కేసీఆర్‌కు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం

ABN , First Publish Date - 2021-12-08T07:54:56+05:30 IST

సీఎం కేసీఆర్‌కు జాతి ప్రయోజనాలు అవసరం లేదని, ఆయనకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ...

కేసీఆర్‌కు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం

 పథకం ప్రకారమే దుష్ప్రచారం: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు జాతి ప్రయోజనాలు అవసరం లేదని, ఆయనకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించారని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచే ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్‌ విష ప్రచారం మొదలుపెట్టిందని చెప్పారు. అందులో భాగంగానే ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో అప్పటికే ఒక ఒప్పందం చేసుకుని, ఇప్పుడు దాన్ని పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో స్పష్టమైన వివరణ ఇచ్చారని, మళ్లీ ప్రకటన చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని, ఒప్పందం ప్రకారం ముడి, ఉప్పుడు బియ్యాన్ని సేకరిస్తామని స్పష్టం చేశారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రైతులకు ఇతర విత్తనాలు ఇవ్వాలని రాష్ట్రానికి కేంద్రం ప్రతిపాదించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముడి బియ్యం ప్రతి గింజను కేంద్రం కొంటుందని స్పష్టం చేశారు. వానా కాలం పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేంద్రం ధాన్యాన్ని సేకరిస్తుందని, అంతకు మించి ఉన్నా చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అవగాహన లేకుండా ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.


టీఆర్‌ఎస్‌ వ్యవహారం బట్టబయలు: అర్వింద్‌

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల పరిమితిని పెంచినందున టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముఖం చూపించలేక పార్లమెంటును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారని బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. దమ్ముంటే వారు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ వ్యవహారం బట్టబయలైందని, రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. 

Updated Date - 2021-12-08T07:54:56+05:30 IST