ వంటి వారు మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ చేపట్టబోయే ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్‌కు ఉన్నాయని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రముఖులు ప్రచారం మొదలెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్‌–బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల ఏర్పాటులో గతంలో కూడా తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. రాజీవ్‌ గాంధీ హయాంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్‌ ఫ్రంట్‌ పురుడుపోసుకోవడంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ప్రధాన పాత్ర పోషించారు.


ఎన్టీఆర్‌ చైర్మన్‌గా, విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ కన్వీనర్‌గా నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడి కేంద్రంలో అధికారంలోకి కూడా వచ్చింది. అయితే.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో వీపీ సింగ్‌ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌కు పాత్ర లేకుండా పోయింది. ఆ తర్వాత కాలంలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించడానికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ మద్దతుతో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కొంతకాలం కేంద్రంలో పనిచేసింది. ఆ తర్వాత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరుచుకు పడుతున్నట్టుగానే అప్పుడు చంద్రబాబు కూడా నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడంతో సైలెంటైపోయారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌ వంతొచ్చింది. నిజానికి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో స్నేహ సంబంధాలనే కోరుకున్నారు. తన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి సహకారం అందించవలసిందిగా కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఒక దశలో అర్థించారు. అయితే దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో కేసీఆర్‌ మనసు కీడు శంకించినట్టుంది. ఉన్నట్టుండి బీజేపీపై యుద్ధం ప్రకటించారు.


గతంలో కూడా ఇలాగే చెప్పి ఆ తర్వాత సర్దుకున్నందున ఇప్పుడు కూడా కేసీఆర్‌ను చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించడం కూడా మొదలుపెట్టాక కేసీఆర్‌పై ఇతర పార్టీల నాయకులకు నమ్మకం కుదిరినట్టుంది. అందుకే సంఘీభావం ప్రకటిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర లేకుండా బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు సాధ్యం కాదు. నరేంద్ర మోదీ వ్యతిరేక రాజకీయాలకు నాయకత్వం వహించాలనుకుంటున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్‌ దారి కాంగ్రెస్‌దే అని ప్రకటించారు. కేసీఆర్‌ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిస్థితి వేరు. వీరిరువురూ తమ తమ రాష్ర్టాల్లో కాంగ్రెస్‌తో జతకట్టి ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అఖిలేశ్‌ యాదవ్‌ ఈ ప్రత్యామ్నాయాలతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇప్పుడు బీజేపీతో కలసి ఉన్నారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్‌ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన పార్టీని ఇతర రాష్ర్టాల్లో విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆయన తలమునకలై ఉన్నందున కేసీఆర్‌ పిలుపునకు ఇంతవరకు స్పందించలేదు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తటస్థంగా ఉండటానికే ఇష్టపడతారు. కమ్యూనిస్టుల ఏలుబడిలో కేరళ మాత్రమే ఉండటం, దేశంలో వామపక్షాలు బలహీనపడటంతో ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఆ పార్టీల పాత్ర పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మొదలెట్టిన ప్రత్యామ్నాయ ప్రయత్నం విజయవంతం అవుతుందా? అన్న ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. కిందా మీదా పడి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసినా దానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కాలం కలసి వస్తే ప్రధానమంత్రి కావాలని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అఖిలేశ్‌ యాదవ్‌ విజయం సాధిస్తే అతి పెద్ద రాష్ర్టానికి చెందిన తన సంగతేమిటని ఆయన కూడా ప్రశ్నిస్తారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నేతల జాబితాలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పోల్చితే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ కేవలం 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కేసీఆర్‌ ఎన్ని గెలుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహించడానికి ఇతరులు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్‌ తలపోస్తున్న ప్రత్యామ్నాయంలో పాత్ర లేకుండా పోయింది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుగానీ ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమితో జట్టుకట్టే స్థితిలో లేరు.


ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికి నామమాత్రమే. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వ సహకారాన్ని ఈ ఇరువురు నాయకులు కోరుకుంటున్నారు. కేసుల నుంచి బయటపడటానికి జగన్‌రెడ్డికి కేంద్రం పెద్దల చల్లని చూపు అవసరం. ఏకకాలంలో జగన్‌రెడ్డితో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పోరాడే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. గత ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీపైకి ఒంటి కాలి మీద వెళ్లి ప్రస్తుత దుస్థితి కొనితెచ్చుకున్నామని తెలుగుదేశం నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా బీజేపీ అనుకూల, వ్యతిరేక వైఖరి విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి జగన్‌రెడ్డిని వదిలేసి బీజేపీతో యుద్ధం చేయడం వల్ల తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని చంద్రబాబు గ్రహించారు. చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడటం విషాదమే. ఇక్కడ మరో విషయం చర్చించుకోవాలి. జాతీయ రాజకీయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రాంతీయ పార్టీల నాయకులు సొంత రాష్ర్టాలలో దెబ్బతిన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుకు ఇటువంటి చేదు అనుభవాలే మిగిలాయి. జాతీయ రాజకీయాల ఊసెత్తని నవీన్‌ పట్నాయక్‌ నిశ్చింతగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశమే.


రాష్ట్రంలో కాంగ్రెస్‌-–బీజేపీలు బలమైన ప్రతిపక్షాలుగా కేసీఆర్‌ను ఢీకొంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే కేసీఆర్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. అయితే తమను పాలించమని అధికారం అప్పగిస్తే జాతీయ రాజకీయాలలో తలమునకలవ్వడాన్ని తెలుగు ప్రజలు ఇష్టపడరని గత దృష్టాంతాలు రుజువు చేస్తున్నాయి. కేసీఆర్‌ ఈ దిశగా ఆలోచించారో లేదో తెలియదు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై తాను పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతానని కేసీఆర్‌ ప్రకటించడంతో మొదటికే మోసం రాదుకదా? అన్న అనుమానం కలగక మానదు. ఈ సమస్యను పరిష్కరించడానికై తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి, తన మొత్తం సమయాన్ని జాతీయ రాజకీయాలకు కేటాయించే ఆలోచన చేయవచ్చు. అదే జరిగితే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు? అన్నది కూడా వేచి చూడాలి.



యూపీ ఫలితమే కీలకం..

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అని కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు వినసొంపుగానే ఉంటుంది. ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నదే ప్రశ్న. కాంగ్రెస్‌ కూడా లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యమా? సాధ్యమైతే ఎవరు నాయకత్వం వహిస్తారు? వంటి ప్రశ్నలకు ముందుగా సమాధానం లభించాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుసరించిన వ్యూహం వికటించి పరాభవాన్ని మిగిల్చిన విషయాన్ని కూడా మరువరాదు. అంతేకాదు కేసీఆర్‌ ప్రకటనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయన్నది ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాతగానీ స్పష్టం కాదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కేసీఆర్‌ వేగం పెంచుతారు. ఆయనతో కలసి వచ్చే వారి సంఖ్య కూడా పెరగవచ్చు. బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు కీలకం. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ గెలిస్తే ఇప్పుడు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిలో కొందరు సైలెంట్‌ అయిపోతారు. అప్పుడు మమతా బెనర్జీలాంటి వాళ్లు ఒకరిద్దరే మిగులుతారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మమత తిరిగి అధికారంలోకి వచ్చినందున ఎవరితో పోరాడినా ఆమెకు పోయేదేమీ లేదు. పైగా పశ్చిమబెంగాల్లో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నందున ఆమెకు తప్పదు. కేసీఆర్‌ పరిస్థితి అలా కాదు. మరో ఏడాదిన్నర తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్లవలసి ఉంటుంది. ప్రధానిని వ్యక్తిగతంగా దూషించిన చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఎలా కక్ష తీర్చుకుంటున్నారో చూస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే బాటలో మోదీని దూషిస్తున్నారు. మార్చి 10వ తేదీన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.


ఉత్తరప్రదేశ్‌లో ఫలితాలు అనుకూలంగా వస్తే బీజేపీ పెద్దలు తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తారు. కేసీఆర్‌ను ఎన్ని విధాలుగా చికాకు పెట్టవచ్చో అన్ని విధాలుగా చికాకు పెడతారు. కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారంటే జరగబోయేది ఏమిటో ఊహించవచ్చు. తాను హాజరైన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్‌ రాకపోవడం, తనను పనికిమాలినవాడు అని నిందించడం వంటి విషయాలను నరేంద్ర మోదీ అంత తొందరగా మరచిపోయే మనిషి కాదు. అవన్నీ మనసులో పెట్టుకునే ఆయన మొన్న కేసీఆర్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. ‘చంద్రబాబును దారిలోకి తెచ్చుకున్నాం. కేసీఆర్‌ను కూడా దారిలోకి తెచ్చుకుందాం’ అని బీజేపీ పెద్దలకు ఉండదా? ప్రస్తుతానికి అయితే కేసీఆర్‌ ఎంచుకున్నది ముళ్ల బాటగానే కనిపిస్తోంది. అయితే ఆయనకు మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెడుతుంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న కాంక్ష బలంగా ఉన్నందున కేసీఆర్‌ను కుదురుగా ఉండనివ్వకూడదన్న బీజేపీ పెద్దల మనోగతం తెలుసుగనుకే కేసీఆర్‌ ఎదురుదాడిని ఎంచుకున్నారు. తన రాజకీయ వ్యూహాలకు ప్రశాంత్‌ కిషోర్‌ కుయుక్తులు కూడా తోడైతే రాష్ట్రంలో తమ పరిస్థితి పదిలంగా ఉంటుందని కేసీఆర్‌ భావిస్తుండవచ్చు.


కేసీఆర్‌ ఎత్తుగడలో, ప్రశాంత్‌ కిషోర్‌ పన్నాగాలో తెలియదుగానీ దాని ప్రభావం ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీపై కనబడుతోంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాదాపుగా ప్రకటించారు. సొంత పార్టీ పెట్టుకుంటానని ఆయన ఇస్తున్న లీకుల వెనుక కాంగ్రెస్‌ ఓట్ల చీలిక వ్యూహం దాగి ఉంటుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవడంతో తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో అధికారం చేజారకుండా, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే కేసీఆర్‌ ముందున్న అతి పెద్ద చాలెంజ్‌. ఈ సవాల్‌ను ఆయన ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడవలసిందే.


సజ్జల చెప్పని సంగతులు...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఎట్టకేలకు చార్జిషీటు దాఖలు చేసింది. వివేకా హత్యకు ప్రధాన సూత్రధారులు కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి అని సీబీఐ తన చార్జిషీటులో దాదాపుగా నిర్ధారించింది. ఈ కేసు ఈ స్థాయికి రావడానికి వివేకానంద రెడ్డి ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి చేసిన పోరాటం ప్రధాన కారణం. తాను ఒంటరినని భావించకుండా వరుసకు సోదరి అయిన షర్మిల పరోక్ష సహకారంతో ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. తన తండ్రి వివేకా హత్యతో అవినాశ్‌ రెడ్డి కుటుంబానికి సంబంధం ఉందని సునీతా రెడ్డి మొదటి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమని భావించేలా సీబీఐ చార్జిషీటు ఉంది.


సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు వెలుగులోకి రాగానే ‘జగన్‌ అండ్‌ కో’ ఆస్కార్‌ లెవల్లో నటించడం మొదలుపెట్టారు. బాధితులనే వేధిస్తారా? అని సజ్జల రామకృష్ణా రెడ్డి గుండెలు బాదుకున్నారు. సీబీఐ చార్జిషీటుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటిస్తూనే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పాత డైలాగ్‌నే ఆయన మళ్లీ వల్లెవేశారు. చంద్రబాబు నిజంగా అంత శక్తిమంతుడే అయితే రఘురామరాజు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా జగన్‌కు బెయిలు రద్దు చేయాలని సీబీఐ కోరి ఉండేది. అలా జరగలేదంటే వ్యవస్థలను ఎవరు మేనేజ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వివేకా హత్య కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో కొన్ని అదృశ్యశక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పవచ్చు. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ అధికారులు భావించినా అది జరగలేదు. కడప ఎంపీ సీటుకు ‘అయితే నువ్వు.. లేదా నేను’ మాత్రమే పోటీ చేయాలని వివేకానంద రెడ్డి మీతో అన్నది నిజమేనా? నిజమే అయితే ఆ మేరకు స్టేట్‌మెంట్‌ ఇస్తారా? అని షర్మిలను కోరిన సీబీఐ అధికారులు ఆ తర్వాత మౌనంగా ఎందుకు ఉన్నారో సజ్జల చెప్పాలి.


స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి షర్మిల సిద్ధపడినా సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నది ఎవరో ఆయనకే తెలియాలి. జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో చీలిక తీసుకురావడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి సజ్జల తాజాగా ఆరోపించారు. జగన్‌రెడ్డి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబమా? లేక... భాస్కర రెడ్డి-–అవినాశ్‌ రెడ్డి కుటుంబమా? అన్నది సజ్జల చెబితే బాగుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబీకులు షర్మిల, సునీత జగన్‌రెడ్డితో తీవ్రంగా విభేదించి దూరంగా ఉంటున్నారు. తల్లి విజయమ్మ కూడా అంటీముట్టనట్టే ఉంటున్నారు. జగన్‌రెడ్డి భార్య భారతి రెడ్డి తరఫు బంధువులైన భాస్కర రెడ్డి, అవినాశ్‌ రెడ్డి ప్రభృతులే సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా డాక్టర్‌ సునీత భర్త రాజశేఖర రెడ్డి తప్పుచేశారని నిందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భాస్కర రెడ్డి దివంగత రాజారెడ్డి సోదరుడి కుమారుడు. వివేకానంద రెడ్డి రాజారెడ్డి సొంత కుమారుడు. అంటే భాస్కర రెడ్డి కుటుంబీకులు, జగన్‌రెడ్డి కుటుంబీకులు కాబోరు. అమ్మ అల్లం–పెళ్లాం బెల్లం అవడం వల్లనే తమకు న్యాయం జరగడంలేదని రాజశేఖర రెడ్డి కుటుంబీకులు వాపోతున్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసింది ఎవరు? అవినాశ్‌ రెడ్డి ఆ ప్రచారం చేశారని, జగన్‌రెడ్డి సొంత చానల్‌ ప్రసారం చేసిందని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. జనం తాకిడి పెరిగి, ఫొటోలు బయటకు వచ్చిన తర్వాతనే వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపారన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. తన చిన్నాన్నను ఎలా చంపారో పూసగుచ్చినట్టుగా జగన్‌రెడ్డి ఆ తర్వాత వివరించారు.


బాధితులు ఎవరు?

తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభి తనను బోసడికే అని తిట్టినందుకు తన అభిమానులకు బీపీ పెరిగి పట్టాభి ఇంటిపైన, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైన దాడి చేశారని సమర్థించుకున్న జగన్‌రెడ్డి ఒక విషయం చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య వెనుక తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారని స్వయంగా జగన్‌రెడ్డి చెప్పినా పులివెందులలో కనీసం ఒక్కరికి కూడా బీపీ పెరగకపోవడానికి కారణం ఏమిటో సెలవివ్వాలి. వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిని సీబీఐ ప్రశ్నించకపోవడం ఏమిటని అడుగుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి... తండ్రితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన డాక్టర్‌ సునీత విషయాన్ని సీబీఐ గమనంలోకి తీసుకోకపోవడం ఏమిటని కూడా ప్రశ్నించారు. అంటే, వివేకానంద రెడ్డిని ఆయన ఏకైక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి హత్య చేయించారని సజ్జల చెప్పదలచుకున్నారా? బాధితులను వేధించడం అంటే ఇదీ! సునీత దంపతులు వ్యయ ప్రయాసలకు ఓర్చి అలుపెరుగని పోరాటం చేసి ఉండకపోతే వివేకా హత్యకు సూత్రధారులు ఎవరో ప్రపంచానికి తెలిసేది కాదు. తన తండ్రిని ఫలానా వారు చంపించారని సొంత చిన్నాన్న కూతురు సునీత నెత్తీ నోరూ బాదుకుంటున్నప్పటికీ భాస్కర రెడ్డి కుటుంబాన్ని వెనుకేసుకు రావడానికి జగన్‌రెడ్డి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంది. దీన్నిబట్టి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎవరు ముఖ్యమో తెలిసిపోతూ ఉంది. బాధితులనే దోషులుగా నిలబెట్టడానికి జగన్‌ తరఫున సజ్జల వంటి వారు ప్రయత్నించడం బరితెగింపే అవుతుంది.


సీబీఐ చార్జిషీటుపై న్యాయపోరాటం చేయడం అంటే అవినాశ్‌ రెడ్డి, భాస్కర రెడ్డికి మద్దతుగా నిలబడటం కాదా? అన్నది జగన్‌ అండ్‌ కో చెప్పాలి. ఏదేమైనా వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేయించారో ఇప్పటికైనా ప్రపంచానికి తేటతెల్లమయింది. సీబీఐ అధికారులు ఇప్పుడైనా జగన్‌రెడ్డి సోదరి షర్మిల స్టేట్‌మెంట్‌ తీసుకుంటే వివేకా హత్యకు మోటివ్‌ ఎస్టాబ్లిష్‌ అవుతుంది. హైకోర్టు అభిప్రాయపడినట్టుగా ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి రావడానికి హంతకులలో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన ఆధారం. ప్రస్తుత పరిస్థితుల్లో దస్తగిరి ప్రాణాలకు హాని ఉండే అవకాశం ఉంది. పరిటాల రవిని హత్య చేసిన వారిని ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎలా చంపారో చూశాం. ఇప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్లకు ఆ దుస్థితి పట్టకుండా సీబీఐ అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. డాక్టర్‌ సునీతకు కూడా దాయాదుల నుంచి ప్రాణహాని ఉండే అవకాశం ఉందని వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.


అధికారులకు ఒక గుణపాఠం

ఈ విషయం అలా ఉంచితే, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయనను బదిలీ చేయడానికి ముందే పిలిపించుకొని తమ ఆలోచనను చెప్పి ఉండవచ్చు. అలా చేయకుండా సవాంగ్‌ను ఆకస్మికంగా బదిలీచేసి సీనియారిటీలో దిగువన ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డిని డీజీపీగా నియమించారు. జరిగిన అవమానానికి మనసు నొచ్చుకుందో ఏమో తెలియదుగానీ సవాంగ్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో ‘డీమ్డ్‌ టుబి రిటైర్డ్‌’ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సవాంగ్‌ కూడా రాజీపడిపోయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవిని చేపట్టడానికి అంగీకరించారట! సాధారణంగా సవాంగ్‌ స్థాయి అధికారులు ఇటువంటి అగౌరవాన్ని భరించలేరు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎల్వీ సుబ్రమణ్యంను ఉన్నపళంగా బదిలీచేసి ఆ తర్వాత పట్టించుకోని జగన్‌రెడ్డి, ఇప్పుడు గౌతమ్‌ సవాంగ్‌ విషయంలో ఒక మెట్టు ఎందుకు దిగారో తెలియదు. ఏదేమైనా ఐఏఎస్‌, ఐపీఎస్‌వంటి అఖిల భారత సర్వీసు అధికారులకు సవాంగ్‌ ఉదంతం ఒక గుణపాఠంగా నిలిచిపోతుంది.


ఆర్కే




యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scanచేయండి

Updated Date - 2022-02-20T05:55:24+05:30 IST