వెళ్లారు.. వచ్చారు!

Nov 25 2021 @ 03:10AM

 • రైతన్నల పేరుతో బీజేపీపై కేసీఆర్‌ రాజకీయాస్త్రం!
 • అపాయింట్‌మెంట్లు లేకుండా ఢిల్లీ టూర్‌ ఉద్దేశం అదే! 
 • ధాన్యం సేకరణపై అమీతుమీ తేల్చుకుంటానని ప్రకటన
 • ప్రధాని మోదీ, అమిత్‌ షాను కలుసుకుంటానన్న కేసీఆర్‌
 • ఎవరినీ కలుసుకోకుండానే ముగిసిన సీఎం పర్యటన
 • మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా చేకూరని ప్రయోజనం
 • తెలంగాణకు అవమానంగా దాన్ని చిత్రీకరించే యోచన!
 • పీయూష్‌ గోయల్‌ కోసం వేచిచూసిన కేటీఆర్‌ బృందం
 • ధాన్యం సేకరణపై నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్ర మంత్రి
 • పీయూష్‌ అవమానించేలా మాట్లాడారని ఆరోపణలు
 • కేసీఆర్‌ పట్ల ఢిల్లీ వైఖరి మారిందా.. అనే సందేహాలు!


న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానితో అపాయింట్‌మెంట్‌ లేదు.. హోంమంత్రి, ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం తీసుకోలేదు. ధాన్యం సేకరణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటానంటూ ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర మంత్రులు, భారీ ప్రతినిధి వర్గంతో కలిసి ఢిల్లీలో మూడు రోజులు గడిపారు. కానీ, చివరికి ధాన్యం సేకరణ విషయంపై ఏమీ తే ల్చుకోకుండానే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ తిరుగుముఖం పట్టారు. దీంతోపాటు ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అసువులు బాసిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. మూడు రోజులు ఇక్కడే ఉండి కూడా ఏ రైతు నేతనూ కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. 


మొత్తంగా కేంద్రం వైఖరిని తెలంగాణకు అవమానంగా చిత్రీకరించి.. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకే కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటనను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. సాగు చట్టాల విషయంలో రైతులకు వ్యతిరేకంగా ముద్రపడ్డ ప్రధాని మోదీని తెలంగాణలో కూడా రైతు వ్యతిరేకిగా చిత్రీకరించాలన్న వ్యూహమే ఈ పర్యటన వెనుక ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా.. మంత్రి కేటీఆర్‌ బృందం మంగళవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయానికి వెళ్లడం ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటలదాకా అక్కడే కాలక్షేపం చేశారు. ఈ బృందం అనేకసార్లు ఫోన్‌ చేయడంతో పీయూష్‌ గోయల్‌ అప్పటికే అమెరికా ప్రతినిధుల వర్గం సమావేశంలో తలమునకలై ఉన్నా.. రాత్రి 7గంటలకు వీరిని కలుసుకునేందుకు రావాల్సివచ్చింది. 


పాత విషయాలే..

గతంలో కేసీఆర్‌ చేసిన డిమాండ్లనే మళ్లీ కేటీఆర్‌ బృందం పునరుద్ఘాటించడం, కేంద్రం విధాన నిర్ణయాలనే   గోయల్‌ స్పష్టీకరించడం తప్ప.. సమావేశంలో జరిగిందేమీ లేదు. కేంద్రం ఎంత మేరకు బియ్యం సేకరించగలదో ఈ నెల 26న స్పష్టత నిస్తామని   గోయల్‌ వారికి చెప్పారు. ప్రతి ఏడాది ఎంత కోటా ప్రకారం తాము బియ్యం కొనగలమో కూడా చెప్పగలమని, యాసంగిలో మాత్రం వరి పండించకుండా చూసుకోవాలని అన్నారు. దేశంలో డిమాండ్‌, ఎగుమతి అవసరాలకు సరిపడా మాత్రమే వరి పండించాలని తాము భావిస్తున్నట్లు మరోసారి చెప్పారు. ఉప్పుడు బియ్యం నిల్వలు ఇప్పటికే నాలుగేళ్లకు సరిపడా తమ వద్ద ఉన్నందున.. మళ్లీ వాటిని కొనే ప్రసక్తే లేదని, అయినా తెలంగాణలో ఉప్పుడు బియ్యం వినియోగం జరగడం లేదని పేర్కొన్నారు. పంజాబ్‌, గోఽధుమలు పండించే రాష్ట్రం కనుక అత్యధిక బియ్యాన్ని వినియోగించే తెలంగాణతో ఆ రాష్ట్రాన్ని పోల్చవద్దని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలన్నీ కేంద్రం విధానాన్ని గౌరవిస్తున్నప్పుడు తెలంగాణను ప్రత్యేకంగా చూడలేమని తెలిపారు. ఈ పరిణామాలతో.. ధాన్యం సేకరణ తదితర అంశాలపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటానని ఆదివారం రాత్రి ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌.. చివరికి ఎవరినీ కలుసుకోకుండానే బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. 


ముడి బియ్యం సేకరణపై చర్చించేందుకు మరో రెండు రోజుల తర్వాత రావాలని గోయల్‌ చెప్పిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. తన పార్టీ నేతల సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘సెప్టెంబరులో నేను కలిసినప్పుడు కూడా నాలుగు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని, మంత్రుల బృందం, వ్యవసాయ మంత్రులతో సమావేశం నిర్వహించి చెబుతామని పీయూష్‌ చెప్పారు. మళ్లీ ఇప్పుడు అదే పాట పాడుతున్నారు. కేంద్రం నుంచి మనకు న్యాయం జరిగే ఆశలు లేవు. 26 తర్వాత ఏం చేయాలో మన భవిష్యత్తు కార్యాచరణలో నిర్ణయిద్దాం’’ అని కేటీఆర్‌ బృందానికి కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రమే ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్రంపై విరుచుకుపడాలని కేసీఆర్‌ తొలుత భావించారని, కానీ.. మరో రెండు మూడు రోజులు వేచి చూడాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి.


అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా అవమానం..

అపాయింట్‌మెంట్లు సరిగా ఇవ్వకుండా, ఇచ్చినా తమ గోడు పట్టించుకోకుండా కేంద్ర మంత్రులు తమను అవమానించారని తెలంగాణ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చిన సమయంలోనే జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ జోధ్‌పూర్‌ వెళ్లడం, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి గోయల్‌ అడుగడుగునా అవమానించేలా వ్యవహరించడం తమకెంతో బాధ కలిగిస్తోందని తెలంగాణ నేతలు అంటున్నారు. ‘‘గోయల్‌  సోమవారం రాత్రి 9 గంటలకు మాకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి.. తర్వాత రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు రమ్మని సమాచారం పంపించారు. మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్‌మెంట్‌ కావాలని కోరితే వచ్చి వేచి చూడమని చెప్పారు’’ అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. తర్వాత తాము దాదాపు నాలుగు గంటలపాటు వేచి చూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

  

కేంద్ర మంత్రి దాటవేత ధోరణి..

నాలుగు గంటల నిరీక్షణ తరువాత జరిగిన సమావేశంలో  తెలంగాణ రైతులను అవమానించే విధంగా గోయల్‌ మాట్లాడారని టీఆర్‌ఎస్‌ నేతలు చె ప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అసలు తెలంగాణలో 25 లక్షల ఎకరాల్లోనే పంట పండించాలని, 62 లక్షల 13వేల ఎకరాల్లో పండాయని ఎలా లెక్కలు చెబుతున్నారని గోయల్‌ ప్రశ్నించడంతో నేతలు ముఖాముఖాలు చూసుకున్నారు. తెలంగాణలో కాళేశ్వరం సహా పలు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయని,  రైతులు పెద్ద ఎత్తున పంట పండించారని కేటీఆర్‌ సమగ్రంగా వివరించినప్పటికీ కేంద్ర మంత్రి సంతృప్తి చెందలేదు.  మీరు పండించినంత పంటను మేము కొనలేమని, యాసంగిలో అసలు వరి వేయకండి అని గోయల్‌ స్పష్టం చేశారు.   వానాకాలంలోనైనా 154 లక్షల టన్నులు కొనాలని, అది జరిగితే యాసంగి వరకు రైతులను మానసికంగా సిద్ధం చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. అయితే అంత మొత్తం కేంద్రం కొనుగోలు చేయలేదని, కావాలంటే 70-80 లక్షల టన్నుల వరకు సేకరించే విషయాన్ని పరిశీలిస్తామని గోయల్‌ అన్నారు.  2020-21 వానాకాలం సీజన్‌కు సంబంధించి కొనకుండా మిగిలిపోయిన 5.25 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం కొనుగోలు విషయంలోనూ కేంద్ర మంత్రి నుంచి నిరాకరణే ఎదురైంది. ఉప్పుడు బియ్యం ఒక్క కిలో కూడా కొనలేమని పీయూష్‌ గోయెల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.  


రైతు కుటుంబాలకు సాయం ఊసేదీ?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామన్న  తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఢిల్లీలో మూడు రోజులు ఉండి కూడా ఆ పని చేయలేదు. రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నంగానీ, ఆ సంఘాల నాయకులను పిలిపించుకునే ప్రయత్నంగానీ చేయలేదు. రైతులకు మద్దతుగా విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ‘సాయం’ ఏమయిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


మారిన ఢిల్లీ వైఖరి?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతకుముందు సెప్టెంబరులో రెండుసార్లు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, పీయూష్‌ గోయల్‌.. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. అమిత్‌ షా అయితే విజ్ఞాన్‌ భవన్‌లో రెండు సార్లు కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరపడమే కాకుండా, తన నివాసంలో కూడా మంతనాలు జరిపారు. ఈసారి కేసీఆర్‌కు మోదీ, అమిత్‌ షా నుంచి స్పందన లభించకపోవడమే కాకుండా గోయల్‌ కూడా అంటీముట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌ వరుసగా పత్రికా సమావేశాలు నిర్వహించి మోదీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చినందువల్లే కేసీఆర్‌ పట్ల కేంద్రం వైఖరి మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]jyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.