Advertisement

కేసీఆర్‌... పారాహుషార్‌!

Dec 6 2020 @ 00:58AM

వరుస పరాభవాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అంతా తనకే తెలుసు అనుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడానికి కేసీఆర్‌ మొగ్గుచూపితే, తెలంగాణ రాజకీయాలపై ఆయన తన పట్టును మళ్లీ బిగించవచ్చు. అలా జరగని పక్షంలో ఆయనకు ఇంటా బయటా సవాళ్లు తప్పవు. జాతీయస్థాయిలో ఢీ కొంటానని ప్రకటనలు చేసినందున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనను టార్గెట్‌ చేసుకోకుండా ఉండదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అని కమలనాథులు ఆరా తీయడం మొదలెట్టారు. బలమైన ఆధారాలు లభిస్తే కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించి మరింత బలహీనపరిచే ఎత్తుగడలకు బీజేపీ నాయకులు పదును పెడుతున్నారు. మజ్లిస్‌ సహకారంతో టీఆర్‌ఎస్‌కు మేయర్‌ పీఠం దక్కవచ్చు. బీజేపీ కోరుకుంటున్నది ఇదే. టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ పార్టీల మధ్య నెలకొన్న మైత్రిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో పూర్తిస్థాయిలో బలపడాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు.


తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన చెప్పే మాటలను నమ్మి ఊగిపోయే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు లేరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లోనే కేసీఆర్‌ పరాభవాన్ని చవిచూశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లు మద్దతు ఇచ్చి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ పరిస్థితి ఏమిటి? అన్నది కేసీఆర్‌ గ్రహించుకోవాలి. సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేయకపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా పరోక్షంగా సందేశాలు పంపడంతో సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలతో పాటు అమరావతి ప్రస్తుత దుస్థితికి బీజేపీ కూడా కారణమన్న అభిప్రాయంతో ఉన్న సెటిలర్లు, ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు, ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. ఇది జరిగి ఉండకపోతే గ్రేటర్‌ ఎన్నికలలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఘోర పరాభవం ఎదురై ఉండేది.


‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది’... అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ అంటుంటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆయన మాటలు గుర్తుకు రాకుండా ఉంటాయా? రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలలో ఆరితేరిన కేసీఆర్‌కు ఈ మధ్యకాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్‌లో తెలివితేటలు ఆవిరి కాలేదు కానీ, కాలమే కలిసి రావడం లేదు. ఈ పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం. ‘తెలంగాణలో పంచాయతీ ఎన్నికలైనా, మునిసిపాలిటీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా కారుదే విజయం. ఎన్నిక ఏదైనా వార్‌ వన్‌సైడ్‌’ అంటూ తెలంగాణ రాష్ట్రసమితి నాయకులలో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఇందుకు కారణం కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలపై వారికున్న అపార నమ్మకం. నిన్న దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌ ఎన్నికలలో కారు బోల్తాపడింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అజేయుడిగా ఉంటూ వచ్చిన కేసీఆర్‌ను ఇప్పుడు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నిస్సహాయంగా నిలబడింది. తెలంగాణలో తృతీయ స్థానంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఆరున్నర ఏళ్లు గడిచేసరికి కేసీఆర్‌కు పెనుసవాలుగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రసమితిని ఇంటిపార్టీగా ప్రచారం చేసి, రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉందా? అని ప్రశ్నిస్తూ వచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు తత్వం బోధపడి ఉంటుంది. గ్రేటర్‌ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు మాత్రమే నివసిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ డివిజన్లలో కారు పార్టీని ఓడించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్లతో పాటు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు గ్రేటర్‌ ఎన్నికలలో కేసీఆర్‌ పార్టీని ఆదుకున్నారు. ఆ వర్గాల మద్దతు లభించి ఉండకపోతే గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 20 డివిజన్లు కూడా లభించి ఉండేవి కాదు. కేవలం ఆరున్నరేళ్లలోనే తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఇంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? తన అధికారానికి ఎదురు ఉండకూడదన్న ఆలోచనతో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనం చేస్తూ వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఈ కారణంగానే కాంగ్రెస్‌ బలహీనపడినా భారతీయ జనతాపార్టీ బలపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల విముఖత ఏర్పరుచుకున్న ప్రజలు బీజేపీలో ప్రత్యామ్నాయాన్ని చూడటం మొదలుపెట్టారు. కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలంటే బీజేపీని ఆశ్రయించక తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్‌, ఇప్పుడు బీజేపీ చేతిలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్‌ అదే తప్పు చేశారు. పశ్చిమబెంగాల్‌లో బలంగా ఉండిన వామపక్షాలను మమతా బెనర్జీ బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. గ్రేటర్‌లో గత ఎన్నికలలో కేవలం పది శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ తాజా ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ కంటే అధికంగా ఓట్లు సాధించింది. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లుగా బీజేపీ ఇంతలా బలం పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.


కాంగ్రెస్‌ – తెలుగుదేశం పార్టీల తరఫున ఎవరైనా ఏ ఎన్నికల్లోనైనా గెలిస్తే వారిని తమ పార్టీలోకి కలిపేసుకుంటూ వచ్చిన కేసీఆర్‌ బీజేపీకి చెందిన వారిని మాత్రం ఆకర్షించలేకపోయారు. ఈ కారణంగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి బీజేపీనే కనిపిస్తున్నది. గ్రేటర్‌ ఎన్నికలలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. పూర్వపు బీజేపీ వేరు, మోదీ–అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ వేరు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రహించనట్టుగా ఉంది. ఈ కారణంగానే నిన్న దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌ ఎన్నికలలో బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థిగా కేసీఆర్‌ అండ్‌ కో ప్రచారం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి బీజేపీనే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. దీంతో కమలనాథులు, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దూకుడు పెంచి టీఆర్‌ఎస్‌ను తమ ఉచ్చులోకి లాగారు. బీజేపీని గెలిపిస్తే ప్రశాంత హైదరాబాద్‌లో మత ఉద్రిక్తతలు తలెత్తుతాయని కేసీఆర్‌, కేటీఆర్‌ గొంతు చించుకున్నప్పటికీ ప్రజలు ఆలకించలేదు. నగరంలో మతకల్లోలాలు సృష్టించడానికి కుట్ర చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ ప్రజలు నమ్మలేదు. పోలింగ్‌ రోజున కూడా చెప్పుకోదగ్గ ఘర్షణలు జరగకుండా అంతా ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతుందని చేసిన ప్రకటనల్లో డొల్లతనం బయటపడింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే కేసీఆర్‌ అండ్‌ కోకు ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు కనిపించాయి. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం విఫలమైంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్‌ పాల్గొన్న బహిరంగ సభతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తేలిపోయింది. ఈ సంగతి కనపడాల్సిన వారికి మాత్రం కనిపించలేదు. కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే అంతంతమాత్రంగా హాజరైన జనం లేచి వెళ్లిపోయినా ప్రమాదాన్ని పసిగట్టకపోవడం అతి విశ్వాసమే అవుతుంది. నిజానికి కేసీఆర్‌లో మునుపటి ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ప్రసంగాలలో ఇదివరకటి పదును లేదు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతూ వచ్చిన కేసీఆర్‌లో తెలియని నిస్పృహ కనిపిస్తోంది. బహుశా ఈ కారణంగానే కాబోలు, ఎల్బీ స్టేడియంలో బీజేపీ నాయకులను ‘ఆ నా కొడుకులు’ అని మాట తూలారు.


సర్వం కేసీఆర్‌ చుట్టూ...

గ్రేటర్‌ ఫలితాల తర్వాత రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. ఎవరు ఎటువంటి విశ్లేషణ చేసినా ఈ ఫలితాలకు ప్రధాన బాధ్యత కేసీఆర్‌ మాత్రమే తీసుకోవాలి. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా చేసిన ఆయన అంతా తానే అన్నట్టుగా వ్యవహారాలు నడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంతంగా ఆలోచించడం ఆపేశారు. ఎన్నికలంటే మా సారే చూసుకుంటారన్న భావన వారిలో ఏర్పడింది. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉండటాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దుబ్బాకలో అభ్యర్థిగా దివంగత రామలింగారెడ్డి భార్యకు కాకుండా దివంగత ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డికి పార్టీ టికెట్‌ ఇచ్చి ఉంటే టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పి ఉండేది. గ్రేటర్‌ ఎన్నికలలో లబ్ధి పొందాలన్న తాపత్రయంతో వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వ ఖజానా నుంచి వందల కోట్లు మళ్లించి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోగా అర్హులందరికీ సాయం అందకముందే గ్రేటర్‌ ఎన్నికలకు ముహూర్తం పెట్టారు. సంతృప్త స్థాయిలో సాయం అందకపోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. దీనికితోడు డబుల్‌ బెడ్రూం ఇళ్లపై ఆశలు పెట్టుకున్న వారంతా టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మీడియాను, అధికార యంత్రాంగాన్ని భయపెట్టి లొంగదీసుకుని అనుకూల ప్రచారం పొందడానికి అలవాటుపడిన కేసీఆర్‌ చిన్నపాటి విమర్శను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు.


అధికారిక సమావేశాలలో కూడా తాను మాత్రమే గంటల తరబడి మాట్లాడుతూ ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఫలితంగా ప్రజల మనోభావాలను కేసీఆర్‌కు తెలియజేయడానికి పార్టీలో కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి! తెలంగాణ ప్రయోజనాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్‌, ప్రజలు కూడా తన గురించి అలాగే భావిస్తారని నమ్మారు. ‘తెలంగాణ ప్రజలు నన్ను నమ్మక చస్తారా!’ అన్న అహం ఆయనలో ఏర్పడింది. కేసీఆర్‌ సృష్టించిన వాతావరణానికి అలవాటుపడిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. మొదటి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా తనకు తెలిసిపోయేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కేసీఆర్‌, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలాక్స్‌ అవడం మొదలెట్టారు. రోజుల తరబడి ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతూ నగరానికి వచ్చినా ప్రగతి భవన్‌ గడప దాటడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే! ప్రజలను కలుసుకోకుండా ఉంటున్న ముఖ్యమంత్రి కూడా కేసీఆర్‌ మాత్రమే! ప్రజలనే శత్రువులుగా భావించి ప్రగతిభవన్‌ పరిసరాలకు ఎవరూ రాకుండా శత్రుదుర్భేద్యంగా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో తనకు తాను బందీ అయ్యారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రజలు తన పార్టీకి విధేయులుగా ఉండకపోతారా? అని మితిమీరిన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు. యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో విఫలమయ్యారు. ప్రధాన మీడియాను అదుపు చేయగలిగినా సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ వ్యతిరేక ప్రచారాన్ని యువత ముమ్మరం చేసింది. ప్రభుత్వ విధానాలను, పాలనాయంత్రాంగం వైఫల్యాలను ఎవరైనా ఎత్తిచూపితే ఆయన వారిని శత్రువులుగా ప్రకటించుకున్నారు. ఆరున్నరేళ్ల పాలన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాజకీయాల్లో కేసీఆర్‌కు శత్రువులు తప్ప మిత్రులు లేకుండా పోయారు. ఇన్నాళ్లూ కాలం కలిసొచ్చింది కనుక ఈ లోపాలేమీ కనిపించి ఉండకపోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన చెప్పే మాటలను నమ్మి ఊగిపోయే పరిస్థితిలో తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు లేదు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లోనే కేసీఆర్‌ పరాభవాన్ని చవిచూశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లు మద్దతు ఇచ్చి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ పరిస్థితి ఏమిటి? అన్నది కేసీఆర్‌ గ్రహించుకోవాలి. సెటిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేయకపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా పరోక్షంగా సందేశాలు పంపడంతో సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలతో పాటు అమరావతి ప్రస్తుత దుస్థితికి బీజేపీ కూడా కారణమన్న అభిప్రాయంతో ఉన్న సెటిలర్లు, ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు, ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. ఇది జరిగి ఉండకపోతే గ్రేటర్‌ ఎన్నికలలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఘోర పరాభవం ఎదురై ఉండేది. తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉన్న నిజామాబాద్‌ ప్రజలు తన కన్నకూతురిని ఓడించినప్పుడే కేసీఆర్‌ కళ్లు తెరిచి ఉండాల్సింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మేనల్లుడు హరీశ్‌రావు కూడా దుబ్బాకలో పార్టీకి ఓటమిని తప్పించలేకపోయినప్పుడన్నా ఏం జరుగుతోందని కేసీఆర్‌ తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పుడు గ్రేటర్‌లో కొడుకు కేటీఆర్‌కు కూడా పరాభవం ఎదురైంది. ఈ కారణంగానే మొన్న కవిత, నిన్న హరీశ్‌, ఇప్పుడు కేటీఆర్‌, రేపు కేసీఆర్‌ వంతు అన్న పోస్టులు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేశాయి. కేసీఆర్‌కు ఇంకో మూడేళ్ల వ్యవధి ఉంది. ‘తెలంగాణ ప్రజలు నన్ను తిరస్కరించడం ఏమిటి?’ అని ప్రజలపై అలగకుండా స్థిమితంగా ఆలోచించడంతో పాటు ఆత్మపరిశీలన చేసుకోవడం ఆయనకు చాలా అవసరం. కేటీఆర్‌ కూడా తన పోకడను మార్చుకోవాలి. దర్జా లైఫ్‌కు అలవాటు పడితే కామన్‌మ్యాన్‌ దూరం అవుతాడని తెలుసుకోవాలి. ప్రజల్లో పట్టు లేనివారిని వెంటబెట్టుకుని వారినే ప్రోత్సహిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరిగింది. నగరం లోపల, వెలుపల విచ్చలవిడిగా జరుగుతున్న భూదందాలకు వెంటనే అడ్డుకట్ట వేయకపోతే కేసీఆర్‌ మరింత నష్టపోతారు.


ఇక బీజేపీ వైపు చూపు

ఏది ఏమైనా కేసీఆర్‌ స్వయంకృతాపరాధం వల్ల తెలంగాణలో బలం పెంచుకున్న బీజేపీ మున్ముందు ఎలా ఉండబోతుందన్న దాన్నిబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత బలపడుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. బండి సంజయ్‌ నాయకత్వంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడం గమనార్హం. ఇటు సంజయ్‌, అటు అర్వింద్‌ దూకుడు ఆ పార్టీకి కలిసొచ్చింది. కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచేవరకు తెలంగాణలో చాలామందికి తెలియని బండి సంజయ్‌ ఇవాళ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదిగారు. నగరంలో తమకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెర వెనుక చేసిన ప్రయత్నాలను తెలంగాణ బీజేపీ నాయకులు తమ పార్టీ అగ్రనాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ వైఖరి మారవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం టార్గెట్‌ చేసుకుని తీరుతుందని చెబుతున్నారు. వరుస పరాభవాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అంతా తనకే తెలుసు అనుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడానికి కేసీఆర్‌ మొగ్గుచూపితే, తెలంగాణ రాజకీయాలపై ఆయన తన పట్టును మళ్లీ బిగించవచ్చు. అలా జరగని పక్షంలో ఆయనకు ఇంటా బయటా సవాళ్లు తప్పవు. జాతీయస్థాయిలో ఢీ కొంటానని ప్రకటనలు చేసినందున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనను టార్గెట్‌ చేసుకోకుండా ఉండదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అని కమలనాథులు ఆరా తీయడం మొదలెట్టారు. బలమైన ఆధారాలు లభిస్తే కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించి మరింత బలహీనపరిచే ఎత్తుగడలకు బీజేపీ నాయకులు పదును పెడుతున్నారు. మజ్లిస్‌ సహకారంతో టీఆర్‌ఎస్‌కు మేయర్‌ పీఠం దక్కవచ్చు. బీజేపీ కోరుకుంటున్నది ఇదే. టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌ పార్టీల మధ్య నెలకొన్న మైత్రిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో పూర్తిస్థాయిలో బలపడాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు.


కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి?

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వద్దాం! జాతీయస్థాయిలోనే ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయినందున కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని భావించలేం. ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ రాష్ట్రస్థాయిలో ఆ పార్టీ నాయకులలో ఐకమత్యమే లేకుండాపోయింది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పరిస్థితికి మీడియానే కారణమని రేవంత్‌రెడ్డి నిందించారు. మీడియా మద్దతు ఉంటే చాలు, ఎన్నికలలో గెలిచిపోవచ్చు అని ఎవరైనా భావిస్తే అంతకంటే అవివేకం ఉండదు. టీఆర్‌ఎస్‌కు మీడియా మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ పరాభవం నుంచి తప్పించుకోలేకపోయారన్న వాస్తవాన్ని రేవంత్‌రెడ్డి గ్రహిస్తే మంచిది. కేసీఆర్‌కు సొంత పత్రిక, చానెల్‌ ఉన్నాయి. ఇతర పత్రికల చందాదారులందరికీ పదిరోజుల పాటు తన పత్రికను ఉచితంగా పంపిణీ చేసినా కేసీఆర్‌కు పరాభవం తప్పలేదు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత కూడా ఖమ్మంలో జరిగిన ఒక సభలో వేదిక మీదనే బహిరంగంగా పరస్పరం విమర్శించుకున్న కాంగ్రెస్‌ నాయకులను బాగుచేయడం మీడియా వల్ల అవుతుందా? రేవంత్‌ వంటి చురుకైన నాయకుడు నిరాశ నిస్పృహలతో మీడియాను నిందించి ఉండవచ్చు. రాజకీయాల్లో అవకాశం కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి. షార్ట్‌కట్‌లో ఎదిగిపోవాలనుకుంటే ఎవరి రాజకీయ జీవితమైనా అర్ధంతరంగా ముగిసిపోతుంది.

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.