KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ ముందు బిగ్ టార్గెట్స్.. 4 రాష్ట్రాల్లో ఇది సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2022-09-13T01:58:01+05:30 IST

ఇప్పటివరకు ఫెడరల్ ప్రంట్ (Federal Print) కోసం సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నించారు. అనుకున్నట్లే ఆయన వివిధ రాష్ట్రాల

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ ముందు బిగ్ టార్గెట్స్.. 4 రాష్ట్రాల్లో ఇది సాధ్యమేనా..?

హైదరాబాద్: ఇప్పటివరకు ఫెడరల్ ప్రంట్ (Federal Print) కోసం సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నించారు. అనుకున్నట్లే ఆయన వివిధ రాష్ట్రాల సీఎంలను నేతలను కలిశారు. అయితే ఆయనకు ఆశించినంత పురోగతి కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. ఇలా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) మొదలుకుని బీహార్ సీఎం నితీష్‌కుమార్ వరకు ఆయన ముందుగా అనుకున్న నేతలతో భేటీ అయ్యారు. ఆ మధ్య మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే కూడా ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు లక్ష్యంగా కలిశారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఆయన చొరవ చూపారు. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర (Telangana Maharashtra) మధ్య ఉన్న జలవిధాలను ఇతర అంశాలను పరిష్కరించుకునేందుకు ఆసక్తి చూపారు. ఇంతలోనే ఉద్దవ్ థాక్రే సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ జాతీయరాజకీయాలపై మొగ్గుచూపారు. ఇదే విషాయాన్ని ఆయన ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రస్తావించారు. అప్పటి నుంచి జాతీయపార్టీని స్థాపించేందుకు కేసీఆర్ అడుగులు వేయడం ప్రారంభించారు. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై మీడియాలో కథనాలు వచ్చాయి. కేసీఆర్ పెట్టబోయే పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అంటూ ప్రచారం జరిగింది. అయితే జాతీయ పార్టీ విధి విధానాలు, పార్టీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. కేసీఆర్ కలిసి పనిచేసేందుకు కుమారస్వామి సుముఖత వ్యక్తం చేశారు. ఇది శుభపరిణామమని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. 


జాతీయ పార్టీ అంటే ఏమిటి?

జాతీయ పార్టీ అంటే ఏమిటి? ఎన్ని రాష్ట్రాలలో శాఖలు ఉంటాయనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. కేసీఆర్ వేస్తున్న ముందగుడుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు పదిమంది కూడా లేరని, అలాంటప్పుడు జాతీయపార్టీని స్థాపించడం.. సక్సెస్ కావడం సాధ్యమేనా? అని ప్రశ్నించేవారు లేకపోలేదు. అయితే ఈ వాదనను టీఆర్‌ఎస్ నేతల బలంగా సమర్ధించుకుంటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో వెళ్లడానికి ఇది తరుణమని అంటున్నారు. ఇది నిజమే కావచ్చు.. దీన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే ప్రజలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడం సాధారణమే. దళితబంధు, రైతుబంధు తమకు కూడా వస్తే బాగుండునని పొరుగు రాష్ట్ర సరిహద్దు జిల్లాల వారు కొందరు కోరుకుని ఉండవచ్చు. అంతమాత్రాన జాతీయ రాజకీయాల్లో రాణించలేరని అంటున్నారు. 


జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం (నిబంధన -1968) ప్రకారం కొన్ని నియమాలు విధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు రాబట్టుకోవాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా గెలవాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలనే నిబంధన ఉంది. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకోవాలి. ఆ గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికై ఉండాలి. టీఆర్‌ఎస్ ప్రభావం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ను అభిమానించేవాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉండవచ్చు. కానీ ఎలా చూసినా టీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయి గుర్తింపు పొందే అవకాశం లేదని అంటున్నారు. టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఏఐఎంఐఎం ఈ పార్టీల్లో జాతీయ అనే భావన ఉంది. 


ఆప్, టీఎంసీ, ఎన్సీపీ లాంటి పార్టీలు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయంటే, అవి స్వభావరీత్యా ప్రాంతీయ పార్టీలు కావు. ఈ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఆప్ ఢిల్లీ నుంచి నుంచి పక్కనే ఉన్న పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గుజరాత్‌లో పాగా వేయాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారు. అలాగే ఏఐఎంఐఎం (మజ్లీస్) కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేస్తోంది. ఇటీవల బీహార్, యూపీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా పుట్టింది. ఆ పార్టీ పేరులోనే ప్రాంతీయ ఉంది. ప్రాంతీయ ఉద్యమాల నుంచి పుట్టే పార్టీలు జాతీయస్థాయిలోకి విస్తరించిన దాఖలాలు లేవని అంటున్నారు. టీఆర్ఎస్, బీఆర్‌ఎస్ కావచ్చు. ఒకవేళ బీఆర్‌ఎస్ పేరును ఖారారు చేస్తే అందులో తెలంగాణ అంశమే ఉండదు. ఇలా చేస్తే కేసీఆర్ ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-09-13T01:58:01+05:30 IST