తదుపరి టార్గెట్‌ కేసీఆర్‌?

ABN , First Publish Date - 2022-06-02T10:14:11+05:30 IST

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)’ తదుపరి లక్ష్యం ఎవరు? మొన్న కశ్మీరులో ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నించడం.. కర్ణాటకలో డీకే

తదుపరి టార్గెట్‌ కేసీఆర్‌?

తెలంగాణ సీఎంపై ఈడీ నజర్‌?.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైనా ఉచ్చు!

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)’ తదుపరి లక్ష్యం ఎవరు? మొన్న కశ్మీరులో ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నించడం.. కర్ణాటకలో డీకే శివకుమార్‌ అరెస్టు.. ఢిల్లీలో ఆప్‌ నేత, మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు.. నిన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌కు సమన్లు.. ఇక తదుపరి నేత ఎవరు? తెలంగాణ సీఎం కేసీఆరేనా..? అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. బుధవారం ఏకంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంఽధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు పంపడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అనేకమంది నేతలు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ  ఉచ్చు బిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అక్రమ ఆర్జన చేసిన పలువురు నేతల చిట్టా కేంద్రం వద్ద ఉందని, త్వరలోనే ఈడీ కొందరు సీనియర్‌ నేతలను విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అవినీతి పాలన.. నయా నిజాం..

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అవినీతిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు. అధికారంలో కొనసాగడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యమని.. అలాంటి పార్టీలను తరిమికొట్టినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఎంగా మార్చుకున్నారని, మిషన్‌ భగీరథలో కూడా వేల కోట్ల అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. కాగా అమిత్‌ షా కూడా తెలంగాణలో కేసీఆర్‌ నయా నిజాంగా మారారని ఆరోపించారు. ఈ క్రమంలో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ దాడులు తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-06-02T10:14:11+05:30 IST