కేసీఆర్ జాతీయపార్టీ... రాబోతోంది ఇలా..

ABN , First Publish Date - 2022-10-05T02:05:55+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ ఆవిర్భావం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది.

కేసీఆర్ జాతీయపార్టీ... రాబోతోంది ఇలా..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ ఆవిర్భావం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. టీఎర్ఎస్ (TRS) పార్టీ కార్యవర్గం ఆమోదంతో జాతీయ పార్టీని ఆయన ప్రకటించనున్నారు. కేసీఆర్ ప్రకటించబోయే కొత్త పార్టీ ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ స్థానంలో కొత్త జాతీయ పార్టీకి తీర్మానం కోసం బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 283 మంది నేతలకు ఆహ్వానం పంపారు. ఉదయం 11గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్‌కు కేసిఆర్ చేరుకుంటారు. మొదటగా కొత్త పార్టీ  ప్రతిపాదన చేసి మాట్లాడతారు. అందులో బీసీ, ఎస్సీ, నేతలు ఉంటారు. దానికి ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:19 నిమిషాలకు కేసిఆర్ కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. అనంతరం కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు సంతకాలు చేస్తారు. 


కేసీఆర్ పెట్టబోయే కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav), తమిళనాడు ఎంపీ మావలవన్‌తో పాటు మరో ముగ్గురు నాయకులు హాజరుకానున్నారు. అక్కడే నేతలందరితో కలిసి లంచ్ చేస్తారు. పార్టీ ప్రకటించిన వెంటనే రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ మొదలుపెడతారు. దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ కొత్త విమానాన్ని కొనుగోలు చేశారు. కొత్త విమానాన్ని దసరా రోజే వినియోగించబోతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం కొత్త విమానంలో ఢిల్లీకి పార్టీ ప్రతినిధులను పంపనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ బాధ్యతలు వినోద్ కుమార్, అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుకు అప్పగించారు. కొత్త పార్టీ ప్రకటన తర్వాత ప్రజా ప్రతినిధులను ప్రగతిభవన్‌కు లంచ్‌కు కేసీఆర్ ఆహ్వానించారు. 


మధ్యాహ్న విందు ఏర్పాట్ల భాద్యతలు ఆర్మూర్ ఎమ్మేల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy)కి కేసీఆర్ అప్పగించారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యకలాపాల కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. పార్టీ విస్తరణ, ఢిల్లీ బహిరంగ సభ తదితర అంశాలపై హస్తిన పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు. కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ మొత్తం సంబరాలు చేయడానికి సన్నద్దమయ్యాయి. తెలంగాణ భవన్ ఎదుట బాణసంచా కాల్చి ప్రకటనను స్వాగతించే ఏర్పాట్లు జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్‌కు అప్పగించారు. ఇక కేసీఆర్ పార్టీకి మద్దతు తెలుపుతూ, కేసీఆర్ వెంటే మేము అంటూ నగరం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. 


మొత్తానికి జాతీయ పార్టీ ఏర్పాటు స్పీడ్ పెంచిన గులాబీ దళపతి పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు.  మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ తెలిపినట్లు చెబుతున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటనతో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. మరి చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ స్థానంలో వచ్చే కొత్త పార్టీ ఏ మేరకు సక్సస్ అవుతుందో చూడాలి.

Updated Date - 2022-10-05T02:05:55+05:30 IST